Share News

యాపిల్‌ కొత్త సారథి జాన్‌ టర్నెస్‌

ABN , Publish Date - Apr 22 , 2026 | 05:35 AM

కృత్రిమ మేధ (ఏఐ)తో సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్న తరుణంలో మరో అమెరికన్‌ టెక్నాలజీ కంపెనీలో నాయకత్వ మార్పులు చోటు చేసుకున్నాయి....

యాపిల్‌ కొత్త సారథి జాన్‌ టర్నెస్‌

సీఈఓ పదవి నుంచి తప్పుకుంటున్న టిమ్‌ కుక్‌

ఇక ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా పర్యవేక్షక పాత్రలోకి..సెప్టెంబరు 1న పగ్గాలు చేపట్టనున్న టర్నెస్‌

శాన్‌ఫ్రాన్సిస్కో: కృత్రిమ మేధ (ఏఐ)తో సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్న తరుణంలో మరో అమెరికన్‌ టెక్నాలజీ కంపెనీలో నాయకత్వ మార్పులు చోటు చేసుకున్నాయి. ఐఫోన్‌ తయారీ దిగ్గజం యాపిల్‌ ఇంక్‌ ప్రస్తుత సీఈఓ టిమ్‌ కుక్‌ సారథ్య బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. ఇక ఆయన ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా సంస్థ పర్యవేక్షకుడిగా కొనసాగనున్నారు. టిమ్‌ కుక్‌ కంపెనీ పగ్గాలను హార్డ్‌వేర్‌ ఇంజనీరింగ్‌ విభాగ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జాన్‌ టర్నె్‌సకు అప్పగించబోతున్నారు. సెప్టెంబరు 1న టర్నెస్‌ యాపిల్‌ కొత్త సీఈఓ గా బాధ్యతలు చేపట్టనున్నారు.

2001లో యాపిల్‌లో చేరిక: యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా నుంచి మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన జాన్‌ టర్నెస్‌.. 2001లో యాపిల్‌లో చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ 2013లో వైస్‌ ప్రెసిడెంగా, 2021లో హార్డ్‌వేర్‌ విభాగ అధిపతిగా నియమితులయ్యారు. గడిచిన రెండు దశాబ్దాలకు పైగా కాలంలో ఆపిల్‌ ఐఫోన్‌, ఐప్యాడ్‌, మ్యాక్‌ కంప్యూటర్‌, యాపిల్‌ వాచ్‌, ఎయిర్‌పాడ్స్‌ ఆవిష్కరణల్లో టెర్నస్‌ కీలకపాత్ర పోషించారు. యాపిల్‌ మ్యాక్‌ కంప్యూటర్ల విక్రయాలు మళ్లీ జోరందుకోవడంలో ఆయనదే ముఖ్య భూమిక. కాగా, జాన్‌ టర్నెస్‌ స్థానంలో జానీ స్రౌజీ యాపిల్‌ హార్డ్‌వేర్‌ విభాగ చీఫ్‌ ఆఫీసర్‌గా నియమితులయ్యారు.

అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌లోనూ: అంతర్జాతీయ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌, ఓటీటీ సేవల కంపెనీ నెట్‌ఫ్లిక్స్‌లోనూ గతంలో ఇదే తరహాలో నాయకత్వ మార్పు జరిగింది. అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ సీఈఓ బాధ్యతలను ఆండీ జెస్సీకి అప్పగించి ప్రస్తు తం కంపెనీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. నెట్‌ఫ్లిక్స్‌ సహ వ్యవస్థాపకుడు రీడ్‌ హాస్టింగ్స్‌ కూడా కంపెనీకి 25 ఏళ్ల పాటు సారథ్యం వహించిన అనంతరం బోర్డు చైర్మన్‌గా పర్యవేక్షక బాధ్యతల్లోకి మారారు.


కుక్‌ సారథ్యంలో కొత్త పుంతలు: 1998లో యాపిల్‌లో చేరిన టిమ్‌ కుక్‌.. 2011 ఆగస్టు 24న కంపెనీ సహ వ్యవస్థాపకుడు స్టీవ్‌ జాబ్స్‌ నుంచి పగ్గాలు చేపట్టారు. గడిచిన 15 ఏళ్లలో కంపెనీని కొత్త పుంతలు తొక్కించారు. కుక్‌ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో 35,000 కోట్ల డాలర్ల స్థాయిలో ఉన్న యాపిల్‌ మార్కెట్‌ విలువ.. పదిహేనేళ్లలో పదింతలకు పైగా పెరిగి 4 లక్షల కోట్ల డాలర్ల స్థాయిని దాటింది. అంటే, ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ బ్రిటన్‌ జీడీపీతో దాదాపు సమానం.

సీఈఓ @: 50

యాపిల్‌ సీఈఓగా టర్నెస్‌ 50 ఏళ్ల వయసులో బాధ్యతలు చేపట్టబోతున్నారు. టిమ్‌ కుక్‌ కూడా 50 ఏళ్లప్పుడే కంపెనీ పగ్గాలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి..

ఇరాన్‌తో చర్చలకు రమ్మంటే వస్తా: డొనాల్డ్ ట్రంప్

భారతీయ వీసా దరఖాస్తుదారులు.. గుడ్‌న్యూస్ చెప్పిన కెనడా..

Updated Date - Apr 22 , 2026 | 05:35 AM