ఎకానమీకి గేట్‌వేగా విశాఖ
ABN , Publish Date - Oct 08 , 2026 | 04:22 AM
గేట్‌వే ఆఫ్ ఎకానమీగా దేశంలో విశాఖపట్నానికి గుర్తింపు వస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు చెప్పారు. ఎకనామిక్ రీజియన్‌తో ఈ ప్రాంతం రూపురేఖలు ఇంకా మారబోతున్నాయని అన్నారు.
ఉత్తరాంధ్రకు భారీగా పెట్టుబడులు.. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకారం
కుప్పం, శ్రీకాకుళం విమానాశ్రయాలకు లైన్ క్లియర్
ఉత్తరాంధ్ర ప్రాంతీయ పెట్టుబడిదారుల సదస్సుల కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు
31 ఎంఓయూలు, 21 వేల కోట్ల పెట్టుబడులు
విశాఖపట్నం, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): గేట్‌వే ఆఫ్ ఎకానమీగా దేశంలో విశాఖపట్నానికి గుర్తింపు వస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు చెప్పారు. ఎకనామిక్ రీజియన్‌తో ఈ ప్రాంతం రూపురేఖలు ఇంకా మారబోతున్నాయని అన్నారు. ఉత్తరాంధ్రకు ఇటీవల కాలంలో భారీగా పెట్టుబడులు వచ్చాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఇక్కడ 42 లక్షల మందికి ఉపాధి కల్పించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. విశాఖపట్నం జిల్లా గంభీరంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లో బుధవారం సీఐఐ, ఏపీ ఎకనామిక్ డెవల్‌పమెంట్ బోర్డు సంయుక్తంగా నిర్వహించిన ఉత్తరాంధ్ర ప్రాంతీయ పెట్టుబడిదారుల సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం, పలు దిగ్గజ కంపెనీల రాకతో ఈ దశాబ్దం ఉత్తరాంధ్రాదిగా భావిస్తున్నామని అన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌లు కలిసి రాష్ట్రాన్ని శరవేగంతో అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. పెట్టుబడులు తేవడంలో మంత్రి లోకేశ్ కీలకంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రతి 45 రోజులకు దేశంలో ఓ కొత్త విమానాశ్రయం ప్రారంభిస్తున్నామని, వచ్చే పదేళ్లలో దేశంలో మరో వంద విమానాశ్రయాలు నిర్మిస్తామని తెలిపారు. కుప్పం, శ్రీకాకుళంలలో విమానాశ్రయాల నిర్మాణానికి అవసరమైన భూముల కేటాయింపు పూర్తయిందని చెప్పారు. విమానాశ్రయాల చుట్టూ మినీ ఎకానమీ సిటీలు అభివృద్ధి అవుతాయన్నారు.
పారిశ్రామికవేత్తలతో ఒప్పందాలు చేసుకోవడమే కాదని, వాటి వల్ల ఎంతమందికి ఉపాధి లభించింది, ఎన్ని జీవితాల్లో మార్పు వచ్చింది అనేది తమకు ముఖ్యమన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఎంతో సహకరిస్తోందన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భారతదేశం 7.8 శాతం వృద్ధి రేటుతో ముందుకు సాగుతోందని తెలిపారు. రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో లాజిస్టిక్స్ (సరకు రవాణా) వ్యయం తగ్గించడమే ప్రభుత్వం ధ్యేయమని చెప్పారు. ప్రస్తుతం ఏపీలో రూ. లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. మరికొన్ని డీపీఆర్ దశలో ఉన్నాయని తెలిపారు. 2024-25, 2025-26 కాలంలో ఎన్‌హెచ్‌ఏఐ ద్వారా సుమారు రూ. 24 వేల కోట్ల వ్యయంతో 1,530 కి.మీ. రహదారుల నిర్మాణం జరిగిందన్నారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహారశుద్ధి శాఖల మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, ఎంవోయూలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. నవంబరు 12, 13 తేదీల్లో 31వ సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ కోసం ప్రపంచం తిరిగి విశాఖకు వస్తుందన్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో తొలిసారిగా ఐదు ప్రాంతాల్లో ఇలాంటి సదస్సులు నిర్వహిస్తున్నామని, విశాఖతోనే దానికి శ్రీకారం చుట్టామన్నారు. సదస్సులో ఎంపీలు ఎం.శ్రీభరత్, కలిశెట్టి అప్పలనాయుడు, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఎస్‌ఎస్ రావత్, కాటంనేని భాస్కర్, సీఐఐ చైర్మన్ నరేంద్రకుమార్, సీఈవో షన్మోహన్, విశాఖ జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, పలువురు కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
క్లస్టర్ విధానంతో అన్ని ప్రాంతాల అభివృద్ధి
రాష్ర్టానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించి, 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి టీజీ భరత్ అన్నారు. అన్ని ప్రాంతాల్లో సమతుల్య పారిశ్రామిక అభివృద్ధి జరగాలని క్లస్టర్ ఆధారిత విధానం అనుసరిస్తున్నామని తెలిపారు. సీఐఐ ప్రాంతీయ పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సు ముగిసిన అనంతరం ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజుతో కలసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 175 నియోజకవర్గాల్లో ఎంఎ్‌సఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని,వీటిలో 138 పార్కులు గ్రౌండింగ్ అయ్యాయన్నారు. ఏర్పాటయ్యే పరిశ్రమల్లో ఉద్యోగాలు 80 శాతం స్థానికులకే లభిస్తాయన్నారు.
ఈ వార్తలనూ చదవండి..