Share News

పనులు భేష్‌.. అ‘ధనం’గా ఇస్తాం

ABN , Publish Date - Oct 17 , 2026 | 04:13 AM

రాజధాని అభివృద్ధి పనులు నిధుల కొరత లేకుండా ముందుకుసాగే మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. అమరావతి నిర్మాణం, అభివృద్ధి పట్ల సంతృప్తిగా ఉన్న ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులు..

పనులు భేష్‌.. అ‘ధనం’గా ఇస్తాం

  • అమరావతి అభివృద్ధికి మరో 15 వేల కోట్లు

  • రుణం మంజూరుకు ప్రపంచబ్యాంకు, ఏడీబీ ఓకే

  • నిర్మాణాల పురోగతిపై రెండు సంస్థలూ సంతృప్తి

  • ఇప్పటికే 52 వేల కోట్లతో అమరావతిలో 102 పనులు

  • తాజా నిధులతో నిర్మాణాల్లో మరింత వేగం

గుంటూరు(రాజధాని), అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): రాజధాని అభివృద్ధి పనులు నిధుల కొరత లేకుండా ముందుకుసాగే మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. అమరావతి నిర్మాణం, అభివృద్ధి పట్ల సంతృప్తిగా ఉన్న ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులు అదనపు నిధులు సమకూర్చడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల రాజధాని ప్రాంత పర్యటనలో రెండు బ్యాంకుల ప్రతినిధులు పనుల పురోగతి, అభివృద్ధి, పెరుగుతున్న కార్యకలాపాల పట్ల సంతృప్తి వ్యక్తం చేయడంతో రుణ సహాయానికి మార్గం సుగమమైంది. దీంతో తాజాగా చేపడుతున్న పనులకు అవసరమైన రూ.15 వేల కోట్లు రుణం ఇచ్చేందుకు ఆ రెండు బ్యాంకులు ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

పనుల పురోగతిని పరిశీలించడానికి గత నెలలో మూడు రోజుల పాటు ప్రపంచబ్యాంకు, ఏడీబీ బ్యాంకు బృందాలు అమరావతిలో పర్యటించాయి. జరుగుతున్న పనులు, కార్మికుల సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి వంటివి వారు పరిశీలించారు. సీఆర్డీఏ అధికారులతో సమీక్షలు జరిపారు. ఈ సమయంలో అభివృద్ధికి అవసరమైన నిధుల కోసం ఏపీ సీఆర్డీఏ అధికారులు వారితో చర్చలు జరిపారు. మరో రూ.15 వేల కోట్ల రుణ ప్రతిపాదన ఆ బృందం ముందుంచారు. ప్రస్తుతం రాజధానిలో రాష్ట్ర శాసనసభ, హైకోర్టు, సచివాలయం, హెచ్‌ఓడీ టవర్లు, వరద నివారణ పనులు, ట్రంక్‌ మౌలిక సదుపాయాలు, ల్యాండ్‌- పూలింగ్‌ జోన్లలో మౌలిక సదుపాయాల కల్పన వంటి మొత్తం 102 పనులు జరుగుతున్నాయి. రూ.52,362 కోట్లతో ప్రభుత్వం ఈ పనులను చేపట్టింది. ఏపీ సీఆర్డీఏ, అమరావతి డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, అమరావతి గ్రోత్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఈ పనులను నిర్వహిస్తున్నాయి.


ఈ పనులకు అవసరమైన నిధులను ప్రపంచబ్యాంక్‌, ఆసియా అభివృద్ధి బ్యాంక్‌, హడ్కో, నాబ్‌ఫిడ్‌, నాబార్డ్‌ వంటి సంస్థల నుంచి అప్పు రూపంలో తీసుకున్నారు. రెండోదశ వరద నివారణ పనులు, సిగ్నేచర్‌, ఐకానిక్‌ వంతెనల నిర్మాణంపై ప్రభుత్వం ఇటీవల దృష్టి సారించింది. కొత్తగా ఇచ్చే నిధులకు సంబంధించి నిర్వహణ పర్యవేక్షణ కోసం ప్రోగ్రామ్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌ను నియమించాలని బ్యాంకు ప్రతినిధులు కోరిన నేపథ్యంలో ఆ ఏర్పాటు చేసే ఆలోచనలో సీఆర్డీఏ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కోరిన రుణం అందితే అమరావతి పనుల్లో మరింత వేగం పెరుగుతుంది.

ఈ వార్తలనూ చదవండి:

అంతా కొలిక్కి...

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు

Updated Date - Oct 17 , 2026 | 04:13 AM