ఏప్రిల్ 1 నుంచీ కొత్త ఏటీఎమ్ రూల్స్
ABN , Publish Date - Mar 22 , 2026 | 08:18 AM
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు కానున్న నేపథ్యంలో కొన్ని బ్యాంకులు ఏటీఎమ్, డెబిట్ కార్డు నిబంధనల్లో మార్పులు చేశాయి. అవేంటంటే..
ఇంటర్నెట్ డెస్క్: ఏప్రిల్ 1 నుంచీ కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో కొన్ని బ్యాంకులు తమ ఏటీఎమ్, డెబిట్ కార్డు నిబంధనల్లో మార్పులు చేశాయి. మరి అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఏటీఎమ్ ఉచిత ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కీలక మార్పు చేసింది. యూపీఐ ఆధారిత నగదు ఉపసంహరణలనూ నెలవారీ ఉచిత ఏటీఎమ్ ట్రాన్సాక్షన్స్ కేటగిరీలోకి చేర్చినట్టు పేర్కొంది. గతంలో ఈ లావాదేవీలను ప్రత్యేక కేటగిరీగా బ్యాంకు పరిగణించేది. ఏటీఎమ్ ఉచిత ట్రాన్సాక్షన్స్ పరిమితి దాటాక ప్రతి అదనపు లావాదేవీకి రూ.23 చొప్పున చార్జీలను కస్టమర్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రతి కస్టమర్ హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎమ్‌లల్లో ఐదు సార్లు ఎలాంటి చార్జీలు లేకుండా నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. మెట్రో నగరాల్లోని ఇతర బ్యాంకుల ఏటీఎమ్‌లల్లో విత్‌డ్రాల్స్, ఇతర లావాదేవీలు కలిపి గరిష్ఠంగా మూడు ట్రాన్సాక్షన్స్‌ను, నాన్ మెట్రో నగరాల్లో 5 ట్రాన్సాక్షన్స్‌ను ఉచితంగా పొందవచ్చు.
ఇక ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా డెబిట్ కార్డుల నగదు విత్‌డ్రాల్ పరిమితులను సవరించింది. ఏప్రిల్ 1 నుంచీ ఇవి అమల్లోకి రానున్నాయి. కస్టమర్లు తమ డెబిట్ కార్డు రకాన్ని బట్టి రోజుకు గరిష్ఠంగా రూ.50 వేల నుంచి రూ.75 వేల వరకూ నగదును తీసుకోవచ్చు. గతంలో 1 లక్షల వరకూ నగదు ఉపసంహరణకు అనుమతి ఉన్న కార్డుల పరిమితిలో కూడా కోత పడింది. రిస్క్ మేనేజ్‌మెంట్, కార్డుల వినియోగం తీరు తెన్నుల్లో ఏకీకృత విధానం కోసం బ్యాంకులు ఈ మార్పులు చేశాయని సమాచారం.
ఇక జియో పేమెంట్ బ్యాంకు తన కస్టమర్ల కోసం క్యూఆర్ కోడ్ ఆధారిత క్యాష్ విత్‌డ్రాల్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. బ్యాకింగ్ కరస్పాండెంట్స్ వద్ద కస్టమర్లు యూపీఐ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి చెల్లింపులను నిర్వహించవచ్చు. ఇక కస్టమర్లు తమ బ్యాంకు రూల్స్ గురించి పూర్తిగా తెలుసుకుని ఆ మేరకు లావాదేవీలను ప్లాన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ వార్తలూ చదవండి:
పోస్ట్ సేల్ డిస్కౌంట్ నిబంధనల్లో సడలింపు
డాక్టర్ రెడ్డీస్ నుంచి సెమాగ్లుటైడ్