Share News

పెట్టుబడులు, వృద్ధి పైనే ఫోకస్‌

ABN , Publish Date - Feb 03 , 2026 | 05:12 AM

పెట్టుబడులు ప్రాధాన్య సాధనంగా ఆర్థిక వృద్ధిని పెంచడంపై ‘బడ్జెట్‌ 2026-27’ దృష్టి సారించిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. అలాగే ప్రభుత్వం వృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నదని...

పెట్టుబడులు, వృద్ధి పైనే ఫోకస్‌

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ: పెట్టుబడులు ప్రాధాన్య సాధనంగా ఆర్థిక వృద్ధిని పెంచడంపై ‘బడ్జెట్‌ 2026-27’ దృష్టి సారించిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. అలాగే ప్రభుత్వం వృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నదని ద్రవ్యలోటు నియంత్రణ లక్ష్యం తెలుపుతుందన్నారు. బడ్జెట్‌ విశేషాలను పంచుకునేందుకు సోమవారం మీడియా తో సమావేశంలో ఆమె ప్రస్తావించిన ముఖ్యాంశాలు..

  • అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగానే బంగారం ధరలు తీవ్ర ఒడుదుడుకులకు లోనవుతున్నాయి. ఆర్‌బీఐతోపాటు చాలా దేశాల సెంట్రల్‌ బ్యాంక్‌లు బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి. ఏ దేశ కరెన్సీపైనా నమ్మకం లేకపోవడం వల్లే ఇన్వెస్టర్లు బంగారం కొనుగోలుకు ఎగబడుతున్నారు.

  • డెరివేటివ్‌ ట్రేడింగ్‌లో స్పెక్యులేషన్‌ను తగ్గించేందుకే ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌ అండ్‌ ఓ) ట్రేడింగ్‌పై సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్‌టీటీ) పెంచాం. ఎఫ్‌ అండ్‌ ఓ ట్రేడింగ్‌లో తమ పిల్లలు డబ్బులు పోగొట్టుకుంటున్నారని, ప్రభుత్వం కలుగ జేసుకోవాలని చాలా మంది తల్లిదండ్రులు నాకు ఫోన్‌ కాల్స్‌ ద్వారా ఫిర్యాదు చేశారు.

  • ఈసారి ప్రభుత్వ ప్రాధాన్యం వృద్ధి. ద్రవ్యలోటును జీడీపీలో 4.3 శాతానికి కట్టడి చేస్తాం. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల నగదీకరణను కొనసాగిస్తాం. ఐడీబీఐ బ్యాంక్‌లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ పురోగతిలో ఉంది.

  • జీఎ్‌సటీ రేట్ల తగ్గింపు, వ్యక్తిగత ఆదాయం పన్ను మినహాయింపు పరిమితి పెంపుతో పెరిగిన వినియోగం మున్ముందూ కొనసాగుతుందన్న నమ్మకం ఉంది.

బడ్జెట్‌ సెషన్‌ ద్వితీయార్ధంలో ఐబీసీ సవరణ బిల్లు

ఈ మార్చి 9 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్‌ సెషన్‌ ద్వితీయార్ధంలో ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్‌రప్టసీ కోడ్‌ (ఐబీసీ) సవరణ బిల్లు, 2025ను ప్రవేశపెట్టనున్నట్లు సీతారామన్‌ తెలిపారు. ఈ బిల్లుపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీ తన నివేదిక ఇప్పటికే సమర్పించిందన్నారు. దివాలా స్మృతి చట్టంలో ప్రతిపాదించిన సవరణలు దివాలా పరిష్కార చర్యలను వేగవంతం, సమర్థవంతం చేయడంతోపాటు చట్టాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా మార్చనున్నాయని ఆమె పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

అత్యాశకు పోయి.. రూ.10 లక్షల అప్పు చేసి పసిడి కొంటే..

బంగారం @ 9 వేలు, వెండి @ 50 వేలు.. భారీగా పతనమైన ధరలు..

Updated Date - Feb 03 , 2026 | 05:12 AM