ఉద్యోగం పేరుతో అమెరికా తీసుకెళ్లి చిత్రహింసలు!
ABN , Publish Date - Oct 12 , 2026 | 04:55 AM
తన స్వగ్రామానికే చెందిన, బంధువు కూడా అయిన యువకుడిని ఉద్యోగం పేరుతో అమెరికా తీసుకెళ్లి, అక్కడ చిత్రహింసలకు గురిచేసి...
పల్నాడుకు చెందిన వైసీపీ నాయకుడి అరాచకం
50 నెలలు జైలు శిక్ష విధిస్తూ మిస్సోరి కోర్టు తీర్పు
వినుకొండ టౌన్, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): తన స్వగ్రామానికే చెందిన, బంధువు కూడా అయిన యువకుడిని ఉద్యోగం పేరుతో అమెరికా తీసుకెళ్లి, అక్కడ చిత్రహింసలకు గురిచేసిన కేసులో పల్నాడు జిల్లా వినుకొండ మండలం చీకటీగలపాలేనికి చెందిన వైసీపీ నేత సత్తార్ వెంకటేశ్వరరెడ్డికి అక్కడి మిస్సోరి కోర్టు 50 నెలలు జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలోనే తాను దివ్యాంగుడినని అంటూ అమెరికా ప్రభుత్వాన్ని మోసం చేసిన మరో కేసులో నష్టపరిహారం చెల్లించాలని కోర్టు గతంలో ఆదేశించిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. వెంకటేశ్వరరెడ్డి వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు కూడా సన్నిహితుడు! జగన్‌ను నేరుగా కలిసేంత చొరవ ఇతనికి ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ అండదండలతో అమెరికాలో ఉంటూనే వినుకొండలో పెత్తనం చేసేందుకు ఎత్తులు వేసినట్లు తెలిసింది.
తాను ఏం చేసినా అడిగేవారు లేరంటూ అరాచకాలకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వినుకొండ మండలంలో తల్లిని ఎంపీటీసీగా నిలబెట్టి ఎంపీపీగా ఏకగ్రీవంగా గెలిపించుకున్నాడు. అప్పటి స్థానిక ఎమ్మెల్యే పీఏపై చేయి చేసుకోవడంతో.. ఎమ్మెల్యే ఆయన ఆగడాలను గమనించి తల్లి ఎంపీపీ పదవికి చెక్‌పెట్టాడు. యువకులను కూడగట్టి అడపాదడపా వినుకొండ వస్తూ.. ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ, వైసీపీ రాష్ట్ర నాయకుడిగా ప్రచారం చేసుకున్నాడు. ఈ క్రమంలో అమెరికాలో మంచి భవిష్యత్ చూపిస్తానని ఇక్కడకు వచ్చినప్పుడల్లా స్వగ్రామంలోని బంధువైన మోర్తాల పుల్లారెడ్డికి చెప్పేవాడు.
సత్తార్ మాటలు నమ్మి పుల్లారెడ్డి 2022లో అమెరికా వెళ్లాడు. అమెరికాకి వెళ్లాక ఓ హోటల్‌లో అంట్లు తోమే పనిచూపటంతో పుల్లారెడ్డి నిరాకరించాడు. అప్పటి నుంచి అతడికి కష్టాలు ఎదురయ్యాయి. వెంకటేశ్వరరెడ్డి తన బావ నిఖిల్, ’స్నేహితుడు శ్రావణ్‌తో కలిసి నిత్యం పుల్లారెడ్డిని చిత్రహింసలకు గురిచేశాడు. పాస్‌పోర్ట్ తగలబెట్టి.. ఫోన్ పగలగొట్టారు. తిండి కూడా పెట్టలేదు. చివరకు పుల్లారెడ్డికి ఓ సెల్‌ఫోన్ షాపు వద్ద అమెరికాకు చెందిన ఓ వ్యక్తి పరిచయం కాగా.. అతడికి తన పరస్థితిని వివరించారు. ఈ నేపథ్యంలో మరోమారు పుల్లారెడ్డిని వెంకటేశ్వరరెడ్డి చిత్రహింసలకు గురిచేశాడు.
దీంతో తన దగ్గర ఉన్న చిన్న ఫోన్ ద్వారా అమెరికాకు చెందిన వ్యక్తికి పంపిన మెసేజ్ ఎట్టకేలకు పోలీసులకు చేరింది. దీంతో పోలీసులు పుల్లారెడ్డి ఉన్న ప్రాంతానికి వెళ్లి వెంకటేశ్వరరెడ్డిని, అతని బావ, స్నేహితుడిని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పుల్లారెడ్డిని తరచూ విద్యుత్ వైర్లు, బెల్టుతో వెంకటేశ్వరరెడ్డి కొడుతున్న వైనం సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. వెంకటేశ్వరరెడ్డిపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి 2024 డిసెంబరులో జైలుకు పంపించారు. తాజాగా కోర్టు శిక్ష విధించింది.
భార్య జీతంతో జీవనం..
హైదరాబాద్‌కు చెందిన చిన్ననాటి స్నేహితురాలిని వెంకటేశ్వరరెడ్డి పెళ్లి చేసుకున్నాడు. అమెరికాలో భార్య జీతంతో ఇతను జీవనం సాగించేవాడని సమాచారం. గతంలో అమెరికా సైన్యంలో చేరిన వెంకటేశ్వరరెడ్డికి శిక్షణ సమయంలో గాయాలయ్యాయి. అయితే భార్య తన భర్త దివ్యాంగుడంటూ అక్రమంగా పింఛన్ పొందినట్లు గుర్తించిన వ్యవహారంలో డిపార్ట్‌మెంట్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీకి 74,634 డాలర్లు, యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ వెటరన్స్ ఎఫైర్స్‌కు కింద 83,776 డాలర్లు కింద చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ తరుణంలోనే వెంకటేశ్వరరెడ్డి అక్కడ హోటల్ పెట్టాడు. అందులో స్వగ్రామం నుంచి తీసుకెళ్లిన పుల్లారెడ్డితో వెట్టిచాకిరీ చేయించేందుకు ముందస్తుగా మరోచోట పనిలో కుదిర్చినట్లు తెలిసింది.
ఈ వార్తలనూ చదవండి...
నెల్లూరులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్