Share News

వైసీపీ యాగీ

ABN , Publish Date - Apr 08 , 2026 | 04:42 AM

వీకెండ్‌ కామెంట్‌’లో మహిళలను అవమానించారం టూ వైసీపీ నేతలు రచ్చకు దిగారు. హైదరాబాద్‌లోని ‘ఏబీఎన్‌ - ఆంధ్రజ్యోతి’ ప్రధాన కార్యాలయంపై దాడికి ప్రయత్నించారు.

వైసీపీ యాగీ

  • హైదరాబాద్‌లోని ‘ఏబీఎన్‌’ కార్యాలయంపై దాడి యత్నం

  • ధర్నా పేరుతో వచ్చిన వైసీపీ నేతలు

  • కార్యాలయంలోకి దూసుకెళ్లే యత్నం

హైదరాబాద్‌/తిరుపతి, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): ‘వీకెండ్‌ కామెంట్‌’లో మహిళలను అవమానించారం టూ వైసీపీ నేతలు రచ్చకు దిగారు. హైదరాబాద్‌లోని ‘ఏబీఎన్‌ - ఆంధ్రజ్యోతి’ ప్రధాన కార్యాలయంపై దాడికి ప్రయత్నించారు. శాంతియుత ప్రదర్శన పేరిట నానా యాగీ చేశారు. తిరుపతిలోనూ ‘ఆంధ్రజ్యోతి’ ప్రతులను తగలబెడుతూ, యాజమాన్యానికి వ్యతిరేకంగా అసభ్యకర పదజాలంతో వైసీపీ నేతలు నోరు పారేసుకున్నారు. జగన్‌ చేసిన ‘మావిగన్‌’ ప్రతిపాదనతో జనంలో పలుచనైన వైసీపీ నేతలు... దీని నుంచి దృష్టి మరల్చేందుకు వ్యూహం రచించారు. వైసీపీ తీరును విశ్లేషిస్తూ శనివారం ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’లో ప్రసారమైన ‘వీకెండ్‌ కామెంట్‌’లో మహిళలను అవమానించారంటూ రాద్ధాంతం మొదలుపెట్టారు. ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ సంస్థల ముట్టడికి రెండు రోజులుగా కసరత్తు మొదలు పెట్టారు. పథకం ప్రకారం మంగళవారం ఉదయం వైసీపీ నేతలు హైదరాబాద్‌ ఫిలిం ఛాంబర్‌ వద్ద కలుసుకున్నారు. ప్లకార్డులు పట్టుకొని అక్కడికి సమీపంలోని ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’ కార్యాలయం వైపు ఒక్క ఉదుటున పరుగులు తీశారు. అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకునే యత్నం చేయగా తోసుకుంటూ ముందుకు వెళ్లారు. ‘ఏబీఎన్‌’ యాజమాన్యాన్ని జుగుప్సాకరంగా దూషిస్తూ, ప్రధాన కార్యాలయం లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఎట్టకేలకు వైసీపీ నేతలను పోలీసులు నిలువరించి... హద్దులు దాటొద్దని గట్టిగా హెచ్చరించారు. దీంతో వైసీపీ నేతలు ‘ఏబీఎన్‌’ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్నామంటూనే దూషణలు చేస్తూ భయపట్టే ప్రయత్నం చేశారు. గంటకుపైగా అక్కడే ఉండి ఉద్రిక్తతలు సృష్టించారు. అక్కడి నుంచి కదలకపోతే కేసులు పెట్టాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించడంతో వెనక్కి తగ్గారు. ఈ ఆందోళన చేసిన వారిలో వైసీపీ నేతలు అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేశ్‌, జోగి రమేశ్‌, కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, మేరుగ నాగార్జున, రామసుబ్బారెడ్డి, నేదురుమల్లి రామకృష్ణారెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి, ఎస్వీ కృష్ణమోహన్‌ రెడ్డి, లక్ష్మీ పార్వతి, కారుమూరి వెంకట్‌ రెడ్డి, మార్గాని భరత్‌, ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ తదితరులు ఉన్నారు.

1.jpg


తిరుపతిలో అరాచకం..

తిరుపతిలో మంగళవారం వైసీపీ శ్రేణులు అరాచకం సృష్టించాయి. రాయలసీమ సాగునీటి పథకంపై చర్చ పేరిట సమావేశమై ‘ఆంధ్రజ్యోతి’పైనా, ఎండీ వేమూరి రాధాకృష్ణపైనా వైసీపీ నేతలు అక్కసు వెళ్లగక్కారు. ఆంధ్రజ్యోతి పత్రిక ప్రతులను, ఎండీ ఫొటోలను తగులబెట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రోజా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘ఇప్పటికి పత్రికతోనే సరిపెట్టాం.. ఈసారి ఏకంగా పత్రికా కార్యాలయాలే తగులబెడతాం’ అంటూ హెచ్చరించారు.

