Share News

నేడు ఈడీ ముందుకు అవినాశ్‌రెడ్డి

ABN , Publish Date - Oct 14 , 2026 | 04:43 AM

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ, వరసకు జగన్‌ సోదరుడు అవినాశ్‌రెడ్డి బుధవారం ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే ఆయనకు అధికారులు నోటీసులు జారీ చేశారు.

నేడు ఈడీ ముందుకు అవినాశ్‌రెడ్డి

  • వివేకా హత్యకు రూ.40 కోట్ల డీల్‌..

  • విచారణలో అప్రూవర్‌ దస్తగిరి వెల్లడి

  • దాని ఆధారంగా దూకుడు పెంచిన ఈడీ

  • అవినాశ్‌ తండ్రి భాస్కర్‌ రెడ్డి విచారణ

  • హత్యకు ముందు లావాదేవీలపై ఆరా

హైదరాబాద్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ, వరసకు జగన్‌ సోదరుడు అవినాశ్‌రెడ్డి బుధవారం ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే ఆయనకు అధికారులు నోటీసులు జారీ చేశారు. వివేకా హత్యలో పాల్గొన్న వారికి రూ.40కోట్లు ఇచ్చేలా ఒప్పందం జరిగిందని, అందులో భాగంగానే తనకు రూ.75లక్షల నగదు అందిందని అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఈడీ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. దస్తగిరికి రూ.75లక్షలు ఇచ్చి, తాను రూ.25లక్షలు ఉంచుకున్న సునీల్‌ యాదవ్‌ను సైతం ఇప్పటికే ఈడీ అధికారులు విచారించారు. హత్య జరిగిన తర్వాత నిందితుల్లో కొందరు ఎర్ర గంగిరెడ్డి ఇంట్లో సమావేశమైనట్టు పక్కా ఆధారాలు లభించాయి.


దీంతో ఎర్ర గంగిరెడ్డితోపాటు ఉమాశంకర్‌ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డిలను ఈడీ అధికారులు విచారించారు. మనీ ట్రయల్‌పై వారి వాంగ్మూలాలు నమోదు చేశారు. ఇప్పటి వరకు జరిగిన విచారణలో మొత్తం ఆరుగురు నిందితులను ఈడీ అధికారులు విచారించి, వారి వాంగ్మూలాలు నమోదు చేశారు. శివశంకర్‌ రెడ్డిని అయితే ఈడీ అధికారులు సుదీర్ఘంగా 11గంటలు విచారించగా, ఎర్ర గంగిరెడ్డిని రెండు రోజులు పాటు 16గంటలు ప్రశ్నించారు. వీరందరు చెప్పిన విషయాలు ఆధారంగా మనీ ట్రయల్‌లో భాగంగా డబ్బు ఒప్పందం ఎక్కడ జరిగింది? నిధుల ప్రవాహం వెనుక ఉన్నదెవరు? అంతా నగదు రూపంలోనే చెల్లింపులు జరిగాయా? ఆన్‌లైన్‌ ట్రాన్సక్షన్లు, ఆస్తుల కొనుగోళ్లు జరిగాయా అనే విషయాలను ఈడీ అధికారులు అవినాశ్‌రెడ్డి నుంచి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటికే ఈడీ అధికారులు పలువురు నిందితుల ఇళ్లల్లోనూ సోదాలు చేసి కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మనీ రూటింగ్‌లో స్పష్టత వచ్చిన తర్వాతే అవినాశ్‌ రెడ్డి, మరికొంతమందిని ఈడీ అధికారులు విచారించే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాగా, రూ.40కోట్ల మనీ డీల్‌పై దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు మంగళవారం వైఎస్‌ భాస్కర్‌ రెడ్డిని ఎనిమిది గంటలపాటు విచారించారు. వివేక హత్యకు ముందు తర్వాత జరిగిన ఆర్ధిక లావాదేవీలపై ఈడీ అధికారులు భాస్కర్‌రెడ్డిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

ఈ వార్తలనూ చదవండి:

కొత్త డీఎస్సీలో 290 పోస్టులు

గిన్నిస్‌ బుక్‌లోకి 75 గంటల డప్పుమోత

Updated Date - Oct 14 , 2026 | 04:43 AM