సెప్టెంబరు నుంచి బీమా సుగమ్
ABN , Publish Date - Jul 01 , 2026 | 06:19 AM
బీమా పాలసీల మార్కెటింగ్ కోసం త్వరలోనే ‘బీమా సుగమ్’ ప్లాట్‌ఫామ్ అందుబాటులోకి రానుంది. ఈ ఏడాది సెప్టెంబరు నెలాఖరుకల్లా మూడు బీమా పాలసీలు అందుబాటులోకి వస్తాయని...
ముందుగా మూడు పాలసీలు
ఐఆర్‌డీఏఐ చీఫ్ అజయ్ సేథ్
న్యూఢిల్లీ: బీమా పాలసీల మార్కెటింగ్ కోసం త్వరలోనే ‘బీమా సుగమ్’ ప్లాట్‌ఫామ్ అందుబాటులోకి రానుంది. ఈ ఏడాది సెప్టెంబరు నెలాఖరుకల్లా మూడు బీమా పాలసీలు అందుబాటులోకి వస్తాయని భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ) చైర్మన్ అజయ్ సేథ్ ప్రకటించారు. ఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో ఆయన ఈ విషయం వెల్లడించారు. ఇందులో ఒకటి మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ కాగా, మిగతా రెండు పాలసీలు ఆరోగ్య, టర్మ్ పాలసీలని తెలిపారు. బీమా సుగమ్ ప్లాట్‌ఫాంతో బీమా కంపెనీల టెక్నాలజీ అనుసంధాన ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందన్నారు. అలాగే బీమా పాలసీల పంపిణీ సంస్కరణలకు సంబంధించి ఈ నెలాఖరులోగా ఒక చర్చా పత్రం విడుదల చేస్తామన్నారు. అన్ని రకాల బీమా పాలసీలను ఒకే ప్లాట్‌ఫామ్ ద్వారా అందించేందుకు దేశంలోని బీమా కంపెనీలు.. బీమా సుగం ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేశాయి. మిగతా డిస్ట్రిబ్యూటర్లతో పోలిస్తే సుగమ్ ప్లాట్‌ఫామ్ ద్వారా బీమా పాలసీలు తీసుకునేందుకు తక్కువ ఖర్చవుతుందని సేథ్ తెలిపారు.
రెండు కొత్త కంపెనీలకు గ్రీన్ సిగ్నల్: బీమా రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐకి ప్రభుత్వం అనుమతించిన తర్వాత రెండు కంపెనీల ప్రతిపాదనలకు అనుమతి ఇచ్చినట్టు సేథ్ తెలిపారు. అయితే ఆ కంపెనీల పేర్లు మాత్రం ఆయన వెల్లడించలేదు. జీవిత బీమా రంగంలోనూ 100 శాతం ఎఫ్‌డీఐకి కొన్ని విదేశీ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఇప్పటికే భారత కంపెనీలతో కలిసి జాయింట్ వెంచర్లు ఏర్పాటు చేసిన విదేశీ బీమా కంపెనీలు తమ వాటా పెంచుకునేందుకూ ఆసక్తి చూపిస్తున్నట్టు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
ధాన్యం ఉత్పత్తి, సేకరణలో దేశంలోనే తెలంగాణ టాప్: తుమ్మల
హీరో అవ్వాలని చూశాడు.. తిలక్ వర్మపై కృష్ణమాచారి సంచలన వ్యాఖ్యలు!