2035 నాటికి రిటైల్ వ్యాపారం..
ABN , Publish Date - Feb 17 , 2026 | 05:35 AM
దేశంలో రిటైల్ వ్యాపారం శరవేగంగా విస్తరిస్తోంది. 2025 నాటికి రూ.90 లక్షల కోట్ల నుంచి రూ.95 లక్షల కోట్ల మధ్య ఉన్న ఈ వ్యాపారం 2035 నాటికి రూ.210 లక్షల కోట్ల నుంచి రూ.215 లక్షల కోట్లకు...
రూ.215 లక్షల కోట్లకు బీసీజీ, ఆర్‌ఏఐ నివేదిక
భవిష్యత్ భేష్
ఏఐ వినియోగంతో మరింత దన్ను
ముంబై: దేశంలో రిటైల్ వ్యాపారం శరవేగంగా విస్తరిస్తోంది. 2025 నాటికి రూ.90 లక్షల కోట్ల నుంచి రూ.95 లక్షల కోట్ల మధ్య ఉన్న ఈ వ్యాపారం 2035 నాటికి రూ.210 లక్షల కోట్ల నుంచి రూ.215 లక్షల కోట్లకు చేరనుంది. భారత రిటైల్ వ్యాపారంపై బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ), రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఆర్‌ఏఐ) సంయుక్తంగా విడుదల చేసిన ఒక నివేదిక ఈ విషయం పేర్కొంది. ప్రపంచంలో మరే దేశంలోనూ వచ్చే పదేళ్లలో రిటైల్ వ్యాపార వృద్ధి రేటు ఈ స్థాయిలో ఉండదని తెలిపింది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా (వికసిత్ భారత్) ఎదగాలన్న ప్రభుత్వ సంకల్పం ఇందుకు దోహదం చేయనుందని పేర్కొంది. అయుతే రిటైల్ వ్యాపార సంస్థల వృద్ధి క్రమశిక్షణతో కూడిన కార్యాచరణ, దృష్టి పెట్టాల్సిన అంశాలపై స్పష్టతలపై ఆధారపడి ఉంటుందని నివేదిక స్పష్టం చేసింది.
‘ఏఐ’ ప్రేరక శక్తి: అన్ని రంగాల్లానే రిటైల్ వ్యాపార విస్తరణ కూడా ఏఐ అమలుపై ఆధారపడి ఉంటుందని బీసీజీ-ఆర్‌ఏఐ నివేదిక పేర్కొంది. వినియోగదారుల నిర్ణయాలను టెక్నాలజీ ముఖ్యంగా ఏఐ త్రీవంగా ప్రభావితం చేస్తున్న విషయాన్ని నివేదిక గుర్తు చేసింది. జెనరేటివ్ ఏఐ ప్రయోగాత్మక దశ నుంచి విస్తృత వాడుక దశకు చేరిందని పేర్కొంది. అమెరికా పట్టణ వినియోగదారుల్లో ఇప్పటికే 42 శాతం మంది కొనుగోలు నిర్ణయాలను జెనరేటివ్ ఏఐ ప్రభావితం చేస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. మన దేశ పట్టణ వినియోగదారులు కూడా రోజురోజుకీ ఈ టెక్నాలజీకి అలవాటు పడతారని అంచనా వేసింది. రిటైల్ వ్యాపార రంగంలో సంస్థాగత మార్పులు, వినియోగదారులతో సంబంధాలు, నిర్వహణా విధానాలను మెరుగు పరచడంలో ఏఐ కీలక పాత్ర వహిస్తుందని నివేదిక తెలిపింది. దీంతో వాటి నిర్వహణా సామర్ధ్యమూ 40 నుంచి 60 శాతం మెరుగు పడుతుందని అంచనా వేసింది.
ఇవి కూడా చదవండి..
దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..