అంతా ప్లాన్‌ ప్రకారమే...

ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయిలో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన భవిష్యత్తు కార్యాచరణపై చర్చించే పేరిట మంగళవారం తిరుపతి డీపీఆర్‌ కల్యాణ మండపంలో వైసీపీ నేతలు సమావేశం ఏర్పాటు చేశారు. ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు, ముఖ్య కార్యకర్తలు హాజరు కావాలని పిలుపిచ్చారు. సమావేశం మాటున ‘ఏబీఎన్‌ - ఆంధ్రజ్యోతి’కి వ్యతిరేకంగా మంగళవారం తిరుపతిలో నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు ముందస్తుగా పథకం రూపొందించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి, మాజీ మంత్రులు నారాయణస్వామి, శైలజానాఽథ్‌, రోజా, జడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన రెడ్డి, లలితకుమారి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులురెడ్డి, వెంకటేగౌడ, సునీల్‌ కుమార్‌, నియోజకవర్గ సమన్వయకర్తలు భూమన అభినయ్‌, చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కరుణాకర రెడ్డి మాట్లాడుతూ..సమావేశం తర్వాత ‘ఏబీఎన్‌ - ఆంధ్రజ్యోతి’కి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపడుతున్నామని, అందరూ పాల్గొనాలని పిలుపు నిచ్చారు. అన్నట్టుగానే సమావేశం ముగిశాక కల్యాణ మండపం నుంచి కార్యకర్తలు వెలుపలికి వచ్చి వీరంగం సృష్టించారు. వారి చేతుల్లో ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక కట్టలున్న విషయం గుర్తించిన పోలీసులు వారిని అడ్డుకునేందుకు యత్నించారు. ఆ క్రమంలో వైసీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సమయంలో నేతలు వెలుపలికి వచ్చి రోడ్డుపై ‘ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి’కి, పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో కొందరు కార్యకర్తలు ‘ఆంధ్రజ్యోతి’ ప్రతులను, ఎండీ వేమూరి రాధాకృష్ణ ఫొటోలను తగలబెట్టారు. పోలీసులు నీళ్లు చల్లి అవి పూర్తిగా కాలిపోకుండా అడ్డుకున్నారు.


రోజా, కరుణాకర్‌రెడ్డిపై కేసులు

‘ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాకృష్ణను దుర్భాషలాడు తూ... పత్రిక ప్రతులను తగులబెట్టిన వైసీపీ నేత లపై తిరుపతి ఈస్ట్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా అంతటా పోలీస్‌ 30 యాక్ట్‌ అమలులో ఉన్నప్పటికీ వైసీపీ నాయకులు నిరసన ప్రదర్శనలు జరపడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి రోజా, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి సహా పలువురిపై కేసు నమోదు చేసినట్టు సీఐ శ్రీనివాసులు వెల్లడించారు. భూమన అభినయ్‌, చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, కార్పొరేటర్‌ అనిల్‌, వైసీపీ నాయకులు మల్లం రవిచంద్రారెడ్డి తదితరులపైనా కేసు నమోదు చేసినట్టు తెలిపారు. పోలీ సు ఆంక్షలను ఉల్లంఘించడం.. పత్రిక ప్రతులను తగలబెట్టడం.. వివిధ వర్గాల మధ్య వైషమ్యాలను సృష్టించే విధమైన వ్యాఖ్యలు చేయడంపై కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.

వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌కు బెదిరింపులు

వైసీపీ బెదిరింపుల వ్యవహారం పరాకాష్ఠకు చేరింది. ‘ఏబీఎన్‌’లో ‘వీకెండ్‌ కామెంట్‌ బై ఆర్కే’ చదివిన వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్ట్‌ మధురవాణికి వైసీపీ నేతలు ఫోన్‌చేసి బెదిరించారు. తనను పుట్టా ప్రతాప్‌గా పరిచయం చేసుకున్న అతడు.. ‘వీకెండ్‌ కామెంట్‌ ఎలా చదువుతావు’ అంటూ ఏకవాక్య ప్రయోగం చేస్తూ, దూషించాడు. పిన్నెల్లి రాజ్యాంగం అనే ఫేస్‌బుక్‌ పేజీలో కూడా మధురవాణిని బెదిరిస్తూ కొందరు పోస్ట్‌లు పెట్టారు. మహిళ అని కూడా చూడకుండా మధురవాణి ఫొటో పెట్టిమరీ... ‘జీతం కోసం దిగజారుతావా’ అంటూ అసభ్యకర వ్యాఖ్యలు పోస్టు చేశారు.

Updated Date - Apr 08 , 2026 | 04:42 AM