అక్షయ తృతీయ.. పసిడి, వెండిలో పెట్టుబడులు ఎలా..
ABN , Publish Date - Apr 19 , 2026 | 02:30 AM
అక్షయ తృతీయ రోజున వీసమెత్తు బంగారమైనా కొనుగోలు చేయాలని చాలా మంది విశ్వసిస్తుంటారు. ఈ నెల 19, 20 తేదీల్లో...
అక్షయ తృతీయ రోజున వీసమెత్తు బంగారమైనా కొనుగోలు చేయాలని చాలా మంది విశ్వసిస్తుంటారు. ఈ నెల 19, 20 తేదీల్లో అక్షయ తృతీయ కావటంతో రిటైల్ నగల వ్యాపారులు ఇప్పటికే రకరకాల ఆఫర్లతో కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. ఇటీవల నగల కోసమే కాకుండా పెట్టుబడి లాభాల కోసం చాలా మంది అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఈక్విటీ మార్కెట్‌తో పాటు బులియన్ మార్కెట్ తీవ్ర ఆటుపోట్లు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో మీ పెట్టుబడుల పోర్టుఫోలియోలో బంగారం, వెండి కొనుగోళ్లు ఎంత ఉండాలో మీ కోసం..
మన దేశంలో ప్రజలకు ముఖ్యంగా మహిళలకు బంగారం, వెండిపై ఉన్న మోజు అంతా ఇంతా కాదు. పసిడి, వెండి ధరలు భారీగా పెరిగినా కొనుగోలు చేసేందుకు ఏ మాత్రం తగ్గటం లేదు. ఇందుకు గత ఆర్థిక సంవత్సరంలో బంగారం, వెండి దిగుమతులే నిదర్శనం. పొదుపు చేసిన నాలుగు రాళ్లలో ఎక్కువ భాగం ఈ రెండు లోహాలు కొనుగోలు చేసేందుకే చాలా మంది మహిళలు ఇష్టపడతారు. ఇక అక్షయ తృతీయ రోజైతే చెప్పే పనే లేదు. ఆ రోజు కొద్దిపాటి బంగారమైనా కొంటే ఏడాదంతా మహాలక్ష్మి ఇంట్లో కొలువై ఉంటుందని నమ్ముతారు. ఇందుకోసం నగల దుకాణాల్లో ముందుగానే బంగారం, వెండి ఆభరణాలు లేదా బిస్కెట్లు, నాణేల కోసం ఆర్డర్ పెట్టి అక్షయ తృతీయ రోజున డెలివరీ తీసుకుంటారు. ఈ రెండు లోహాలు దగ్గర ఉంటే చేతిలో నగదు ఉన్నట్టే అని చాలా మంది భావన. దీంతో కొనుగోలు చేసిన బంగారం, వెండిని పెట్టుబడిగా భావిస్తున్నారు. దీర్ఘకాలికంగా మంచి రిటర్నులు ఆర్జించాలనే వారికి ఈ రెండు లోహాల్లో పెట్టుబడులు చాలా బెటర్. ప్రస్తుతానికి ఆటుపోట్లు ఉన్నా.. మున్ముందు మంచి లాభాలు పంచుతాయని మార్కెట్ నిపుణుల అంచనా.
ఎంత ఇన్వెస్ట్ చేయాలంటే..
పెట్టుబడి లాభాల కోసం బంగారం, వెండిలో మదుపు చేసే మదుపరులు తమ మొత్తం పెట్టుబడుల్లో కనీసం 8 నుంచి 15 శాతం వరకు వీటిల్లో ఇన్వెస్ట్ చేయటం మంచిదని కోటక్ సెక్యూరిటీస్ కమోడిటీస్ రీసెర్చ్ ఏవీపీ కేనత్ చెయిన్‌వాలా అంటున్నారు. మళ్లీ ఇందులో 75 నుంచి 80 శాతం పసిడిలో, 20 నుంచి 25 శాతం వెండిలో పెట్టుబడిగా పెట్టడం బెటర్. బంగారానికి నగ లేదా తాకట్టు ప్రయోజనం మాత్రమే ఉంటుంది. ఎలకా్ట్రనిక్ వాహనాలు, ఎలకా్ట్రనిక్ ఉపకరణాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల వెండికి గిరాకీ మరింత వేగంగా పెరుగుతోంది. దీంతో బంగారం, వెండిలో సమానంగా పెట్టుబడులు పెట్టినా పెద్దగా ఢోకా ఉండదు.
