Nara Lokesh: 'సాక్షి' దిన పత్రికపై పరువు నష్టం దావా కేసు.. మంత్రి నారా లోకేష్ క్రాస్ ఎగ్జామినేషన్
ABN , Publish Date - Jan 07 , 2026 | 05:03 PM
'సాక్షి' దినపత్రిక మీద నారా లోకేష్ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో 'సాక్షి' తరపు న్యాయవాదులు లోకేష్‌ను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. విశాఖపట్నం 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో విచారణ జరిగింది.
విశాఖపట్నం, జనవరి 7: 'సాక్షి' దినపత్రిక మీద ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో ఇవాళ క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. విశాఖపట్నం 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో ఈ విచారణ సాగింది.
కేసు విచారణ నిమిత్తం నిన్న విశాఖపట్నం వెళ్లిన మంత్రి నారా లోకేష్ ఇవాళ జిల్లా కోర్టుకు హాజరై, సాక్షి తరఫు న్యాయవాదులు నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్‌కు సమాధానమిచ్చారు. ఈ కేసుకు సంబంధించి ఇది మూడోసారి జరిగిన క్రాస్ ఎగ్జామినేషన్ కావడం విశేషం. విచారణ అనంతరం, 12వ అదనపు జిల్లా న్యాయమూర్తి కేసును ఈ నెల 21వ తేదీకి వాయిదా వేశారు.

ఇలా ఉండగా, 2019లో 'సాక్షి' దిన పత్రికలో ప్రచురితమైన కథనంపై లోకేష్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సదరు కథనం తప్పులు, కుట్రతో కూడుకున్నదని, ఇది.. తన పరువుకు నష్టం కలిగించే విధంగా ఉందని లోకేష్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇందుకు లోకేష్ రూ.75 కోట్ల పరిహారం డిమాండ్ చేస్తూ కోర్టుకెక్కారు.
ఈ కేసు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. 'సాక్షి' పత్రిక యాజమాన్యం మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి సంబంధించినది కావడంతో మరింత ఆసక్తికరంగా మారింది. తదుపరి విచారణలో కేసు కీలక దశకు చేరుకోనుంది.
కోర్టు పని మీద తాను విశాఖకు చేరుకున్న విషయాన్ని మంత్రి నారా లోకేష్ నిన్న తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 'సాక్షి'పై పరువునష్టం కేసులో రేపు 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో క్రాస్ ఎగ్జామినేషన్ కోసం విశాఖ చేరుకున్నాను. విశాఖ విమానాశ్రయానికి వచ్చిన ప్రజాప్రతినిధులు, నాయకులను కలుసుకున్నాను. అనంతరం విశాఖ పార్టీ కార్యాలయానికి చేరుకుని ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించాను. అందరితో కలిసి ఫోటోలు దిగాను.' అని సదరు ఫొటోలను కూడా లోకేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.