వైసీపీ ప్రభుత్వంలో ఇళ్ల స్కామ్!
ABN , Publish Date - Oct 05 , 2026 | 04:29 AM
వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఇళ్ల స్కామ్‌పై సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు
వైసీపీ ప్రభుత్వంలో ఇళ్ల స్కామ్!
పేదలకు ఇళ్ల పేరుతో కొన్న 71 వేల ఎకరాల్లో భారీ కుంభకోణం
విచారణకు ఆదేశించండి.. చౌహాన్‌ను కోరిన మంత్రి మనోహర్
15 లక్షల భూమికి రూ.కోటి కట్టబెట్టారు
విచారణ జరిపితే గుట్టు రట్టవుతుంది
కేంద్ర మంత్రి చౌహాన్‌ను కోరిన మనోహర్
తెనాలి, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఇళ్ల స్కామ్‌పై సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు. గత వైసీపీ ప్రభుత్వంలో 2019-2024 మధ్య ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో ఇళ్ల స్థలాల కొనుగోలు, ఇళ్ల నిర్మాణం విషయంలో అక్రమాలు జరిగాయని, పేదల ఇంటి పేరుతో ఆ పార్టీ నేతలు అందినంత దోచేశారని అన్నారు. 71 వేల ఎకరాల కొనుగోలులో జరిగిన కుంభకోణాన్ని వెలికితీసి ప్రజాధనాన్ని పరిరక్షించాన్నారు. ఆదివారం గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో జరిగిన పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘గత జగన్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల పేరుతో 71 వేల ఎకరాలు కొనుగోలు చేసింది. ఎకరా రూ.15-20 లక్షలు కూడా పలకని వాటికి ప్రభుత్వ సొమ్ము నుంచి ఎకరాకు కోటి చొప్పున కట్టబెట్టారు. చెరువులు, తుప్పలు, కొండల్లో స్థలాలు కొనుగోలు చేసి దోచుకున్నారు’ అని పేర్కొన్నారు. ఆ ఐదేళ్లలో రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చామన్నారని.. అవి ఎక్కడిచ్చారు! ఎవరికిచ్చారని ప్రశ్నించారు. నేటికీ ఏ గ్రామం వెళ్లినా లబ్ధిదారులు పట్టాలు తీసుకొచ్చి చూపించి, తమ ఇంటి స్థలం ఎక్కడుందో చూపించాలని వేడుకుంటున్నారన్నారని మంత్రి తెలిపారు. పట్టాలిచ్చిన వారిలో 2.5 లక్షల మంది ఆ ఇళ్లు మాకొద్దని పట్టాలిచ్చేసి వెళ్లిపోయారంటే వాటి నిర్మాణం ఎట్లా ఉందో అర్థమవుతుందన్నారు.
పట్టణాల్లోని లబ్ధిదారులకు 15 కిలోమీటర్ల దూరంగా గ్రామీణ ప్రాంతాల్లో స్థలాలు కొనుగోలు చేసి, పట్టణ పరిధిలో రేట్లు చెల్లించారని అన్నారు. పేదల ఇంటి సెంటిమెంట్‌తో ఆడుకుని, వారిని కన్నీటిపాలు చేశారని విమర్శించారు. జగన్ సర్కారు అప్పట్లో కేంద్రం అందించే సాయాన్ని కాలదన్నారని, కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు కృషితో ఆ మొత్తాలను తిరిగి తీసుకురాగలిగామని పేర్కొన్నారు. నేడు పల్లెలు కళకళలాడుతున్నాయని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రోడ్లు, నీటి కుళాయిల ఏర్పాటుతో వారి సమస్యలను దూరం చేయటమే ఇందుకు కారణమన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ప్రకృతి సాగులో ఏపీ నంబర్ వన్.. సీఎం చంద్రబాబుకు శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రశంసలు
ఫిబ్రవరి 3న అమరావతి నుంచి తొలి క్వాంటమ్ కంప్యూటర్ ఆవిష్కరిస్తాం: సీఎం చంద్రబాబు