Share News

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ నేడే టేకాఫ్

ABN , Publish Date - Aug 01 , 2026 | 06:50 AM

ఉత్తరాంధ్రకు కొత్త రెక్కలు తెచ్చిన అద్భుతం... భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఘట్టానికి సర్వం సిద్ధమైంది.

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ నేడే టేకాఫ్
Bhogapuram International Airport

ఏటికొప్పాక బొమ్మలతో స్వాగతం

  • అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం

  • ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం

  • 10.45 గంటలకు ప్రత్యేక విమానంలో మోదీ రాక

  • ఎయిర్‌పోర్టులో గవర్నర్‌, ముఖ్యమంత్రి ఆహ్వానం

  • థింసా, కూచిపూడి నృత్యాలతో ఘన స్వాగతం

  • 2.30 గంటల పాటు అక్కడ ఉండనున్న మోదీ

  • 17,900 కోట్ల బహుళ అభివృద్ధి కార్యక్రమాలకు

  • వర్చువల్‌గా శంకుస్థాపన, ప్రారంభం

  • తొలి సెమీ కండక్టర్‌ తయారీ కేంద్రానికి శంకుస్థాపన

  • ప్రారంభోత్సవ కార్యక్రమానికి 2 లక్షల మంది

  • 4 రోజులుగా ఏర్పాట్ల పర్యవేక్షణలో లోకేశ్‌ బృందం

  • ఎయిర్‌ ఇండియా షెడ్యూల్‌ వచ్చేసింది!

  • హైదరాబాద్‌, బెంగళూరు, బెజవాడలకు సర్వీసులు

న్యూఢిల్లీ, విజయనగరం, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రకు కొత్త రెక్కలు తెచ్చిన అద్భుతం... భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఘట్టానికి సర్వం సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ఎయిర్‌పోర్టును ఘనంగా ప్రారంభించి, జాతికి అంకితం చేస్తారు. అనంతరం ప్యాసింజర్‌ టెర్మినల్‌ భవనాన్ని ఆయన పరిశీలిస్తారు. భోగాపురం వేదికగా రూ.17,900 కోట్ల విలువైన బహుళ అభివృద్ధికార్యక్రమాలకు వర్చువల్‌గా శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రధాని రెండున్నర గంటల పాటు భోగాపురంలో ఉంటారు. అనంతరం కర్ణాటకకు బయలుదేరి వెళతారు. ఈ మేరకు ప్రధాని పర్యటన వివరాలను ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసింది. ఆయన ఉదయం 10.45 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో భోగాపురం ఎయిర్‌పోర్టులో దిగుతారు. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు స్వాగతం పలుకుతారు. 10.50 గంటలకు ఓపెన్‌ టాప్‌ జీపులో మోదీ టెర్మినల్‌కు చేరుకుంటారు. అక్కడ 13వేల మంది బాలికలు థింసా నృత్యం, 200 మంది విద్యార్థినులు కూచిపూడి నృత్యంతో స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి ఓపెన్‌ టాప్‌ జీపులో సభా వేదిక వద్దకు చేరుకుంటారు. 12.55 గంటల వరకూ అక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమాలు, ప్రసంగాలు కొనసాగుతాయి.


సాంకేతిక సొబగులు

భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో రూ.5,640 కోట్ల వ్యయంతో గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయంగా అభివృద్థి చేశారు. ఏటా 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా దీనిని నిర్మించారు. ఆధునికమైన, నిరాటంకమైన, సమర్థమైన ప్రయాణ అనుభవాన్ని అందించడం లక్ష్యంగా ప్రయాణికుల టెర్మినల్‌ భవనం రూపుదిద్దుకుంది. కార్యకలాపాల సామర్థ్యాన్ని పెంచేలా, భవిష్యత్తు విమానయాన అవసరాలను తీర్చేలా మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణహిత సౌకర్యాలను విమానాశ్రయంలో ఏర్పాటు చేశారు. కృత్రిమ మేధ (ఏఐ), బిల్డింగ్‌ ఇన్ఫర్మేషన్‌ మోడలింగ్‌ (బీఐఎం), ఎయిర్‌సైడ్‌ 4.0 సాంకేతిక పరిజ్ఞానం, ఎయిర్‌పోర్ట్‌ ప్రిడిక్టివ్‌ ఆపరేషన్స్‌ సెంటర్‌(ఏపీవోసీ), బయోమెట్రిక్‌ ప్యాసింజర్‌ ప్రాసెసింగ్‌, ఆటోమేటెడ్‌ బ్యాగేజి హ్యాండ్లింగ్‌ వ్యవస్థలు, ఇంటెలిజెంట్‌ ఆపరేషనల్‌ మానిటరింగ్‌ సొల్యూషన్స్‌ లాంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను ఏర్పాటు చేశారు.


రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ విమానాశ్రయాన్ని తీర్చిదిద్దారు. టెర్మినల్‌ పై కప్పు...సంప్రదాయ కాటేజీలను, అరకు లోయ ప్రకృతి దృశ్యాలను ప్రతిబింబిస్తుంది. అలాగే ఎగిరే చేప కదలికలను గుర్తు చేేసలా, ప్రాంతీయ నిర్మాణ శైలి, ఆధునిక విమానాశ్రయ డిజైన్‌ మేళవింపుగా దీనిని తీర్చిదిద్థారు. రాష్ట్రంలో పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి కల్పనకు ఈ విమానాశ్రయం గణనీయమైన రీతిలో ప్రోత్సహం ఇస్తుందని, ఈ ప్రాంతంతో విమానయాన అనుసంధానాన్ని బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. భోగాపురం విమానాశ్రయంలో అనేక పర్యావరణహిత సౌకర్యాలను ఏర్పాటు చేశారు. వీటిలో తక్కువ విద్యుత్తును ఉపయోగించే హీటింగ్‌, వెంటిలేషన్‌, ఎయిర్‌ కండిషనింగ్‌ (హెచ్‌వీఏసీ) వ్యవస్థలు, విద్యుత్తును ఆదా చేేస లైటింగ్‌, 5 మెగా వాట్ల సోలార్‌ విద్యుత్‌ కేంద్రం, వర్షపు నీటి నిల్వ వ్యవస్థ, స్మార్ట్‌ బిల్డింగ్‌ నిర్వహణ వ్యవస్థలు, వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాలు, విద్యుత్‌ వాహన చార్జింగ్‌ వసతులు, పర్యావరణ పర్యవేక్షణకు చర్యలు ఉన్నాయి. హరిత భవన ప్రమాణాలకు అనుగుణంగా టెర్మినల్‌ను నిర్మించారు. దీన్ని యూఎస్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (యూఎ్‌సబీసీ)లో నమోదు చేశారు.


4500 బస్సులు సిద్ధం

ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి సుమారు 2.10 లక్షల మంది రానున్నట్లు అధికారులు అంచనా వేశారు ఇందుకు తగ్గట్టు 4500 బస్సులను ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి శనివారం వేకువజామున బస్సులు ప్రారంభమవుతాయి. బస్సుల్లోనే ప్రజలకు టిఫిన్‌ అందేలా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం సభ ముగిసిన తరువాత భోజన పొట్లాలు అందిస్తారు. భోజన సరఫరా పనులను ఏజెన్సీలకు అప్పగించారు. మరోవైపు మండలాలు, నియోజకవర్గాలు, డివిజన్లు, జిల్లాలవారీగా క్లస్టర్లను విభజించి అధికారులు, సిబ్బందికి బాధ్యతలు అప్పగించారు. విమానాశ్రయం సమీపంలో 10 చోట్ల పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేశారు. డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా నేతృత్వంలో.. ఉత్తరాంధ్రకు చెందిన ఎస్పీలు, డీఐజీ స్థాయి అధికారులు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.


శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు

భోగాపురం పర్యటనలో భాగంగా.. విశాఖపట్నంలో రూ.460 కోట్లకు పైగా పెట్టుబడితో అభివృద్థి చేస్తున్న ఏఎ్‌సఐపీ సెమీ కండక్టర్‌ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారు. దీనిని కొరియా రిపబ్లిక్‌కు చెందిన ఏపీఏసీటీ భాగస్వామ్యంతో ఏఎ్‌సఐపీ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అభివృద్థి చేస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లో తొలి సెమీ కండక్టర్‌ తయారీ కేంద్రం. దీనికి ఇండియా సెమీ కండక్టర్‌ మిషన్‌ పరిధిలో ఆమోదం లభించింది. ఈ ప్లాంట్‌ ఏటా సుమారు 96 మిలియన్ల సెమీకండక్టర్‌ చిప్‌లను తయారు చేయడంతో పాటు అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగావకాశాలను కల్పిస్తుంది. అదే సమయంలో సెమీకండక్టర్‌ తయారీకి తోడ్పాటు అందించేలా పటిష్ఠమైన అనుబంధ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. కర్నూల్‌- రెన్యువబుల్‌ ఎనర్జీ జోన్‌ (ఆర్‌ఈజడ్‌)-ఫేజ్‌- శ్రీ(4.5 గిగావాట్లు) ఏకీకరణ కోసం ఏర్పాటు చేేస సరఫరా వ్యవస్థకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. దీనిని స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్‌పీవీ) ద్వారా రూ.5,550 కోట్ల పెట్టుబడితో పవర్‌ గ్రిడ్‌ అమలు చేస్తోంది.


