Share News

బ్యాంకు రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షన్‌ అప్‌డేట్‌ చేయాలి

ABN , Publish Date - Aug 24 , 2026 | 06:07 AM

బ్యాంకు రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షన్‌ అప్‌డేట్‌ చేయాలని ఆల్‌ ఇండియా బ్యాంక్‌ రిటైరీస్‌ ఫెడరేషన్‌ (ఏఐబీఆర్‌ఎఫ్‌) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. చాలా ఏళ్లుగా ఈ డిమాండ్‌ పెండింగ్‌లో...

బ్యాంకు రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షన్‌ అప్‌డేట్‌ చేయాలి

ఏఐబీఆర్‌ఎఫ్‌ డిమాండ్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): బ్యాంకు రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షన్‌ అప్‌డేట్‌ చేయాలని ఆల్‌ ఇండియా బ్యాంక్‌ రిటైరీస్‌ ఫెడరేషన్‌ (ఏఐబీఆర్‌ఎఫ్‌) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. చాలా ఏళ్లుగా ఈ డిమాండ్‌ పెండింగ్‌లో ఉందని, పెన్షన్‌ను అప్‌డేట్‌ చేయకపోవడం వల్ల రిటైర్‌ అయిన ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వస్తోందని పేర్కొంది. ఆదివారంనాడిక్కడ ఆంధ్రాబ్యాంక్‌ రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ఏబీఆర్‌ఈఏ) 12వ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏఐబీఆర్‌ఎఫ్‌ జనరల్‌ సెక్రటరీ ఎస్‌సీ జైన్‌ మాట్లాడుతూ.. పెన్షన్‌ అప్‌డేషన్‌ కోరుతూ 150 మంది పార్లమెంట్‌ సభ్యులకు మెమోరాండం సమర్పించామని, పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసి ఈ అంశాన్ని వారి దృష్టికి తీసుకువెళ్లినట్టు చెప్పారు. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఉద్యోగులకు పెన్షన్‌ అప్‌డేషన్‌ జరుగుతోందని, బ్యాంకు రిటైర్డ్‌ ఉద్యోగులకు కూడా ఇదేమాదిరిగా చేయాలన్నారు. ఏబీఆర్‌ఈఏలో 11,700 మంది సభ్యులు ఉండగా.. ఆదివారం జరిగిన సమావేశానికి 1,500 మందికి పైగా హాజరయ్యారని ఏబీఆర్‌ఈఏ రిసెప్షన్‌ కమిటీ చైర్మన్‌ బీఎస్‌ రామారావు తెలిపారు. పెన్షన్‌ అప్‌డేట్‌ జరిగితే 7.85 లక్షల మంది ప్రభుత్వరంగ బ్యాంకుల రిటైర్డ్‌ ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. యూబీఐ సీజీఎం ఎం రవీంద్రబాబు మాట్లాడుతూ.. ప్రస్తుతం తెలంగాణలో యూబీఐ 700 శాఖలతో రూ.2.10 లక్షల కోట్ల వ్యాపారం చేస్తోందని చెప్పారు. తెలంగాణ బ్యాంక్‌ రిటైరీస్‌ ఫెడరేషన్‌ జనరల్‌ సెక్రటరీ ఆర్‌ లక్ష్మణ్‌ రావు, ఆల్‌ ఇండియా యూనియన్‌ బ్యాంకు రిటైరీస్‌ ఫెడరేషన్‌ జనరల్‌ సెక్రటరీ ఆర్‌కె పొవార్‌, ఆల్‌ ఇండియా యూనియన్‌ బ్యాంక్‌ ఆఫీసర్స్‌ ఫెడరేషన్‌ ప్రెసిడెంట్‌ రాజ్‌కుమార్‌, ఏబీఆర్‌ఈఏ జనరల్‌ సెక్రటరీ ఎన్‌ఎస్‌ఎన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

అమెరికాలో భారతీయ వ్యాపారి హత్య.. నిందితుడి చిత్రాలు విడుదల..

అమెరికా ఒత్తిడికి తలవంచబోం.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు..

Updated Date - Aug 24 , 2026 | 06:07 AM