ఏసీల ధరలు పెరుగుతున్నాయ్: బ్లూస్టార్
ABN , Publish Date - Mar 25 , 2026 | 05:55 AM
ఎయిర్ కండీషనర్స్ (ఏసీ) ధరలు పెంచుతున్నట్లు బ్లూస్టార్ లిమిటెడ్ వెల్లడించింది. ముడి పదార్ధాలైన కాపర్, అల్యూమినియం, ప్లాస్టిక్...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఎయిర్ కండీషనర్స్ (ఏసీ) ధరలు పెంచుతున్నట్లు బ్లూస్టార్ లిమిటెడ్ వెల్లడించింది. ముడి పదార్ధాలైన కాపర్, అల్యూమినియం, ప్లాస్టిక్ ధరలు పెరగటంతో పాటు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) నిబంధనలు అమల్లోకి రావటంతో ధరలు పెంచాల్సి వస్తోందని బ్లూస్టార్ గ్రూప్ ప్రెసిడెంట్ (యూనిటరీ కూలింగ్ ప్రొడక్ట్స్) మోహిత్ సూద్ తెలిపారు. మంగళవారం నాడిక్కడ మార్కెట్లోకి కొత్త ఏసీలను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముడి పదార్ధాల పెరుగుదల కారణంగా 8 శాతం వరకు, బీఈఈ నిబంధనలతో 4 శాతం వరకు ధరలు పెంచాల్సి వస్తోందన్నారు. ఈ 12 శాతం ధరల పెంపు ఈ నెలాఖరు లేదా ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్నాయన్నారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం, రూపాయి పతనం ఇప్పటికే పరిశ్రమపై పడిందని, మున్ముందు యుద్ధం ఇలాగే కొనసాగితే పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందన్నారు.
మార్కెట్లోకి ఐకానియా ఏసీలు
కాగా రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని మార్కెట్లోకి ప్రీమియం శ్రేణి ఐకానియా ఏసీలతో పాటు పలు కొత్త మోడళ్లను విడుదల చేసినట్లు ఆయన చెప్పారు. కొత్త టెక్నాలజీలు, ఏఐ ఫీచర్లతో వీటిని తీసుకువచ్చినట్లు సూద్ తెలిపారు. కంపెనీ పోర్టుఫోలియోలో మొత్తం 125 మోడళ్లు ఉండగా అందులో 50 స్మార్ట్ వైఫై మోడళ్లని ఆయన పేర్కొన్నారు. 2024లో ఏసీ విక్రయాల్లో 25 శాతం వృద్ధిని నమోదు చేయగా 2025 వేసవిలో ముందస్తు వర్షాలతో ఏసీలకు ఒక్కసారిగా డిమాండ్ పడిపోయిందని దీంతో వృద్ధి మైనస్ 5 శాతానికి పడిపోయిందన్నారు.
అయితే ఈ వేసవిలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని భావిస్తున్నామని, అందుకు తగ్గట్టుగానే ఏసీలకు డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు సూద్ చెప్పారు. దేశవ్యాప్తంగా బ్లూస్టార్ మార్కెట్ వాటా 14.2 శాతంగా ఉండగా ఏపీలో 14 శాతం, తెలంగాణలో 18 శాతం వాటా కలిగి ఉందని సూద్ తెలిపారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి ఏసీలకు ఎక్కువగా డిమాండ్ వస్తోందన్నారు.
ఇవీ చదవండి:
యుద్ధంతో ఇంధన సంక్షోభం, భారత్‌పైనా ఆ ప్రబావం ఉంది: మోదీ
క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు