ఏసీ ధరలకు రెక్కలు
ABN , Publish Date - Mar 23 , 2026 | 06:19 AM
దేశంలో ఎయిర్ కండిషనర్ల (ఏసీ) తయారీదారులు తీవ్ర సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. సాధారణంగా మార్చి నెలలో ఏసీలకు డిమాండ్ అధికంగా ఉంటుంది...
పరిశ్రమపై గ్యాస్ సంక్షోభ ప్రభావం
న్యూఢిల్లీ: దేశంలో ఎయిర్ కండిషనర్ల (ఏసీ) తయారీదారులు తీవ్ర సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. సాధారణంగా మార్చి నెలలో ఏసీలకు డిమాండ్ అధికంగా ఉంటుంది. కాని ఈసారి అకాల వర్షాలతో వాతావరణం ఇంకా వేడెక్కలేదు. దాంతో ఏసీల అమ్మకాలు మందకొడిగా ఉన్నాయి. దీనికి తోడు ఇరాన్ యుద్ధంతో ఏర్పడిన గ్యాస్ సంక్షోభం గృహోపకరణాల తయారీ పరిశ్రమపై కూడా పడింది. సాధారణంగా రూమ్ ఏసీల పెయింట్ షాప్‌లు వాటిని అధిక టెంపరేచర్‌లో ఆరబెట్టేందుకు ఎల్‌పీజీని వినియోగిస్తారు. పశ్చిమాసియా సంక్షోభంలో ఏర్పడిన గ్యాస్ కొరతను అధిగమించి గృహస్థులకు వంట గ్యాస్ సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వడం లక్ష్యంగా ప్రభుత్వం పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు సరఫరాను వారి సగటు వినియోగంలో 80 శాతం నుంచి 65 శాతానికి తగ్గించింది. దీనికి తోడు ఏసీల తయారీలో వినియోగించే ప్లాస్టిక్ సహా ముడి పదార్థాల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. ఫలితంగా ఆ భారాన్ని కొంత మేరకైనా తగ్గించుకునేందుకు ఏసీలు, వాషింగ్ మెషీన్లు, ఇతర గృహోపకరణాల ధర 10-12ు వరకు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే ఈ ఏడాదిలో ఇది రెండో సారి ధరల పెంపు అవుతుంది. ఒకపక్క వాతావరణం కారణంగా ఇప్పటికే డిమాండ్ అంతంత మాత్రంగా ఉంటే రెండోసారి ధరల పెంపు డిమాండ్‌ను మరింత ప్రభావితం చేయవచ్చని గోద్రెజ్ గ్రూప్ బిజినెస్ హెడ్ కమల్ నంది అన్నారు. ధరల పెరుగుదలతో వినియోగదారులు రాజీ పడి తక్కువ నాణ్యత గల ఏసీల కొనుగోలుకు మొగ్గు చూపవచ్చన్న భయం కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. మార్చి చివరిలోగా పశ్చిమాసియా సంక్షోభం ఒక కొలిక్కి రాకపోతే వేసవి డిమాండ్‌పై పెద్దగా ఆశలు పెట్టుకోవడం కూడా వృధాయేనని బ్లూస్టార్ ఎండీ త్యాగరాజన్ అన్నారు.
ఇవి కూడా చదవండి
ప్రధాని మోదీ అరుదైన రికార్డ్.. అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు
ఐపీఎల్ 2026: వారి బ్యాటింగ్ అదుర్స్.. కానీ టైటిల్ మాత్రం గెలవడం కష్టం: రాబిన్ ఉతప్ప