ఏప్రిల్ 1 నుంచి కేఫ్-3 నిబంధనలు
ABN , Publish Date - Oct 01 , 2026 | 05:42 AM
ప్యాసింజర్ వాహనాల (పీవీ) తయారీదారులకు ఇంధన సామర్థ్యం, కర్బన ఉద్గారాలకు సంబంధించి మరింత కఠిన లక్ష్యాలను నిర్దేశించేందుకు మూడో దశ కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ (కేఫ్-3) నిబంధనలను....
కార్ల ఇంధన వినియోగ నిబంధనలు కఠినతరం.. 2032 మార్చి 31 వరకు అమలు
పీవీల ఇంధన వినియోగం 17ు తగ్గింపు లక్ష్యం
స్వాగతించిన ఆటోమొబైల్ పరిశ్రమ వర్గాలు
న్యూఢిల్లీ: ప్యాసింజర్ వాహనాల (పీవీ) తయారీదారులకు ఇంధన సామర్థ్యం, కర్బన ఉద్గారాలకు సంబంధించి మరింత కఠిన లక్ష్యాలను నిర్దేశించేందుకు మూడో దశ కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ (కేఫ్-3) నిబంధనలను కేంద్ర ప్రభుత్వం మంగళవారం అధికారికంగా విడుదల చేసింది. 2027 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్న కేఫ్-3 నియమావళి ఆపై ఐదేళ్ల పాటు (2032 మార్చి 31 వరకు) వర్తించనుంది. ఆ ఐదేళ్లలో ప్యాసింజర్ వాహనాల ఇంధన వినియోగాన్ని దాదాపు 17 శాతం తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వాహన తయారీదారులు ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎలక్ట్రిక్, హైబ్రిడ్, ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలను ప్రోత్సహించడంతోపాటు ఇంధన ఆదా సాంకేతికతలను వినియోగించుకునేందుకు మరింత వెసులుబాటు కల్పించింది. కాగా, వాహన తయారీ పరిశ్రమ కొత్త నిబంధనలను స్వాగతించింది. ఈ ఐదేళ్ల ప్రణాళిక, మార్కెట్ ఆధారిత నిబంధనలు నమ్మకాన్ని పెంచడంతో పాటు తయారీదారులు పలు సాంకేతికతలను వినియోగించుకునేందుకు అనుమతించనుందని పరిశ్రమ అభిప్రాయపడింది.
కేఫ్-3 నియమావళి ఇంధన వినియోగ ప్రమాణాన్ని క్రమంగా మెరుగుపర్చనుంది. 2027-28 ఆర్థిక సంవత్సరంలో ఇంధన వినియోగ ప్రమాణాన్ని 100 కిలోమీటర్లకు 3.996 లీటర్లుగా నిర్ణయించింది. 2031-32 నాటికల్లా ఈ వినియోగాన్ని 3.3273 లీటర్లకు తగ్గించాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. అంటే, ఐదేళ్లలో ఇంధన వినియోగాన్ని 16.7 శాతం తగ్గించాల్సి ఉంటుంది. ఈ ప్రకారంగా కిలోమీటరుకు కర్బన ఉద్గారాన్ని 2027-28లో 94.8 గ్రాముల నుంచి 20231-32లో 78.9 గ్రాములకు తగ్గించాల్సి ఉంటుంది. కొత్త నిబంధనలు భారత్‌లో తయారు చేసే లేదా దిగుమతి చేసుకుని విక్రయించే అన్ని పీవీలకు (ఎలక్ట్రిక్, హైబ్రిడ్ మోడళ్లు సహా) వర్తిస్తాయి.
వాహన కంపెనీలు తమ పీవీ మోడళ్ల పోర్ట్‌ఫోలియో నిర్దేశిత సగటు ఇంధన వినియోగ లక్ష్యాన్ని చేరుకునేందుకు అధిక ఇంధనం వినియోగించే స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ (ఎ్‌సయూవీ)లను అధిక మైలేజీ ఇచ్చే పెట్రోల్ కార్లు, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ మోడళ్లలో సమతుల్యం చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త నియమాళిలో భాగంగా పీవీ తయారీదారులు తమ వాహన మోడళ్ల కర్బన ఉద్గారాలు, ఇంధన వినియోగ వివరాలను యేటేటా కేంద్రానికి సమర్పించాల్సి ఉంటుంది.
