Share News

ఆందోళనకరంగా పక్షవాతం మరణాలు

ABN , Publish Date - Oct 12 , 2026 | 04:37 AM

దేశంలో పక్షవాతం మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయని వరల్డ్‌ స్ట్రోక్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూఎస్‌వో) అధ్యక్షుడు, ప్రముఖ న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌ జయ్‌రాజ్‌ డి.పాండియన్‌ తెలిపారు.

ఆందోళనకరంగా పక్షవాతం మరణాలు

  • రోగుల్లో 44 శాతం మంది మృత్యువాత

  • కొద్దిపాటి జాగ్రత్తలతో నివారణ సాధ్యమే

  • డబ్ల్యూఎస్‌వో అధ్యక్షుడు జయ్‌రాజ్‌ డి.పాండియన్‌ వెల్లడి

గుంటూరు మెడికల్‌, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): దేశంలో పక్షవాతం మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయని వరల్డ్‌ స్ట్రోక్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూఎస్‌వో) అధ్యక్షుడు, ప్రముఖ న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌ జయ్‌రాజ్‌ డి.పాండియన్‌ తెలిపారు. పక్షవాతం బారినపడినవారిలో 44 శాతం మంది మృత్యువాత పడుతున్నారని తెలిపారు. యుక్త వయస్కుల్లో కూడా పక్షవాతం కేసులు పెరగుతున్నాయని, ముందస్తు జాగ్రత్తలతో వీటిని నివారించవచ్చని చెప్పారు. ‘పక్షవాత చికిత్సల్లో నూతన మార్గదర్శకాలు’ అనే అంశంపై ఆదివారం న్యూరాలజిస్ట్‌లకు, ఎమర్జెన్సీ మెడిసిన్‌ స్పెషలిస్టులకు గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడులోని లలితా పీవీఎస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో వర్క్‌షాపు నిర్వహించారు. అంతకుముందు పక్షవాతం నుంచి కోలుకున్న రోగుల కోసం ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన రిహాబిలిటేషన్‌, స్పీచ్‌ థెరపీ సెంటర్‌ను ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ప్రారంభించారు. అలాగే, బ్రెయిన్‌ స్టిమ్యులేషన్‌ సెంటర్‌ను జయ్‌రాజ్‌ పాండియన్‌ ప్రారంభించారు. బీఫాస్ట్‌ ప్రచార బుక్‌లెట్లను ఆవిష్కరించారు.

అనంతరం జయ్‌రాజ్‌ మాట్లాడుతూ పక్షవాతం బారినపడిన వెంటనే తగిన చికిత్సలు అందకపోవడం వల్లే మరణాలు అధికమవుతున్నాయన్నారు. వైద్య వర్గాలతోపాటు ప్రభుత్వం కూడా ఈ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. పక్షవాతం బారినపడిన మొదటి నాలున్నర గంటల్లో థ్రాంబోసిస్‌ వైద్య చికిత్సలతో పాటు మెకానిల్‌ థ్రాంబెక్టమీ వంటి ఆధునిక శస్త్రచికిత్సలతో రోగి ప్రాణాలు కాపాడవచ్చని చెప్పారు. పక్షవాతం నుంచి కోలుకునే వారికి ఇటీవల రిపిటేటివ్‌ ట్రాన్స్‌ క్రేనియల్‌ మ్యాగ్నెటిక్‌ స్టిమ్యులేషన్‌ (ఆర్‌ టీఎంఎస్‌), రోబోటిక్‌ గ్లవ్స్‌ (మ్యాజిక్‌ గ్లవ్స్‌), న్యూరోమస్క్యులర్‌ ఎలక్ర్టానిక్‌ స్టిమ్యులేషన్‌, బొటాక్స్‌ థెరపీ ఎంతో మేలు చేస్తున్నాయన్నారు. డబ్ల్యూఎస్‌వో బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పి.విజయ మాట్లాడుతూ అక్టోబరును పక్షవాత అవగాహన మాసోత్సవంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

ఈ వార్తలనూ చదవండి...

నెల్లూరులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్

Updated Date - Oct 12 , 2026 | 04:37 AM