Share News

24,000 వద్ద నిలదొక్కుకుంటేనే..

ABN , Publish Date - Sep 07 , 2026 | 03:03 AM

నిఫ్టీ గత వారం ఆరంభంలో మానసిక అవధి స్థాయిలైన 24,000 దిగువకు పడిపోయిన తర్వాత రికవరీ కనబరిచింది. అయితే చివరి రెండు సెషన్లలో మరోసారి అదే స్థాయిల వద్ద గట్టి పరీక్షను ఎదుర్కొంది.

24,000 వద్ద నిలదొక్కుకుంటేనే..
sundararaja

టెక్‌ వ్యూ

నిఫ్టీ గత వారం ఆరంభంలో మానసిక అవధి స్థాయిలైన 24,000 దిగువకు పడిపోయిన తర్వాత రికవరీ కనబరిచింది. అయితే చివరి రెండు సెషన్లలో మరోసారి అదే స్థాయిల వద్ద గట్టి పరీక్షను ఎదుర్కొంది. చివరకు వీక్లీ ప్రాతిపదికన 277 పాయింట్ల (1.1శాతం) నష్టంతో 23,897 వద్ద క్లోజైంది. గడచిన ఐదు వారాలుగా మార్కెట్‌.. కరెక్షన్‌ ట్రెండ్‌లో సాగుతూ వస్తోంది. గత నాలుగు వారాల్లో గరిష్ఠ స్థాయిల నుంచి 1,000 పాయింట్ల వరకు నష్టపోయింది. ప్రస్తుతం మార్కెట్‌ ప్రధాన మద్దతు స్థాయి వద్ద ఉంది. గత మూడు వారాలుగా ఈ స్థాయిల వద్ద కరెక్షన్‌కు బ్రేక్‌ పడుతూ వస్తుండటంతో రికవరీకి అవకాశం ఉంది. అంతర్జాతీయ ట్రెండ్స్‌ సానుకూలంగా ఉండటంతో మార్కెట్‌ మరోసారి 24,000 స్థాయిల వద్ద గట్టి పరీక్షను ఎదుర్కోవచ్చు. టెక్నికల్‌గా చూస్తే ఈ స్థాయిల వద్ద పటిష్ఠతను సూచిస్తే స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌కు అవకాశం ఉంది.

మరోవైపు నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ కూడా 64,000 స్థాయిల వద్ద రియాక్షన్‌ను కనబరిచి 1,000 పాయిం ట్లు నష్టపోయి 63,000 స్థాయి వద్ద క్లోజైంది. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ మాత్రం స్వల్ప రికవరీతో నిలకడగా 20,000 స్థాయిల వద్ద ముగిసింది.

బుల్లిష్‌ స్థాయిలు: సానుకూల ట్రెండ్‌ కోసం మేజర్‌ నిరోధ స్థాయిలైన 24,000 పైన నిలదొక్కుకోవాలి. ఇది గత రెండు సెషన్లలో ఏర్పడిన గరిష్ఠ స్థాయి. కొద్ది రోజులు ఇక్కడ నిలదొక్కుకోవాలి. తదుపరి స్వల్పకాలిక నిరోధ స్థాయి 24,400. ఇక్కడ నిలదొక్కుకుంటే తదుపరి నిరోధ స్థాయిలు 25,000 ఎగువన ఉంటాయి.


బేరిష్‌ స్థాయిలు: నిఫ్టీ 24,000 వద్ద నిలదొక్కుకోలేకపోతే మరింత బలహీనతను సూచిస్తుంది. తదుపరి మద్దతు స్థాయిలు 23,700, 23,400. ఇక్కడ కూడా నిలదొక్కుకోకపోతే స్వల్పకాలిక బలహీనతను సూచిస్తుంది. స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలి.

బ్యాంక్‌ నిఫ్టీ: గత వారం ఈ సూచీ సైడ్‌వేస్‌ ట్రెండ్‌లో సాగుతూ వీక్లీ ప్రాతిపదికన 126 పాయింట్ల నష్టంతో 57,370 వద్ద క్లోజైంది. కొద్ది వారాలుగా ఈ ఇండెక్స్‌ 57,000 స్థాయిల వద్ద నిలకడగా ఉంటూ వస్తోంది. పాజిటివ్‌ ట్రెండ్‌ను సూచిస్తే 58,000 ఎగువన నిరోధం ఉంటుంది. ఇది గత ఐదు వారాల్లో ఏర్పడిన గరిష్ఠ స్థాయి. ఇక్కడ నిలదొక్కుకుంటే 58,700 వద్ద ప్రధాన నిరోధ స్థాయిలు ఉంటాయి. ఇది మూడు నెలల క్రితంగా ఏర్పడిన గరిష్ఠ స్థాయి. ఒకవేళ మద్దతు స్థాయిలైన 57,000 వద్ద నిలదొక్కుకోలేకపోతే స్వల్పకాలిక బలహీనతను సూచిస్తుంది. అప్రమత్తంగా ఉండాలి.

పాటర్న్‌: మార్కెట్‌ ప్రస్తుతం స్వల్పకాలిక ఓవర్‌సోల్డ్‌ పొజిషన్‌లో ఉన్నట్లు ఆర్‌ఎస్ఐ సూచిస్తోంది. సానుకూల ట్రెండ్‌కు అవకాశాలున్నాయి. ప్రస్తుతం 23,800 ఎగువన మార్కెట్‌ ఉంది. ఇది గత కొద్ది నెలల్లో చవిచూసిన ఐదు బాటమ్స్‌ ప్యాట్రన్‌ స్థాయి. నిఫ్టీ 24,000 స్థాయిల వద్ద 50,100 రోజుల చలన సగటు స్థాయిల్లో పరీక్షను ఎదుర్కొంటోంది. సానుకూలత కోసం ఇక్కడ కొద్ది రోజులు నిలదొక్కుకోవాలి.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం మంగళవారం మైనర్‌ రివర్సల్‌ ఉండవచ్చు.

సోమవారం స్థాయిలు

నిరోధం : 24,000, 24,140

మద్దతు : 23,780, 23,700

Updated Date - Sep 07 , 2026 | 03:03 AM