రూ.33,660 కోట్లతో భవ్య
ABN , Publish Date - Mar 19 , 2026 | 02:29 AM
దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక చర్య తీసుకుంది. ఇందుకోసం రూ.33,660 కోట్ల నిధులతో ‘భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన’ (భవ్య) పేరుతో ప్రత్యేక పథకం ప్రారంభించింది...
దేశవ్యాప్తంగా ప్రత్యేక పారిశ్రామిక పార్కులు.. 15 లక్షల మందికి నేరుగా ఉద్యోగాలు
100 నుంచి 1,000 ఎకరాల్లో ఏర్పాటు
న్యూఢిల్లీ: దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక చర్య తీసుకుంది. ఇందుకోసం రూ.33,660 కోట్ల నిధులతో ‘భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన’ (భవ్య) పేరుతో ప్రత్యేక పథకం ప్రారంభించింది. ప్రఽధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఇందుకు ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా పరిశమ్రలకు అవసరమైన అన్ని అత్యాధునిక మౌలిక సదుపాయాలతో 100 నుంచి 1,000 ఎకరాల విస్తీర్ణంలో 100 ప్రత్యేకపారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయబోతున్నట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి అశ్వని వైష్ణవ్ చెప్పారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేసే ఈ పార్కుల్లో 15 లక్షల మందికి నేరుగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.
ఏమిటీ పార్కుల ప్రత్యేకత?
పారిశ్రామికాభివృద్ధి కోసం దేశంలో ఇప్పటికే అనేక పార్కులున్నాయి. అయితే ఈ పార్కుల్లో భూ కేటాయింపుల వరకే ప్రభుత్వం చేస్తుంది. యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన మిగతా అన్ని అనుమతులు ఆయా సంస్థలే ఆయా శాఖల నుంచి తీసుకోవాలి. ఈ అనుమతులు పొందడంలో కంపెనీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీంతో పరిశ్రమల ఏర్పాటు ఆలస్యమై ప్రాజెక్టు వ్యయాలు పెరిగిపోతున్నాయి. భవ్య పారిశ్రామిక పార్కుల్లో మాత్రం అన్ని మౌలిక వసతులు, అనుమతులు వెంట వెంటనే అందుబాటులో ఉంటాయి. దీంతో కంపెనీలు వెంటనే తమ యూనిట్లను ఏర్పాటు చేసి ఉత్పత్తి ప్రారంభించవచ్చు. దీంతో దేశ, విదేశీ సంస్థలు ఈ పార్కుల్లో తమ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
మినీ జల విద్యుత్ ప్రాజెక్టులకు ప్రోత్సాహం
దేశంలో చిన్న జల విద్యుత్ కేంద్రాల ఏర్పాటును ప్రోత్సహించేందుకు కూడా కేంద్రప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. స్మాల్ హైడ్రో పవర్ డెవల్‌పమెంట్ స్కీమ్ (ఎస్‌హెచ్‌పీడీఎ్‌స) పేరుతో రూపొందించిన ఈ ప్రత్యేక పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.2,585 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద ఒక మెగావాట్ ఉత్పత్తి సామర్ధ్యం ఏర్పాటుకు రూ.2.4 కోట్ల నుంచి రూ.3.6 కోట్లు లేదా ప్రాజెక్టు వ్యయంలో 20 నుంచి 30 శాతం సబ్సిడీగా అందిస్తారు. అయితే ఈ సబ్సిడీ ఒక్కో ప్రాజెక్టుకు రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్లు మించకూడదు. ఈ మినీ జల విద్యుత్ ప్రాజెక్టుల ఉత్పత్తి సామర్ధ్యం ఒక మెగావాట్ నుంచి 25 మెగావాట్లు మించకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి..
జియో కీలక ప్రకటన.. రోమింగ్ ప్యాక్ లేకున్నా ఓటీపీలు
సూచీలకు వరుసగా మూడో రోజూ లాభాలే.. రూపాయి భారీ పతనం..