Share News

‘ఆటో’ లాభాలకు రూ.25,000 కోట్ల గండి

ABN , Publish Date - May 04 , 2026 | 02:25 AM

గడచిన ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఆటోమొబైల్‌ కంపెనీల లాభాలకు రూ.25,000 కోట్ల మేర గండి పడే అవకాశం ఉందని భారత ఆటోమొబైల్‌ పరిశ్రమ ఆందోళన చెందుతోంది...

‘ఆటో’ లాభాలకు రూ.25,000 కోట్ల గండి

పర్యావరణ పరిరక్షణ నిబంధనలే కారణం

న్యూఢిల్లీ: గడచిన ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఆటోమొబైల్‌ కంపెనీల లాభాలకు రూ.25,000 కోట్ల మేర గండి పడే అవకాశం ఉందని భారత ఆటోమొబైల్‌ పరిశ్రమ ఆందోళన చెందుతోంది. పర్యావరణ పరిరక్షణ (ఎండ్‌ ఆఫ్‌ లైఫ్‌ వెహికల్స్‌)-2025 నిబంధనల అమలు కంపెనీల లాభాలపై ప్రభావం చూపించనుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. ఆటోమొబైల్‌ కంపెనీలు గతంలో విక్రయించిన వాహనాలకు పర్యావరణ పరిహారం (ఎన్విరాన్‌మెంటల్‌ కాంపన్సేషన్‌) కింద భారతీయ అకౌంటింగ్‌ ప్రమాణాలకు అనుగుణంగా కేటాయింపులు చేయాలని ఈ నిబంధన స్పష్టం చేస్తోందని, ఇది ఆటోమొబైల్‌ కంపెనీల పనితీరుపై ప్రభావం చూపించనుందని పరిశ్రమ నిపుణులు వెల్లడించారు. 2025 జనవరిలో పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఎండ్‌ ఆఫ్‌ లైఫ్‌ వెహికల్‌ నిబంధనలను నోటిఫై చేసిందని వారు తెలిపారు. అంతేకాకుండా ఆటోమొబైల్‌ కంపెనీ సంబంధిత ఉత్పత్తిని నిలిపివేసినా.. అప్పటి వరకు మార్కెట్లో ఉన్న వాహనాలకు ‘ఎక్స్‌టెండెడ్‌ ప్రొడ్యూసర్‌ రెస్పాన్సిబిలిటీ (ఈపీఆర్‌)’ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేస్తోందన్నారు. గతంలో కంపెనీలు విక్రయించిన అన్ని వాహనాలకు అంటే 15 ఏళ్ల ప్రైవేట్‌ వాహనాలు, 20 ఏళ్ల వాణిజ్య వాహనాలకు సంబంధించి ఈపీఆర్‌ సర్టిఫికెట్స్‌ కోసం ఆటోమొబైల్‌ తయారీదారులు ఆర్థిక కేటాయింపులు చేపట్టాల్సి ఉంటుందని పరిశ్రమకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ నిబంధన కంపెనీల నిధులను బ్లాక్‌ చేయటంతో పాటు లాభాలపై తీవ్ర ప్రభావం చూపించనుందన్నారు. ప్రస్తుత ప్రాథమిక అంచనాల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరానికి స్థూల ప్రాతిపదికన పరిశ్రమపై ఒకేసారి రూ.25,000 కోట్ల వరకు ప్రభావం పడనుందని పేర్కొన్నారు.


ఇందులో రూ.14,623 కోట్లు కార్ల తయారీ కంపెనీలదిగా ఉండగా ద్విచక్ర వాహన కంపెనీలకు సంబంధించిన మొత్తం రూ.9,650 కోట్ల వరకు ఉండనుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. ఇప్పటికే ఈ విషయాన్ని భారతీయ ఆటోమొబైల్‌ పరిశ్రమ సమాఖ్య (సియామ్‌).. మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకు వెళ్లిందన్నారు. అయితే ఈ నిబంధనలకు సంబంధించి ఇప్పటి వరకు మంత్రిత్వ శాఖ స్పష్టతనివ్వలేదని తెలిపారు. ఈ నిబంధనల్లో మార్పులు చేయకపోతే ఆటోమొబైల్‌ తయారీదారుల సామర్థ్యంపై ప్రభావం పడటమే కాకుండా కొత్త టెక్నాలజీలపై పెట్టుబడులు తగ్గిపోవటం సహా భవిష్యత్‌ ప్రణాళికలపై ప్రభావం పడనుందని పరిశ్రమ ప్రతినిధి ఒకరు తెలిపారు.

ఇవి కూడా చదవండి..

200 సీట్లలో గెలుస్తాం.. విజయ్ టీవీకే ధీమా

అస్సాంలో హోటల్ పాలిటిక్స్ సంకేతాలు.. రంగంలోకి కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ మేకర్ డీకే

Updated Date - May 04 , 2026 | 02:25 AM