140 డాలర్లకు బ్యారల్ చమురు!
ABN , Publish Date - Apr 07 , 2026 | 03:23 AM
పశ్చిమాసియా యుద్ధం సెగలు బ్రోకరేజీ సంస్థలను కూడా భయపెడతున్నాయి. ఈ యుద్ధానికి వెంటనే తెరపడకపోతే చమురు ధర మరింత భగ్గుమనే ప్రమాదం...
భారత జీడీపీ, ద్రవ్యోల్బణానికీ సెగ
కోటక్ సెక్యూరిటీస్
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం సెగలు బ్రోకరేజీ సంస్థలను కూడా భయపెడతున్నాయి. ఈ యుద్ధానికి వెంటనే తెరపడకపోతే చమురు ధర మరింత భగ్గుమనే ప్రమాదం ఉందని కోటక్ సెక్యూరిటీస్ హెచ్చరించింది. బ్యారల్ బ్రెంట్ రకం ముడి చమురు ప్రస్తుతం 109-110 డాలర్ల మధ్య ట్రేడవుతోంది. ఈ నెలాఖరులోగా ఈ యుద్ధానికి తెరపడకపోతే ఇది 130 నుంచి 140 డాలర్ల వరకు ఎగబాకే ప్రమాదం ఉందని కోటక్ సెక్యూరిటీస్ కమోడిటీస్ అండ్ కరెన్సీ విభాగం రీసెర్చ్ హెడ్ అనింద్య బెనర్జీ హెచ్చరించారు. ఇదే జరిగితే భారత ఆర్థిక వ్యవస్థకి తీవ్ర ముప్పు తప్పదన్నారు.
ధరల సెగతో రిటైల్ ద్రవ్యోల్బణం 5 శాతం మించిపోవడంతో పాటు జీడీపీ వృద్ధి రేటూ 6 శాతం దిగువకు వస్తుందన్నారు. ఫ్యూచర్స్ మార్కెట్లో బ్యారల్ బ్రెంట్ రకం ముడి చమురు ధర ఇప్పటికే 20 నుంచి 30 డాలర్ల ప్రీమియంతో ట్రేడవుతున్న విషయాన్ని బెనర్జీ గుర్తు చేశారు. హోర్ముజ్ జలసంధి మూసివేత కొనసాగినంత కాలం రూపాయి పతనమూ కొనసాగుతుందన్నారు.
మాంద్యం ముంగిట అమెరికా
ఈ యుద్ధం మరో రెండు మూడు నెలలు కొనసాగితే అమెరికా ఆర్థిక వ్యవస్థ మరోసారి ఆర్థిక మాంద్యంలో చిక్కుకోవడం ఖాయమని బెనర్జీ చెప్పారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే ఆపసోపాలు పడుతుండటంతో పాటు డీడాలరైజేషన్ ప్రమాదాన్ని ఎదుర్కొంటోందన్నారు. వచ్చే 12 నెలల్లో అమెరికా ఆర్థిక మాంద్యంలోకి వెళ్లే అవకాశం ఉందని మూడీస్ అనలిటిక్స్ ఇటీవల జరిపిన ఒక సర్వేలో 49 శాతం మంది పేర్కొన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
మత్స్య ఎగుమతులపైనా ప్రభావం
గల్ఫ్ యుద్ధం మత్స్య ఎగుమతులనీ దెబ్బతీస్తోంది. నిజానికి మన మత్స్య ఎగుమతుల్లో గల్ఫ్ దేశాల వాటా చాలా తక్కువ. అయితే ఈ యుద్ధంతో అమెరికా, యూర్‌పలకు వెళ్లే మన మత్స్య ఎగుమతుల నౌకలు సూయజ్ కెనాల్, రెడ్‌సీకి బదులు దక్షిణాఫ్రికా తీరంలోని కేప్ ఆఫ్ గుడ్ హోప్‌ను చుట్టి వెళ్లాల్సి వస్తోంది. దీంతో నౌకా రవాణా చార్జీలు, ఇన్సూరెన్స్ రేట్లు గణనీయంగా పెరిగాయి. ఫలితంగా ప్రతి త్రైమాసికానికి సుమారు రూ.1,500 కోట్ల భారం పడుతుందని పరిశ్రమ వర్గాలు చెప్పాయి.
ఈ వార్తలూ చదవండి:
బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు..