Oxford Economics AI Report: ‘ఏఐ’తో అంత భయపడొద్దు
ABN , Publish Date - Jan 14 , 2026 | 05:59 AM
ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే భయం. కృత్రిమ మేధ (ఏఐ) దెబ్బతో ఉద్యోగాలు పోతున్నాయి. మనుషులు చేసే పనులన్నీ ఇక ఏఐ ఆధారిత రోబోలే చేస్తాయని..అయితే ఏఐ గురించి...
కృత్రిమ మేధతో పోయే ఉద్యోగాలు తక్కువే
ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్
వాషింగ్టన్: ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే భయం. కృత్రిమ మేధ (ఏఐ) దెబ్బతో ఉద్యోగాలు పోతున్నాయి. మనుషులు చేసే పనులన్నీ ఇక ఏఐ ఆధారిత రోబోలే చేస్తాయని..అయితే ఏఐ గురించి మరీ అంతగా భయపడాల్సిందేమీ లేదని ‘ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్’ తెలిపింది. గత ఏడాది అమెరికాలో ముఖ్యంగా టెక్ కంపెనీల్లో దాదాపు 1.25 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. వీరిలో ఐదింట నాలుగు వంతుల ఉద్యోగాలు పోవడానికి ఆర్థిక, మార్కెట్ పరిస్థితులే కారణం తప్ప, ఏఐ కారణం కాదని ఈ నివేదిక తెలిపింది. కేవలం 4.5 శాతం ఉద్యోగాల తీసివేతలకు మాత్రమే ఏఐ కారణమని స్పష్టం చేసింది.
ఫ్రెషర్స్‌దీ అదే పరిస్థితి
డిగ్రీలు పూర్తి చేసి కొత్తగా జాబ్ మార్కెట్లోకి వస్తున్న వారిలో నిరుదోగ్యం పెరిగిపోవడానికి ఏఐ ప్రధాన కారణం కాదని ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ పేర్కొంది. ఉన్న ఉద్యోగాల కంటే ఎక్కువ మంది గ్రాడ్యుయేట్లు ఉద్యోగ మార్కెట్లోకి రావడం, పరిశ్రమకు అవసరమైన డిజిటల్ నైపుణ్యాలు లేకపోవడం ఇందుకు ప్రధాన కారణమని తెలిపింది. స్పష్టం గా చెప్పాలంటే ఏఐ ఇంకా ఉద్యోగాలను గల్లంతు చేసేంత స్థాయికి ఎదగలేదని పేర్కొంది.
‘ఐటీ’పై ప్రభావం నిజమే: నాస్కామ్
అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంపై ముఖ్యంగా టెక్ కంపెనీలపై మాత్రం ఏఐ ప్రభావం స్పష్టంగానే కనిపిస్తోంది. మన ఐటీ, టెక్ కంపెనీల్లో 20 నుంచి 40 శాతం పనులు ఇప్పుడు ఏఐ ఆధారిత టూల్స్ ద్వారానే జరుగుతున్నాయి. ఐటీ, టెక్ కంపెనీలకు ప్రాతినిధ్యం వహించే నాస్కామ్ ఒక నివేదికలో ఈ విషయం పేర్కొంది. నాస్కామ్-ఇన్‌డీడ్ అనే పేరు తో ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. ప్రస్తుతం 40 శాతానికి పైగా సాఫ్ట్‌వేర్ డెవల్‌పమెంట్ పనులు ఏఐ టూల్స్ ద్వారానే జరుగుతున్న విషయాన్ని గుర్తు చేసింది. ఇంటెలిజెంట్ ఆటోమేషన్, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ (బీపీఎం) సేవల పనుల్లోనూ 37 నుంచి 39 శాతం వరకు ఏఐ ప్రధాన శక్తిగా మారింది.
ఇవీ చదవండి:
అల్ ఫలా వర్సిటీ క్యాంపస్ అటాచ్!
వారాణసీ స్కూళ్లలో తమిళం తరగతులు!