కెనరా బ్యాంక్ లాభం రూ.4,574 కోట్లు
ABN , Publish Date - May 12 , 2026 | 03:11 AM
గడిచిన ఆర్థిక సంవత్సరం (2025-26) మార్చితో ముగిసిన త్రైమాసికంలో కెనరా బ్యాంక్ నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 9.88 శాతం క్షీణించి రూ.4,574.23 కోట్లుగా...
బెంగళూరు (ఆంధ్రజ్యోతి): గడిచిన ఆర్థిక సంవత్సరం (2025-26) మార్చితో ముగిసిన త్రైమాసికంలో కెనరా బ్యాంక్ నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 9.88 శాతం క్షీణించి రూ.4,574.23 కోట్లుగా నమోదైంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో లాభం రూ.5,070.19 కోట్లుగా ఉంది. స్టాండ్‌ఎలోన్ ప్రాతిపదికన కూడా లాభం 9.94 శాతం తగ్గుదలతో రూ.4,505.70 కోట్లుగా నమోదైంది. సమీక్షా త్రైమాసికంలో స్టాండ్‌ఎలోన్ ఆదాయం 1.85 శాతం తగ్గుదలతో రూ.37,353 కోట్ల నుంచి రూ.36,662 కోట్లకు చేరుకుంది. అయితే ఈ కాలంలో నికర వడ్డీ ఆదాయం మాత్రం 4 శాతం వృద్ధితో రూ.9,442 కోట్ల నుంచి రూ.9,808 కోట్లకు పెరిగిందని కెనరా బ్యాంక్ సీఈఓ, ఎండీ (ఇన్‌చార్జ్), ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హర్‌దీప్ సింగ్ అహ్లువాలియా చెప్పారు. కాగా మార్చితో ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరానికి బ్యాంక్ నికర లాభం 12.7 శాతం వృద్ధి చెంది రూ.19,187 కోట్లుగా నమోదైంది. ఈ కాలంలో మొత్తం ఆదాయం కూడా రూ.1,42,208 కోట్ల నుంచి రూ.1,53,204 కోట్లకు పెరిగింది. ఈ కాలంలో స్థూల మొండి బకాయిలు (ఎన్‌పీఏ) 2.94 శాతం నుంచి 1.84 శాతానికి తగ్గినట్లు ఆయన పేర్కొన్నారు. నికర ఎన్‌పీఏలు కూడా 0.7 శాతం నుంచి 0.43 శాతానికి తగ్గాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు ఒక్కో షేరుకు రూ.4.20 డివిడెండ్‌ను సిఫారసు చేసింది. బ్యాంక్ గ్లోబల్ వ్యాపారం 12.11 శాతం వృద్ధి చెంది రూ.28,06,226 కోట్లుగా నమోదు కాగా డిపాజిట్లు 9.71 శాతం వృద్ధితో రూ.15,68,678 కోట్లకు చేరుకున్నాయి. మార్చి ముగిసే నాటికి బ్యాంక్ దేశవ్యాప్తంగా 10,097 శాఖలను నిర్వహిస్తోంది.
ఈ వార్తలనూ చదవండి:
ధరలను పెంచే యోచనలో ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలు.. నిత్యావసరాలు మరింత ప్రియం
అంతర్జాతీయ అనిశ్చితులు.. పసిడి ధరల్లో కోత