Share News

ఏసీలు, టీవీల ధరలకు రెక్కలు

ABN , Publish Date - Sep 28 , 2026 | 04:51 AM

పండగల సీజన్‌ ప్రారంభానికి ముందే గృహోపకరణాలు, కన్స్యూమర్‌ ఎలక్ర్టానిక్స్‌ ధరలకు రెక్కలు రానున్నాయి...

ఏసీలు, టీవీల ధరలకు రెక్కలు

  • 8% వరకు పెరగనున్న ధరలు

  • అక్టోబరు ఒకటి నుంచి అమల్లోకి

  • ఈ ఏడాదిలో ఇది మూడోసారి

  • ముడి సరుకుల ధరలే కారణం

న్యూఢిల్లీ: పండగల సీజన్‌ ప్రారంభానికి ముందే గృహోపకరణాలు, కన్స్యూమర్‌ ఎలక్ర్టానిక్స్‌ ధరలకు రెక్కలు రానున్నాయి. ఎయిర్‌ కండీషనర్లు (ఏసీలు), ఎల్‌ఈడీ టీవీలు, వాషింగ్‌ మెషిన్లు, రిఫ్రిజిరేటర్లు తదితర ఉత్పత్తుల ధరలను ప్రముఖ కంపెనీలు 5ు నుంచి 8ు వరకు పెంచబోతున్నాయి. అక్టోబరు ఒకటో తేదీ నుంచి కొత్త ధరలను అమలు చేయనున్నాయి. రాగి, ఉక్కు, ముడి చమురు ఆధారిత ఉత్పత్తులు వంటి ముడి సరుకుల ధరలు పెరగటంతో పాటు పశ్చిమాసియా సంక్షోభంతో కరెన్సీ మారక విలువలో హెచ్చుతగ్గులు వంటివి ధరల పెంపునకు కారణమవుతున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. తాజా పెంపుతో ఈ ఏడాదిలో కంపెనీలు మూడోసారి ధరలను పెంచినట్టవుతుంది. మరోవైపు అధిక రవాణా వ్యయాల కారణంగా ధరల పెంపు అనివార్యమైనట్లు కంపెనీలు చెబుతున్నాయి.

ఏసీల ధరల్లో 5-8% పెంపు

ఇక ధరల మోత విషయానికి వస్తే.. ఏసీల ధరలు 5-8ు పెరగనున్నాయి. కొన్ని కంపెనీలు వాషింగ్‌ మెషిన్లు, రిఫ్రిజిరేటర్లు, ఎల్‌ఈడీ టీవీల ధరలను కూడా 3-4ు పెంచుతున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మరికొన్ని కంపెనీలు ధరల పెంపు విషయంలో తర్జనభర్జన పడుతున్నాయి. బ్లూస్టార్‌, గోద్రెజ్‌ అప్లయెన్సెస్‌, హాయర్‌, దైకిన్‌, సూపర్‌ ప్లాస్ర్టోనిక్స్‌ వంటి కంపెనీలు 4-10% వరకు ధరల పెంపును ఇప్పటికే ప్రకటించాయి. ఎల్‌జీ, బాష్‌ హోమ్‌ కంఫర్ట్‌ కూడా ఏసీల ధరలను దాదాపు 5ు పెంచినట్టుగా తెలుస్తోంది. ముడి సరుకుల ధరల్లో పెరుగుదల మూలంగా ఏసీలు, డీప్‌ ఫ్రీజర్ల ధరలు ఇప్పటికే 5-8ు పెరిగాయని బ్లూస్టార్‌ ఎండీ త్యాగరాజన్‌ తెలిపారు. యుద్ధం కారణంగా రాగి, ఉక్కు, ప్లాస్టిక్స్‌ అన్నీ ఖరీదైపోయాయని ఆయన చెప్పారు. ఈ ఏడాదిలో తమ కంపెనీ చేపట్టిన మూడో ధరల పెంపు ఇదని ఆయన అన్నారు.


పాత ధరలకు లభించే అవకాశం..

గత ధరల సవరణ తర్వాత కమోడిటీల ధరలు 8-10% పెరగడంతో పరిశ్రమవ్యాప్తంగా మరోసారి ధరల పెంపు అనివార్యమైనట్టు గోద్రెజ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కమల్‌ నంది తెలిపారు. వివిధ కేటగిరీల్లో ధరల పెంపు 5-7% ఉంటుందని, అయితే ఒక్కో బ్రాండ్‌ ఒక్కో సమయంలో అమలు చేయవచ్చని, కొన్ని కంపెనీలు అక్టోబరులో, మరికొన్ని నవంబరులో ధరలు పెంచే అవకాశం ఉందన్నారు. ధరల పెంపు మాత్రం తప్పదని చెప్పారు. అయితే ఒకటి, ఒకటిన్నర నెలలకు సరిపోయే సరుకు డీలర్ల వద్ద అందుబాటులో ఉండే అవకాశం ఉందని, దీంతో పాత ధరలతో ఉత్పత్తులు దీపావళి వరకు లభించే అవకాశం ఉందన్నారు. దీపావళి తర్వాత కొత్త ధరలు కచ్చితంగా అమల్లోకి వస్తాయని కమల్‌ తెలిపారు. కాగా అక్టోబరు 1 నుంచి ఆర్‌ఏసీ ధరలను 5ు పెంచుతున్నట్లు హాయర్‌ ఇండియా ప్రకటించింది. అలాగే ఎల్‌ఈడీ టీవీలు, వాషింగ్‌ మెషిన్లు తదితరాలపై 2-3% ధరల పెంపు ఉంటుందనిఽ పేర్కొంది. మరోవైపు సెప్టెంబరు 16 నుంచే ఏసీల ధరలను 8-10%పెంచినట్టు దైకిన్‌ ఇండియా వెల్లడించింది.

2030 నాటికి రూ.3.25 లక్షల కోట్లకు మార్కెట్‌

భారత కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌ మార్కెట్‌ గణనీయ వృద్ధితో 2030 నాటికి రూ.3-3.25 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ), భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సంయుక్త నివేదిక వెల్లడించింది. దీని మూలంగా దేశీయంగా మెటీరియల్స్‌, కాంపోనెంట్ల తయారీ రంగంలో అదనంగా రూ.50,000 కోట్ల అవకాశాలు ఏర్పడనున్నాయని తెలిపింది. వచ్చే ఐదేళ్లలో భారత్‌ ప్రపంచంలోనే శరవేగంగా వృద్ధి చెందుతున్న కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ మార్కెట్లలో ఒకటిగా ఉంటుందని అంచనా వేసింది. భారత మార్కెట్‌ 2030 వరకు ఏటా 8-10 శాతం వృద్ధి చెందే అవకాశం ఉందని, ఇదే కాలంలో 3,000-3,500 కోట్ల డాలర్లకు చేరుకోవచ్చని తెలిపింది.

ఈ వార్తలూ చదవండి

ఏఐ ముప్పు.. ఆ తప్పు మాత్రం చేయొద్దు.. టెకీలకు హెచ్చరిక

నీటిలో మునగకుండా జాగ్వార్‌ను ఎలా కాపాడారంటే

Updated Date - Sep 28 , 2026 | 04:51 AM