విశాఖ, అమరావతి చిత్ర పరిశ్రమకు అనుకూలం
ABN , Publish Date - Oct 05 , 2026 | 05:19 AM
ఏపీలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందడానికి విశాఖపట్నంతోపాటు ఏపీ రాజధాని అమరావతి ప్రాంతం కూడా అనుకూలంగా ఉంటుందని సిటీ నటుడు, నిర్మాత మాగంటి మురళీమోహన్ అన్నారు.
జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న మురళీమోహన్
మంగళగిరి సిటీ, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): ఏపీలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందడానికి విశాఖపట్నంతోపాటు ఏపీ రాజధాని అమరావతి ప్రాంతం కూడా అనుకూలంగా ఉంటుందని సిటీ నటుడు, నిర్మాత మాగంటి మురళీమోహన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి దశాబ్ది వేడుకలు ఆదివారం రాత్రి మంగళగిరిలోని హ్యాపీ రిసార్ట్స్‌లో ఘనంగా జరిగాయి. తొలుత ఇటీవల మృతి చెందిన ప్రముఖ సినీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు నివాళి అర్పించారు. కార్యక్రమానికి హాజరైన సినీ ప్రముఖులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మురళీమోహన్ మాట్లాడుతూ... రాష్ట్ర విభజన తర్వాత సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపుతో అమరావతి రైతాంగం ప్రభంజనంలా కదిలి రాజధాని కోసం భూములిచ్చేందుకు ముందుకొచ్చారని చెప్పారు. నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అండగా నిలిచారన్నారు. కూటమి విజయం చరిత్రలో నిలిచిపోతుందని.. మళ్లీ మళ్లీ కూటమి అధికారంలోకి వస్తేనే అమరావతి పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుందని అన్నారు. తెలంగాణలో రాజధాని, సినీ పరిశ్రమను అభివృద్ధి చేసింది చంద్రబాబేనని గుర్తుచేశారు. ఏపీలో విశాఖ ప్రాంతం సినిమా ఇండస్ట్రీకి బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత అమరావతి అనుకూలంగా ఉంటుందని చెప్పారు. అంతకుముందు నటులు, నటీమణులు, నిర్మాతలు మురళీమోహన్‌ను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు. కార్యక్రమంలో ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, సినీ నిర్మాత ఏఎం రత్నం, సినీ నటీమణులు లయ, కొణిదెల నిహారిక, జో శర్మ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ప్రకృతి సాగులో ఏపీ నంబర్ వన్.. సీఎం చంద్రబాబుకు శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రశంసలు
ఫిబ్రవరి 3న అమరావతి నుంచి తొలి క్వాంటమ్ కంప్యూటర్ ఆవిష్కరిస్తాం: సీఎం చంద్రబాబు