బంపర్ లాభాలు
గత ఏడాది కాలంలో పసిడి, వెండి మదుపరులకు బంపర్ లాభాలు పంచాయి. గత ఏడాది అక్షయ తృతీయ నుంచి ఇప్పటి వరకు పసిడి ధర 63 శాతం పెరిగితే, వెండి ధర ఏకంగా 165 శాతం పెరిగింది. 2020 కొవిడ్ సమయం నుంచే పసిడి ర్యాలీ ప్రారంభమైందని చెప్పాలి. గత ఏడాది కాలంలో మరే పెట్టుబడులు ఇంత భారీ లాభాలు పంచలేదు. 2018 నుంచి చూసినా బంగారం మదుపరులకు ఏటా సగటున 25 శాతం చొప్పున లాభాలు పంచింది.
ఆటుపోట్లున్నా ముందుకే..
ఈ ఏడాది జనవరిలో దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. 10 గ్రాముల మేలిమి (24 క్యారట్స్) బంగారం రూ.1.83 లక్షలకు, కిలో వెండి ధర రూ.4 లక్షలకు చేరాయి. అయితే గత రెండు మూడు నెలలుగా లాభాల స్వీకరణ అమ్మకాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలతో బులియన్ మార్కెట్లో తీవ్ర దిద్దుబాటు చోటు చేసుకుంది. దీంతో ప్రస్తుతం కిలో వెండి రూ.2.53 లక్షల దగ్గర, 10 గ్రాముల మేలిమి బంగారం రూ.1.56 లక్షల వద్ద ట్రేడవుతున్నాయి. దీర్ఘకాలిక మదుపరులు పెట్టుబడి లాభాల కోసం ఈ దిద్దుబాటు సమయంలోనూ ముఖ్యంగా అక్షయ తృతీయ నుంచి ఈ లోహాల్లో కొద్దికొద్దిగా మదుపు చేయవచ్చని ఇన్వె్‌స్టమెంట్ నిపుణులు చెబుతున్నారు.
భవిష్యత్ భేష్
వచ్చే ఏడాది అక్షయ తృతీయ నాటికి 10 గ్రాముల పసిడి 32 నుంచి 33 శాతం లాభంతో రూ.2 లక్షల నుంచి రూ.2.1 లక్షలకు చేరుకుంటుందని మార్కెట్ వర్గాల అంచనా. మరోవైపు కేజీ వెండి కూడా 34 నుంచి 38 శాతం లాభంతో రూ.3.2 లక్షల నుంచి రూ.3.3 లక్షలకు చేరుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మదుపరులు ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా ప్రతి పతనంలో బంగారం లేదా సిల్వర్ ఈటీఎఫ్‌ల్లో మదుపు చేయటం మంచిదని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమోడిటీస్ విశ్లేషకులు మానవ్ మోదీ అంటున్నారు. ఈ అక్షయ తృతీయ నుంచే ఈ పెట్టుబడులు ప్రారంభిస్తే సెంటిమెంట్ కూడా కలిసి వస్తుంది. ప్రస్తుత స్టాక్ మార్కెట్ ఆటుపోట్ల నేపథ్యంలో ఇది మరింత సురక్షితమైన పెట్టుబడి అవుతుంది. పెట్టుబడుల అసలుకు ఏ మాత్రం ఢోకా ఉండదు.
ఈ వార్తలు కూడా చదవండి...
చెవిరెడ్డి కుటుంబ అవినీతి మెుత్తాన్నీ త్వరలో బయటపెడతాం.. పులివర్తి నాని వార్నింగ్
ఎల్‌ఓసీ రద్దు పిటిషన్‌పై సజ్జల భార్గవ్ రెడ్డికి హైకోర్టు షాక్