హాట్‌కేకుల్లా విశాఖ ఉక్కు ప్లాట్లు
ABN , Publish Date - Oct 14 , 2026 | 04:40 AM
విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్-ఆర్‌ఐఎన్‌ఎల్)కు చెందిన ప్లాట్లు ఈ-వేలంలో హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. తొలి విడత వేలంలో అనుకున్న దానికన్నా ఎక్కువ ఆదాయం వచ్చింది.
తొలివిడత ఈ-వేలంలో రికార్డు ధర
150 ప్లాట్ల విక్రయం 366.33 కోట్ల ఆదాయం
రిజర్వ్ ధర కన్నా 17శాతం అధికం
హెచ్‌బీ కాలనీలో రూ.1.8 లక్షలు పలికిన గజం
16, 30 తేదీల్లో మలివిడత వేలం
విశాఖపట్నం/న్యూఢిల్లీ, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్-ఆర్‌ఐఎన్‌ఎల్)కు చెందిన ప్లాట్లు ఈ-వేలంలో హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. తొలి విడత వేలంలో అనుకున్న దానికన్నా ఎక్కువ ఆదాయం వచ్చింది. వేలంలో మొత్తం 150 ప్లాట్లు విక్రయించగా, రూ. 366.33 కోట్ల ఆదాయం వచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ప్లాట్లకు నిర్ణయించిన రిజర్వ్ ధర రూ.312.48 కోట్లతో పోల్చితే బిడ్ల ద్వారా 17.23 శాతం అధిక ధర లభించడం విశేషం. కర్మాగారానికి నగరంలోని సీతమ్మధార సమీపాన ఉన్న హెచ్‌బీ కాలనీలో 456 ప్లాట్లు (సుమారు 18.17 ఎకరాలు), గాజువాక ఆటోనగర్‌లోని బ్లాక్ 2, 3లలో మూడు ప్లాట్లు (0.56 ఎకరాలు) చొప్పున మొత్తం 19.29 ఎకరాలు ఉంది. హెచ్‌బీ కాలనీలో గతంలో స్టీల్‌ప్లాంట్ సిబ్బందికి క్వార్టర్స్ నిర్మించారు.
అవి శిథిలం అయిపోవడంతో వాటిని కూలగొట్టి భూమిని ప్లాట్లుగా విభజించారు. ఆ ప్లాట్లను విక్రయించాలని కొద్దికాలం కిందట నిర్ణయించుకుని, ఆ బాధ్యత నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్‌ఎల్‌ఎంసీ)కి అప్పగించారు. వేలం ద్వారా రూ. 900 కోట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సోమవారం తొలివిడత ఈ-వేలం నిర్వహించారు. వేలం వేసిన ప్లాట్లు 128.94 గజాలతో మొదలుకొని అత్యధికంగా 2,728 చ.గజాల విస్తీర్ణంలో ఉన్నాయి. అత్యధికంగా చదరపు గజం రూ. 1.8 లక్షలు పలికింది. హెచ్‌బీ కాలనీ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-16కి)కి దగ్గరగా ఉంది. నీటి సమస్య లేదు. దాంతో మంచి రేటు పలికింది. మలి విడత వేలం పాటలు ఈ నెల 16, 30 తేదీల్లో నిర్వహించనున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
గిన్నిస్ బుక్‌లోకి 75 గంటల డప్పుమోత