కొత్త నియమావళిలో వాహన ప్రమాణ భారాన్ని 1,082 కేజీల నుంచి 1,229 కేజీలకు పెంచింది ప్రభుత్వం. గతంతో పోలిస్తే 13.6 శాతం అధికం ఇది. అంటే, తక్కువ బరువుండే వాహనాలకు లక్ష్యాల్లో కొంత వెసులుబాటు లభించనుండగా.. అధిక బరువుండే వాహనాలు కఠిన ఇంధన వినియోగ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.
కంపెనీకి చెందిన అన్ని వాహన మోడళ్ల ఇంధన సామర్థ్యం సగటు లెక్కింపులో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ మోడళ్లకు అదనపు వెయిటేజీ లభించనుంది. ముఖ్యంగా బ్యాటరీ ఎలక్ట్రిక్ కార్లకు 3 రెట్లు, ప్లగ్ ఇన్ హైబ్రిడ్స్, ఇథనాల్ వంటి ఫ్లెక్స్ ప్యూయల్‌తో నడిచే స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడళ్లకు 2.5 రెట్లు, స్ట్రాంగ్ హైబ్రిడ్స్‌కు 1.6 రెట్లు, ఫ్లెక్స్ ఫ్యూయల్స్‌కు 1.1 రెట్ల వెయిటేజీ లభించనుంది. 1000 యూనిట్ల కంటే తక్కువ విక్రయాలు కలిగిన తయారీదారులను ఈ నిబంధన నుంచి మినహాయించారు.
కేఫ్ 3 నియమావళిలో గుర్తింపు కలిగిన ఇంధన ఆదా సాంకేతికతల జాబితాను 4 నుంచి 12కు విస్తరించారు. వాహనంలో ఈ టెక్నాలజీలను పొందుపరిచినందుకు గాను కంపెనీలకు కర్బన ఉద్గారాల నుంచి ఊరట కోరే వీలుంటుంది. ఒక్కో టెక్నాలజీకి గాను కిలోమీటరుకు ఒక గ్రాము కార్బన్ డై ఆక్సైడ్ (ఉదజని) తగ్గింపును, గరిష్ఠంగా కిలోమీటరుకు 9 గ్రాముల తగ్గింపును క్లెయిమ్ చేసుకోవచ్చు.
కేఫ్ 3 నిబంధనలు కార్బన్ న్యూట్రాలిటీ ఫ్యాక్టర్ ద్వారా ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలకు కర్బన ఉద్గారాల నిబంధనల నుంచి కొంత ఊరట కోరే అవకాశం కల్పించింది. 20 శాతం లేదా అంతకంటే అధికంగా ఇథనాల్ కలిపిన ఇంధనంతో నడిచే వాహనాలకు 8 శాతం, ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇఽథనాల్ వెహికిల్స్‌కు 22.3 శాతం, సీఎన్‌జీ వాహనాలకు 5 శాతం లేదా బయోగ్యాస్ మిలిత శాతానికి సమానమైన రాయితీ లభించనుంది.
ఈవీలు ఇక చౌక!?
కేఫ్-3 నిబంధనలకు అనుగుణంగా ఇంధన వినియోగం, కర్బన ఉద్గారాలను తగ్గించుకునేందుకు వాహన కంపెనీలు భవిష్యత్‌లో చిన్న, చౌక ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అలాగే, ఎస్‌యూవీ వంటి పెద్ద వాహనాలు, అధిక కర్బన ఉద్గారాలను విడుదల చేసే పెట్రోల్, డీజిల్ కార్ల ధరలు మరింత ప్రియంగా మారే అవకాశాలున్నాయి.
ఇవీ చదవండి:
ఆసియా క్రీడల్లో సునీల్ కుమార్ రికార్డ్.. వరుసగా రెండు పతకాలతో..
ఆసియా క్రీడలు: ఒకే రోజు నాలుగు స్వర్ణాలు.. ఆర్చరీలో హ్యాట్రిక్