రూ.3,550 కోట్ల వ్యయంతో నిర్మించే కర్నూలు పవన విద్యుత్‌ జోన్‌/సౌర విద్యుత్‌ జోన్‌ పార్ట్‌ ఏ, పార్ట్‌ బీ ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. అలాగే రూ.820 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన అనంతపురం (2,500 మెగావాట్లు), కర్నూలు (1,000 మెగావాట్లు) సౌర విద్యుత్‌ జోన్ల ట్రాన్స్‌మిషన్‌ పథకాన్ని కూడా ప్రారంభిస్తారు. దీనిని పవర్‌ గ్రిడ్‌ ద్వారా అమలు చేస్తున్నారు. ఈ సరఫరా ప్రాజెక్టులు... కర్నూలు, అనంతపురంలో ఉన్న పునరుత్పాదక ఇంధన జోన్ల నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్‌ తరలింపును సులభతరం చేస్తాయి. తద్వారా జాతీయ గ్రీడ్‌ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులకు విద్యుత్‌ సరఫరా చేస్తాయి. అలాగే భారీ పరిమాణంలో పునరుత్పాదక విద్యుత్తును అనుసంధానించడాన్ని కూడా సులభతరం చేస్తాయి. డిమాండ్‌ ఉన్న ప్రాంతాలకు స్వచ్ఛ విద్యుత్‌ సరఫరాను మెరుగుపరుస్తాయి. మోదీ తన పర్యటనలో భాగంగా.. రూ.1,880 కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఎన్‌హెచ్‌-365 బీజీలో రేచర్ల నుంచి గుర్వాయిగూడెం వరకు, గుర్వాయిగూడెం నుంచి దేవరపల్లి వరకు ఉన్న సెక్షన్‌లో నాలుగు లేన్ల ప్రవేశ నియంత్రిత గ్రీన్‌ఫీల్డ్డ్‌ జాతీయ రహదారులను, ఎన్‌హెచ్‌-67పై నాలుగు లేన్ల తాడిపత్రి బైపా్‌సనూ జాతికి అంకితమిస్తారు. ఎన్‌హెచ్‌-565లోని పెంచలకోన-యేర్పేడు విభాగంలో లింగసముద్రం వద్ద హైలెవెల్‌ వంతెనకు శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టులన్నీ విజయవాడ, ఇతర నగరాల్లో ట్రాఫిక్‌ రద్దీని తగ్గిస్తాయి. రోడ్డు భద్రతను పెంపొందిస్తాయి. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ మధ్య ప్రయాణ దూరాన్ని, ప్రయాణ సమయాన్ని తగ్గిస్తాయి. ప్రాంతీయ అనుసంధానాన్ని పెంపొందిస్తాయి.


భోగాపురం వెళుతున్నా! ‘ఎక్స్‌’లో ప్రధాని పోస్టు

విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శనివారం ప్రారంభించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్‌లో పోస్టు చేశారు. మౌలిక వసతుల కల్పనకు ఈ విమానాశ్రయం ఊతమి స్తుందని పేర్కొన్నారు. ప్రధాని పోస్టును సీఎం చంద్రబాబు రీపోస్టు చేశారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభంతో అభివృద్ధిలో ఉత్తరాంధ్ర టేకాఫ్‌ తీసుకోనుందని సీఎం పేర్కొన్నారు.


కర్ణాటకలో..

కర్ణాటకలోని మైసూరులోని శ్రీ రామకృష్ణ ఆశ్రమంలో స్వామి వివేకానంద కల్చరల్‌ యూత్‌ సెంటర్‌ వివేక స్మారకాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

Updated Date - Aug 01 , 2026 | 07:00 AM