Share News

అదుపు తప్పిన వేగం!

ABN , Publish Date - Oct 13 , 2026 | 04:18 AM

ఆనందంగా వేడుకలో పాల్గొని తిరిగి వస్తున్న వారిని మృత్యువు కబళించింది. విజయవాడ పశ్చిమ బైపాస్‌ రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

అదుపు తప్పిన వేగం!

  • రక్షణ గోడను ఢీకొట్టిన కారు.. నలుగురు దుర్మరణం

  • అందులో ఇద్దరు సజీవ దహనం.. మృతుల్లో తల్లీకొడుకు, మనవడు

  • అపస్మారక స్థితిలో మరో మహిళ.. విజయవాడ పశ్చిమ బైపాస్‌పై ఘోరం

  • లారీని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో ఘటన.. పూర్తిగా కాలిపోయిన విండ్సర్‌ ఈవీ

విజయవాడ, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): ఆనందంగా వేడుకలో పాల్గొని తిరిగి వస్తున్న వారిని మృత్యువు కబళించింది. విజయవాడ పశ్చిమ బైపాస్‌ రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఎలక్ట్రిక్‌ కారు... ముందు వెళ్తున్న లారీని తప్పించబోయి రక్షణ గోడను బలంగా ఢీకొట్టింది. ఆ వెంటనే కారులో మంటలు చెలరేగాయి. కారులో ఉన్న ఇద్దరు సజీవ దహనం కాగా... మరో ఇద్దరు ప్రమాద తీవ్రతకు అక్కడికక్కడే మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... విజయవాడ రూరల్‌ మండలం నున్న గ్రామానికి చెందిన కొమ్మారెడ్డి రామ్‌దేవ్‌రెడ్డి, ఆయన తల్లి కొమ్మారెడ్డి అరుణ (56), ఏడాదిన్నర కుమారుడు మహాత్ర, అరుణ చెల్లెలి కుమార్తె భీమవరపు విజయ (48), హైదరాబాద్‌లోని మెహిదీపట్నానికి చెందిన తియ్యగూర అరుణ (50) కలిసి సోమవారం ఉదయం విండ్సర్‌ ఎలక్ర్టిక్‌ కారులో గుంటూరు జిల్లా నంబూరుకు వెళ్లారు. అక్కడ తమ సమీప బంధువుల ఇంట్లో జరిగిన ఓణీల వేడుకకు హాజరయ్యారు. బంధువులు, సన్నిహితులతో ఆనందంగా గడిపి...

విందు అనంతరం నున్నకు తిరుగు ప్రయాణమయ్యారు. కారును రామ్‌దేవ్‌ రెడ్డి నడుపుతున్నారు. విజయవాడ పశ్చిమ బైపాస్‌పై రైల్వే ఫ్లైఓవర్‌ మీదకు వచ్చేసరికి.. ముందు వెళ్తున్న లోడ్‌ లారీని తప్పించడానికి ప్రయత్నించారు. అప్పటికి కారు వేగం గంటకు వందకిలోమీటర్లకు పైనే ఉన్నట్లు సమాచారం. లారీని ఎడమవైపు నుంచి ఓవర్‌టేక్‌ చేసేందుకు ప్రయత్నించే క్రమంలో... వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనున్న రక్షణ గోడను ఢీకొంది. కారు వెనుకభాగం రక్షణ గోడపైకి ఎక్కేసింది. క్షణాల్లోనే కారు ముందు భాగం నుంచి మంటలు వ్యాపించాయి.


అదే మార్గంలో సెంట్రింగ్‌ సామగ్రితో వెళ్తున్న వ్యాన్‌ డ్రైవర్‌, అందులో ఉన్నవారు ఇది చూసి... తమ తమ వద్ద ఉన్న పరికరాలతో కారు తలుపులు పగలగొట్టారు. రామ్‌దేవ్‌ రెడ్డి, ఆయన పక్కన కూర్చున్న విజయ ప్రమాద తీవ్రతకే మరణించారు. వారి మృతదేహాలు రోడ్డుమీద పడిపోయాయి. ఇక... వెనుక సీటులో కూర్చొన్న రామ్‌దేవ్‌రెడ్డి తల్లి అరుణ, చిన్నారి మహాత్ర సజీవ దహనమ్యారు. అపస్మారక స్థితిలో ఉన్న మరో మహిళ తియ్యగూర అరుణను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో కారు పూర్తిగా బుగ్గి అయ్యింది. భవానీపురం పోలీసులు, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఏమిటి కారణం...

అక్కడిదాకా విశాలంగా ఉన్న రహదారి... ప్రమాదం జరిగిన చోట వెడల్పు తగ్గి, ఇరుకుగా ఉంటుంది. పాదచారుల కోసం దారిని వదలడమే దీనికి కారణం. ఈ దారికి అటూ ఇటూ రక్షణ గోడలను నిర్మించారు. లారీని ఎడమవైపు నుంచి ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో రోడ్డు వెడల్పును రామ్‌దేవ్‌ రెడ్డి అంచనా వేయలేకపోయారని... వేగం కారణంగా వాహనం అదుపుతప్పి రక్షణ గోడను ఢీకొట్టిందని తెలుస్తోంది.

సీఎం చంద్రబాబు, లోకేశ్‌ విచారం

విజయవాడ వెస్ట్‌ బైపాస్‌పై జరిగిన కారు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోవడం తీవ్రంగా కలిచివేసిందని మంత్రి నారా లోకేశ్‌ సోమవారం ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. మృతులకు ఆయన నివాళులర్పించారు.

ఈ వార్తలనూ చదవండి:

పెట్టుబడుల స్వర్గధామం ఏపీ

నాడు అడ్డగోలు.. నేడు గగ్గోలు

Updated Date - Oct 13 , 2026 | 04:18 AM