కెనరా బ్యాంక్ లాభం రూ.5,254 కోట్లు
ABN , Publish Date - Jan 30 , 2026 | 06:34 AM
ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.5,254 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే...
క్యూ3లో లాభంలో 25 శాతం వృద్ధి
బెంగళూరు (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.5,254 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే లాభం 25 శాతం (రూ.4,214 కోట్లు) వృద్ధి చెందింది. స్టాండ్ ఎలోన్ ప్రాతిపదికన నికర లాభం రూ.4,104 కోట్ల నుంచి రూ.5,155 కోట్లకు పెరిగినట్లు బ్యాంక్ పేర్కొంది. ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా కెనరా బ్యాంక్ ఇన్‌చార్జ్ సీఈఓ, ఎండీ హర్‌దీప్ సింగ్ అహ్లువాలియా మాట్లాడుతూ..సమీక్షా త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 1.13 శాతం వృద్ధితో రూ.4,104 కోట్లుగా నమోదైందని తెలిపారు. ఈ కాలంలో బ్యాంక్ మొత్తం గ్లోబల్ వ్యాపారం 13.23 శాతం పెరిగి రూ.27,13,594 కోట్లకు చేరుకుందన్నారు. ఈ కాలంలో గ్లోబల్ డిపాజిట్లు 12.95 శాతం పెరుగుదలతో రూ.15,21,268 కోట్లుగా ఉండగా దేశీయ డిపాజిట్లు 11.10 శాతం వృద్ధితో రూ.13,97,045 కోట్లుగా ఉన్నట్లు ఆయన చెప్పారు. రిటైల్ రుణ పోర్టుఫోలియో 31.37 శాతం పెరిగి రూ.2,73,395 కోట్లకు చేరుకోగా హౌసింగ్ రుణ విభాగం 17.58 శాతం వృద్ధి చెంది రూ.1,21,172 కోట్లకు చేరుకున్నట్లు ఆయన తెలిపారు. త్రైమాసిక సమీక్షా కాలంలో బ్యాంక్ స్థూల నిరర్ధక ఆస్తులు (జీఎన్‌పీఏ) 2.35 శాతం నుంచి 2.08 శాతానికి తగ్గగా నికర ఎన్‌పీఏలు 0.54 శాతం నుంచి 0.45 శాతానికి తగ్గినట్లు బ్యాంక్ పేర్కొంది. డిసెంబరు ముగిసే నాటికి బ్యాంక్ మొత్తం శాఖల సంఖ్య 10,066 గా ఉండగా ఏటీఎంల సంఖ్య 7,048గా ఉంది. లండన్, న్యూయార్క్, దుబాయ్ సహా గుజరాత్ ఐబీయూ గిఫ్ట్ సిటీలో 4 విదేశీ శాఖలను బ్యాంక్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌లు భవేంద్రకుమార్, సునీల్ కుమార్ ఛగ్, ఎస్‌కే మజుందార్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
అజిత్ పవార్ విమాన ప్రమాదం.. కాక్ పిట్‌లో చివరి మాటలివే..
భారీ నష్టాల నుంచి లాభాల వైపు.. చివర్లో కోలుకున్న దేశీయ సూచీలు