బడ్జెట్ 2026 హైలెట్స్: ఈ కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి..
ABN , Publish Date - Feb 01 , 2026 | 12:25 PM
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రభుత్వం వాక్చాతుర్యాన్ని కాకుండా సంస్కరణలను ఎంచుకున్నట్లు పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌ను 'యువశక్తి ఆధారితం' అని నిర్మల అభివర్ణించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రభుత్వం వాక్చాతుర్యాన్ని కాకుండా సంస్కరణలను ఎంచుకున్నట్లు పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌ను 'యువశక్తి ఆధారితం' అని నిర్మల అభివర్ణించారు. వికసిత భారత్‌లో భాగంగా యువత ఆకాంక్షలకు అద్దం పట్టేలా బడ్జెట్ రూపొందించామన్నారు. అలాగే పేదలు, వెనుకబడిన వర్గాలపై దృష్టి సారించామని చెప్పారు (Budget 2026 focus areas).
వస్త్రరంగంపై దృష్టి: దేశంలో కొత్తగా మెగా టెక్స్‌టైల్స్ పార్క్‌లు ఏర్పాటు చేయబోతున్నట్టు మంత్రి తెలిపారు. ఖాదీ, హ్యాండ్లూమ్, హస్తకళల ప్రోత్సాహకానికి కొత్త పథకం ప్రకటించారు. 200 పారిశ్రామిక క్లస్టర్స్ ఆధునీకరణకు చేయూత ఇవ్వబోతున్నట్టు తెలిపారు. వస్త్ర రంగ విస్తరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయబోతున్నామని, ఉపాధి కల్పనకు కూడా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
సెమీ కండక్టర్ 2.0: సెమీ కండక్టర్ ఇండియా మిషన్ 2.0 కోసం రూ.40 వేల కోట్లు కేటాయించనున్నట్టు మంత్రి ప్రకటించారు. పరిశోధన, శిక్షణ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించనున్నట్టు తెలిపారు. ఖనిజ సంపన్న రాష్ట్రాలైన ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు (semiconductors India).
మెడికల్ టూరిజం: ఆయుష్ ఫార్మసీలు, ఔషధ పరీక్షా ప్రయోగశాలలను అప్‌గ్రేడ్ చేయనున్నట్టు మంత్రి ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగం భాగస్వామ్యంలో ఐదు వైద్య పర్యాటక ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. వైద్య పర్యాటక కేంద్రాలలో ఆయుష్ కేంద్రాలు ఉంటాయని, రాబోయే సంవత్సరాల్లో 1.5 లక్షల మంది సంరక్షకులకు శిక్షణ ఇస్తామని మంత్రి చెప్పారు.
హై స్పీడ్ రైల్ కారిడార్లు: దేశంలోని ఏడు నగరాల మధ్య హై స్పీడ్ రైల్ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్-పుణె, హైదరాబాద్- బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, ఢిల్లీ-వారణాసి, వారణాసి-సిలిగుడి కారిడార్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.12.2 లక్షల కోట్లు కేటాయించనున్నట్టు పేర్కొన్నారు.
దేశీయ జల రవాణా: జాతీయ జల రవాణాలో భాగంగా తూర్పు-పశ్చిమ ప్రాంతలను అనుసంధానం చేయబోతున్నట్టు మంత్రి ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో కొత్తగా 20 జలమార్గాల అభివృద్ధిపై దృష్టి సారించనున్నట్టు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
పాకిస్థాన్‌తో ప్రపంచకప్ మ్యాచ్.. కుర్రాళ్లతో సచిన్, లక్ష్మణ్ చిట్‌చాట్..
ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..