Share News

ఏఐ బూమ్‌తో ఎంట్రీ లెవెల్ ఈజీ జాబ్స్ కనుమరుగు: రమేశ్ దమానీ

ABN , Publish Date - Feb 05 , 2026 | 10:43 PM

ఏఐ ప్రభావంతో ఐటీ రంగంలో సంప్రదాయక ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు పోతాయని ప్రముఖ ఇన్వెస్టర్ రమేశ్ దమానీ హెచ్చరించారు. అయితే, ఈ ఉద్యోగాల స్థానంలో జీసీసీలు ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని తెలిపారు.

ఏఐ బూమ్‌తో ఎంట్రీ లెవెల్ ఈజీ జాబ్స్ కనుమరుగు: రమేశ్ దమానీ
AI Impact on Entry level Jobs in IT Sector

ఇంటర్నెట్ డెస్క్: ఏఐ వినియోగం పెరిగే కొద్దీ సంప్రదాయక ఎంట్రీ లెవెల్ ఐటీ జాబ్స్ (Entry Level IT Jobs) తుడిచిపెట్టుకుపోతాయని ప్రముఖ ఇన్వెస్టర్ రమేశ్ దమానీ (Ramesh Damani) అభిప్రాయపడ్డారు. ఐఐటీల్లోనూ ఈ ప్రభావం కనిపిస్తుందని అన్నారు. ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేశారు (AI Impact).

ఇంజినీరింగ్ పట్టభద్రులకు ఒకప్పుడు కాలేజీ చదువు పూర్తైన వెంటనే లభించిన సులభమైన ఎంట్రీ లెవెల్ జాబ్స్ కనుమరుగవుతాయని అన్నారు. కంపెనీలు ఏఐ ఆధారిత వ్యవస్థలవైపు మొగ్గు చూపే కొద్దీ ఈ మార్పులు తప్పవని చెప్పారు. ఏఐ బూమ్ శాశ్వతమని ఆయన అన్నారు. ఐటీ రంగంలో వస్తున్న భారీ మార్పులకు భారతీయ కంపెనీలు సిద్ధం కావాలని కూడా సూచించారు. అయితే, ఎంట్రీ లెవెల్ జాబ్స్ స్థానాన్ని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో ఉద్యోగావకాశాలు భర్తీ చేసే అవకాశం కూడా ఉందని చెప్పారు. సాఫ్ట్‌వేర్ రంగం స్థానాన్ని జీసీసీలు తీసుకుంటాయని చెప్పారు.


ఉద్యోగిత విషయంలో ఆందోళన నెలకొన్నప్పటికీ దీర్ఘకాలికంగా ఐటీ రంగంలో సుస్థిరత కొనసాగుతుందని చెప్పారు. గతంలో సాంకేతికత విప్లవాలు కూడా ఇలాంటి మార్పులను తీసుకొచ్చాయని అన్నారు. ప్రస్తుతం ఏటీఎమ్ స్పెషలిస్టులు, యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ల అవకాశాలు గతంలో ఉండేవి కావని గుర్తు చేశారు.

ఏఐతో ఉత్పాదకత గణనీయంగా పెరుగుతుందని అన్నారు. దాదాపు 350 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కలిగిన ఆంథ్రోపిక్ సంస్థలో కేవలం రెండు వేల మంది ఉద్యోగులే ఉన్నారని తెలిపారు. భారత దేశ టాప్ 7 ఐటీ కంపెనీల్లో మొత్తం 16 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్టు చెప్పారు. గతేడాది ఏఐ కారణంగా అమెరికాలో సుమారు 50 వేల మంది ఉద్యోగాలు కోల్పోయినట్టు కన్సల్టింగ్ సంస్థ ఛాలెంజర్, గ్రే అండ్ క్రిస్మస్ సంస్థ తెలిపింది.


ఇవి కూడా చదవండి..

భారత్‌కు ఆ స్వేచ్ఛ ఉంది.. ఏ దేశం నుంచైనా చమురు కొనొచ్చు: రష్యా అధికార ప్రతినిధి

బంగారం, వెండి ముందుకే.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Feb 05 , 2026 | 10:54 PM