సాంకేతిక లోపం.. భారీ మూల్యం చెల్లించుకున్న బ్యాంక్
ABN , Publish Date - Mar 19 , 2026 | 03:08 PM
క్యాష్ విత్‌డ్రా విషయంలో చోటుచేసుకున్న సాంకేతి లోపం కారణంగా ఓ బ్యాంక్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. 10 వేల రూపాయలకు గానూ ఏకంగా మూడు లక్షల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది.
సూరత్, మార్చి 19: క్యాష్ విత్‌డ్రా విషయంలో చోటుచేసుకున్న సాంకేతి లోపం కారణంగా ఓ బ్యాంక్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. 10 వేల రూపాయలకు గానూ ఏకంగా మూడు లక్షల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్ 2017, ఫిబ్రవరి 18వ తేదీన 10 వేల రూపాయలు విత్‌డ్రా చేయడానికి ఎస్‌బీఐ ఏటీఎమ్‌కు వెళ్లాడు. మిషన్‌లో కార్డ్ ఉంచి, పిన్ ఎంటర్ చేశాడు. అయితే, ఆ మిషన్ నుంచి డబ్బులు రాలేదు. కానీ, అకౌంట్‌నుంచి 10 వేల రూపాయలు డెబిట్ అయ్యాయని మెసేజ్ వచ్చింది.
దీంతో ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. ఈ విషయంపై బ్యాంక్ ఆఫ్ బరోడాకు పలు మార్లు ఫిర్యాదు చేశాడు. మార్చి నుంచి మే వరకు మెయిల్స్ ద్వారా బ్యాంక్ కస్టమర్ సపోర్ట్ టీమ్‌తో టచ్‌లో ఉన్నాడు. వారినుంచి సరైన స్పందన రాకపోవటంతో ఆర్‌బీఐతో పాటు ఇతర సంస్థలను ఆశ్రయించాడు. అయినా కూడా లాభం లేకపోవటంతో కన్సూమర్ ఫోరమ్‌కు వెళ్లాడు. విచారణ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ బరోడా తన వాదనలు వినిపిస్తూ.. ‘ ఆ ఏటీఎమ్ ఎస్‌బీఐకి చెందినది. మా రికార్డ్స్‌లలో ఆ లావీదేవీ విజయవంతం అయినట్లు చూపిస్తోంది. మాకు, దానికి ఎలాంటి సంబంధం లేదు’ అని అంది.
అయితే, కన్సూమర్ ఫోరమ్ మాత్రం బ్యాంక్ వాదనలు కొట్టిపారేసింది. లావాదేవీ విజయవంతం అయిందనడానికి సరైన ఆధారాలు చూపించమని అడిగింది. సరిగ్గా ఐదు రోజుల్లో కస్టమర్‌కు డబ్బులు చేరాలని కూడా ఆదేశించింది. అయితే, బ్యాంక్ మాత్రం ఐదు రోజులు గడిచినా కస్టమర్‌కు డబ్బులు తిరిగి ఇవ్వలేదు. దీంతో కన్సూమర్ ఫోరమ్ తాజాగా తుది తీర్పును ఇచ్చింది. 10 వేల రూపాయలకు సంవత్సరానికి 9 శాతం వడ్డీ వేసి ఇవ్వాలని, ఆలస్యం అయిన ఒక్కో రోజుకు 100 రూపాయలు ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాదు.. మానసికంగా వేధించినందుకు 3 వేల రూపాయలు.. కోర్టు ఖర్చుల కింద 2 వేల రూపాయలు ఇవ్వాలని తేల్చి చెప్పింది. ఫిబ్రవరి 26, 2026కు ఆ ఆలస్యం 3,288 రోజులకు చేరింది. దీంతో కస్టమర్‌కు సదరు బ్యాంక్ ఏకంగా 3,28,800 రూపాయలు చెల్లించాల్సి వచ్చింది.
ఇవి కూడా చదవండి
చెరకు లేదా పుచ్చకాయ.. వేసవిలో ఏది బెస్ట్?
అకాల వర్షాలు.. రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక సూచనలు