బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో ఐదేళ్లలో రూ.1.42 లక్షల కోట్ల మోసాలు
ABN , Publish Date - Jul 22 , 2026 | 02:19 AM
గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో దేశీయ బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థల్లో రూ.1.42 లక్షల కోట్ల ఆర్థిక మోసాలు జరిగాయని పార్లమెంట్‌కు కేంద్ర ప్రభుత్వం మంగళవారం...
న్యూఢిల్లీ: గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో దేశీయ బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థల్లో రూ.1.42 లక్షల కోట్ల ఆర్థిక మోసాలు జరిగాయని పార్లమెంట్‌కు కేంద్ర ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. అదే సమయంలో రూ.6,389 కోట్ల రికవరీ జరిగిందంటూ రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. కాగా, ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల రిపోర్టు ప్రకారం.. ఈ మార్చి 31 నాటికి 15,577 మంది రుణ ఎగవేతదారుల నుంచి బకాయిలు రాబట్టుకునేందుకు సర్ఫేసీ చట్టం కింద 10,894 కేసులను నమోదు చేయడం జరిగిందన్నారు. అలాగే, 7,173 కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లు కూడా నమోదయ్యాయన్నారు. ఈ మార్చి చివరినాటికి ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు రుణ ఎగవేతదారుల నుంచి రూ.52,360 కోట్లు రాబట్టుకోగలిగాయని మంత్రి తెలిపారు. ఇకపోతే, గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో రుణ బకాయిల వసూలుకు సంబంధించి బ్యాంక్‌లపై 18,021 ఫిర్యాదులు అందాయని మరో సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 8,623 ఫిర్యాదులతో పోలిస్తే రెట్టింపు కంటే అధికమైనట్లు చౌదరి వెల్లడించారు. బకాయిల రికవరీ విషయంలో రుణగ్రహీతలను వేధింపుల నుంచి రక్షించేందుకు 2025 నవంబరు 28న ఆర్‌బీఐ బ్యాంక్‌లకు స్పష్టమైన నిర్దేశకాలు జారీ చేసిందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ప్రభుత్వ అధీనంలోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
తప్పిపోయి.. జొన్నచేనులో నిద్రపోయి..!