Share News

నాడు అడ్డగోలు.. నేడు గగ్గోలు

ABN , Publish Date - Oct 13 , 2026 | 03:50 AM

నాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అడ్డగోలుగా వ్యవహరించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏకగ్రీవం పేరిట ప్రత్యర్థులు నామినేషన్లు కూడా వేయకుండా చేసిన దౌర్జన్యాలు అన్నీ ఇన్నీ కావు.

నాడు అడ్డగోలు.. నేడు గగ్గోలు

  • సమరానికి ముందే వైసీపీ హ్యాండ్సప్‌.. స్థానికంలో ముందస్తు ఓటమి భయం

  • నాడు నామినేషన్లు కూడా వేయనివ్వకుండా దౌర్జన్యం.. ఇప్పుడు గ్రాఫ్‌

  • బాగోలేకపోవడంతో సాకులు.. శాంతిభద్రతల పేరుతో కోర్టులో పిటిషన్లు

నాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అడ్డగోలుగా వ్యవహరించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏకగ్రీవం పేరిట ప్రత్యర్థులు నామినేషన్లు కూడా వేయకుండా చేసిన దౌర్జన్యాలు అన్నీ ఇన్నీ కావు. అదే వైసీపీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ముందు గగ్గోలు పెడుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్న వైసీపీకి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ముందస్తు ఓటమి భయం పట్టుకుంది. అయితే శాంతిభద్రతలను సాకుగా చూపేందుకు వైసీపీ ముఖ్యనేత, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్‌ రెడ్డి న్యాయస్థానాలను ఆశ్రయించారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో శాంతిభద్రతలను కాపాడేందుకు కేంద్ర బలగాల పహారా కావాలని కోరుతూ లేళ్ల అప్పిరెడ్డి కోర్టులో పిటిషన్‌ వేశారు.

అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు రక్షణ కల్పించాలని కోరుతూ కాసు మహేశ్‌ రెడ్డి మరో పిటిషన్‌ను వేశారు. నాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ప్రత్యర్థి పార్టీలేవీ పోటీ చేయకుండా వైసీపీ బలప్రదర్శన చేసింది. ప్రత్యర్థులు నామినేషన్లు వేయకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోలీసుల సమక్షంలోనే పత్రాలను లాక్కొని చించేశారు. నామినేషన్‌ పత్రాలను చాలావరకు తిరస్కరించారు. అయితే ‘స్థానికం-ఏకపక్షం’ అని నాటి సీఎం జగన్మోహన్‌ రెడ్డి కితాబిచ్చుకున్నారు. నాటి దౌర్జన్యకాండను రాష్ట్ర ప్రజలెవరూ మరచిపోలేదు. సార్వత్రిక ఎన్నికల ఓటమి నుంచి వైసీపీ ఇంకా కోలుకోలేదు. మరోవైపు సంక్షేమం, అభివృద్ధిలో దూసుకుపోతున్న అధికార కూటమి పార్టీలు క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నాయి.


40 శాతానికి పైగా వెనుకబడిన వర్గాల అభ్యర్థులను ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. వైసీపీలో ఇందుకు భిన్నమైన పరిస్థితి. నెల్లూరు మేయర్‌ అభ్యర్థిగా ఆనం విజయకుమార్‌రెడ్డిని అట్టహాసంగా ప్రకటించిన వైసీపీ ఇప్పుడు కూటమి అభ్యర్థి ఎవరోనని ఆరాలు తీయడం ప్రారంభించింది. నామినేషన్లకు ముందే ఓటమిని అంగీకరించడం మేలని కొందరు వైసీపీ నేతలే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక పలు జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల బరిలో దిగేందుకు వైసీపీ నేతలు ముందుకు రావడం లేదు. అభ్యర్థుల కొరత, వైసీపీ గ్రాఫ్‌ పడిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. దీంతో కూటమి ఏకగ్రీవాలైతే సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జికి సీటు ఉండదంటూ జగన్‌ హెచ్చరికలు చేయాల్సి వచ్చిందంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమరం సమీపిస్తున్న తరుణంలో వైసీపీ వేస్తున్న పిల్లిమొగ్గలు ఓటమికి సంకేతాలను రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ వార్తలనూ చదవండి:

ఉక్కులో వివక్ష

ప్రజల ఫిర్యాదులపై నిర్లక్ష్యం వద్దు.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు

Updated Date - Oct 13 , 2026 | 03:50 AM