విశాఖలో DSC-2025 టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ.. వైసీపీపై తీవ్ర ఆగ్రహం
ABN , Publish Date - Aug 30 , 2026 | 01:12 PM
మెగా DSCపై వైసీపీ చేస్తున్న ఆరోపణలకు నిరసనగా విశాఖలో ఉపాధ్యాయులు గళమెత్తారు. నాలుగు ఉమ్మడి జిల్లాల నుంచి తరలివచ్చిన టీచర్లు భారీ ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించి.. ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన తమపై నిందలు వేయడం సరికాదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖపట్నం, ఆగస్టు 30: నగరంలో DSC-2025 ఉపాధ్యాయులు భారీ ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. మెగా DSCపై వైసీపీ చేస్తున్న విషప్రచారాన్ని ఖండిస్తూ నాలుగు ఉమ్మడి జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విక్టరీ ఎట్ సీ నుంచి ఆర్కే బీచ్ వరకు సాగిన ర్యాలీలో ఉపాధ్యాయులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతిభ, మెరిట్ ఆధారంగా తాము ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించామన్నారు. తమపై రాజకీయ నాయకులు నిందలు వేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కష్టార్జిత విజయాన్ని రాజకీయ కోణంలో విమర్శించడం ద్వారా వేలాది మంది అభ్యర్థుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. DSC-2025 నియామకాలపై అసత్య ఆరోపణలు, విషప్రచారం మానుకోవాలని హితవుపలికారు. ప్రతిభతో ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని స్పష్టం చేశారు. DSCపై ఇదే విధంగా తప్పుడు ఆరోపణలు కొనసాగిస్తే రాబోయే స్థానిక ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని హెచ్చరించారు. ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలను ఇకపై సహించేది లేదని స్పష్టం చేస్తూ ర్యాలీ కొనసాగింది.
Also Read:
సింహాద్రి అప్పన్న ఆలయంలో ముగ్గురు ఉద్యోగుల సస్పెండ్
గత ప్రభుత్వానికి నరకడం తప్ప.. నాటే ఆలోచనే రాలేదు: నాగబాబు