పెట్టుబడుల స్వర్గధామం ఏపీ
ABN , Publish Date - Oct 13 , 2026 | 03:54 AM
పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామం అని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు. పెట్టుబడిదారులకు అన్ని రకాలుగా సహకరించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.
అవకాశాలను పెట్టుబడిదారులు అందిపుచ్చుకోవాలి
రాష్ట్ర పురోగతిలో భాగస్వాములు కావాలి
గత ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలు భయపడే పరిస్థితి
పరిశ్రమ పెడితే మాకేం ఇస్తారనే విష సంస్కృతి ఉండేది
కొత్త పరిశ్రమలు రాలేదు.. ఉన్నవి వెళ్లిపోయాయి
కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితి మారింది
ప్రజలకు ఏం చేస్తారని అడిగే సత్సంప్రదాయం వచ్చింది
కాకినాడ పెట్టుబడుల సదస్సులో డిప్యూటీ సీఎం పవన్
ఇక సరళంగా అనుమతులు.. పరిశ్రమల స్థాపనకు
అనుకూలంగా తగ్గింపు.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
కాకినాడ, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామం అని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు. పెట్టుబడిదారులకు అన్ని రకాలుగా సహకరించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు భయపడే పరిస్థితి ఉండేదని, రాష్ట్రంలో మీరు పరిశ్రమలు పెడితే మాకేమిస్తారు అని అడిగే విష సంస్కృతిని అప్పుడు చూశామని అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం మీరు పెట్టుబడులు పెడితే రాష్ట్రానికి ఏమిస్తారు, ప్రజలకు ఏమి చేస్తారు అని అడిగే సత్సంప్రదాయంతో పనిచేస్తోందని తెలిపారు. సోమవారం కాకినాడలో జరిగిన సీఐఐ ప్రాంతీయ పెట్టుబడుల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు. వాటిని పారిశ్రామికవేత్తలు అందిపుచ్చుకుని ఆంధ్రప్రదేశ్ పురోగతిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ ప్రాంతీయ పెట్టుబడుల సదస్సులో 15 ఎంవోయూల ద్వారా రూ. 4,256 కోట్ల పెట్టుబడుల రాకతో పాటు, రూ. 2 వేల కోట్లతో పూర్తైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరగడం శుభసూచకంగా పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టుల ద్వారా కాకినాడ పరిసర ప్రాంతాల్లో 18 వేల మందికి ఉపాధి లభించనుందని చెప్పారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే.. ‘‘ఒకప్పుడు సింగపూర్ పేద దేశంగా ఉండేది. కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితి. ఆ స్థితి నుంచి సంకల్పబలం, సమష్టి కృషితో ప్రపంచంలో అద్భుతమైన దేశంగా మారింది. స్విట్జర్లాండ్ నమూనా కూడా అలాంటిదే. పారిశ్రామికవేత్తలకు అన్నివిధాలా సహకరించేందుకు, వారిని ముందుకు తీసుకువెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. పెట్టుబడిదారులకు తగిన ప్రోత్సాహకాలు, అనుమతులు త్వరితగతిన ఇస్తున్నాం.
పారిశ్రామికవేత్తలు కూడా ఇదే నిబద్ధతతో పర్యావరణహితంగా యువతకు మెరుగైన ఉపాధి చూపుతూ రాష్ట్రాభివృద్ధికి సహకరించాలి. సీఎం చంద్రబాబు నాయకత్వంలో 2024 జూన్ నుంచి రాష్ట్రానికి 714 ప్రాజెక్టుల ద్వారా రూ. 22.6 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. వీటివల్ల రాష్ట్రంలో 7.1 లక్షల మంది యువతకు ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం అంటే కేవలం ఒప్పందాలు కుదుర్చుకోవడం మాత్రమే కాదు. వాటిని పూర్తిస్థాయిలో ప్రారంభించేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది. కంపెనీలకు అన్నిరకాల అనుమతులు పారదర్శకంగా, వేగంగా ఇస్తుండడంతో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అత్యంత అనుకూలంగా మారింది.
పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాపై కూడా దృష్టిసారించాలి. తద్వారా అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని విస్తరించడం సులభతరమవుతుంది. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టే ముందు భూమి గురించో, సౌకర్యాలు, అనుమతులు గురించో కాదు. సుస్థిరమైన, సమర్థవంతమైన పాలన గురించి చూస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగుండడంతో నమ్మకంతో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. గత ప్రభుత్వంలో కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి రాకపోగా ఉన్న పరిశ్రమలు వేరే రాష్ట్రానికి వెళ్లిపోయాయి. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో పారిశ్రామికవేత్తలు భాగస్వామ్యం కావాలి’’ అని పవన్ పిలుపునిచ్చారు.
స్థిరమైన ప్రభుత్వంతో రాష్ట్రం అభివృద్ధి
గతంలో రూ. 12.25 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు కుదరగా, సరైన పరిశీలన తర్వాతే అవన్నీ పెట్టుబడులుగా మారుతున్నాయని రాష్ట్ర పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖమంత్రి టీజీ భరత్ చెప్పారు. సదస్సులో ఆయన ప్రసంగిస్తూ.. 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని చెప్పారు. గుజరాత్ తరహాలో రాష్ట్రంలో కొన్నేళ్లు స్థిరమైన ప్రభుత్వాన్ని కొనసాగిస్తే రాష్ట్రం మరింత అభివృద్థి పథంలో పయనిస్తుందని చెప్పారు. నవంబరు 12, 13 తేదీల్లో విశాఖలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సు సన్నాహాల్లో భాగంగా ఈ ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తున్నామని, అమరావతి, అనంతపురం, తిరుపతిలో కూడా ఈ సదస్సులు జరగనున్నాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు టెక్నాలజీ, ప్రపంచ పెట్టుబడులను అర్థంచేసుకున్న విజనరీ అని, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిజాయితీగా సామాన్యుల పట్ల నిబద్ధతతో ప్రత్యేకంగా నిలుస్తున్నారని చెప్పారు. ఒకరు ఆంధ్రప్రదేశ్‌ను మార్చేందుకు విజన్ ఇస్తే, మరొకరు ఆ మార్పు ప్రజలకు చేరేలా చేస్తారని అన్నారు. రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ, కాకినాడ ఎస్‌ఈజెడ్ పోర్టు, డీప్ వాటర్ పోర్టు, యాంకరేజ్ పోర్టు, ఫిషింగ్ హార్బర్ సముద్ర వాణిజ్యానికి కీలకంగా నిలుస్తున్నాయని తెలిపారు. పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్ మాట్లాడుతూ, ఈ ప్రాంతీయ సన్నాహక సమావేశాల ద్వారా రూపొందించే కామన్ కన్సాలిడేటెడ్ నివేదికలను విశాఖ సీఐఐ సదస్సులో ప్రవేశపెడతామని చెప్పారు.
పెట్టుబడుల జోష్
కాకినాడ సదస్సులో 15 ఎంవోయూలు..
కొత్తగా 4,256 కోట్ల పెట్టుబడులు
కాకినాడలో సీఐఐ ప్రాంతీయ పెట్టుబడుల సదస్సుకు పెద్దసంఖ్యలో పెట్టుబడిదారులు తరలివచ్చారు. ఉమ్మడి తూర్పు-పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలోని ఐదు జిల్లాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపారు. కొత్తగా రూ. 4,256 కోట్ల పెట్టుబడితో 15 ఎంవోయూలు కుదిరాయి. అలాగే గతంలో కుదిరిన ఒప్పందాల్లో భాగంగా రూ. 2195 కోట్ల చేపట్టిన 35 వరకు పరిశ్రమలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి. మొత్తంగా వీటితో 18,300 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ కార్యక్రమంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి సంస్థ సీఈవో ఎస్.షాన్‌మోహన్, రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎన్.యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఒప్పందాలు చేసుకున్న కంపెనీల్లో తూర్పుగోదావరిలో రూ. 218 కోట్లతో యూనిట్ల స్థాపనకు సీఎంఆర్ టెక్స్‌టైల్స్ అండ్ జ్యూయలర్స్ ప్రైవేట్ లిమిటెడ్, కాకినాడ జిల్లా తొండంగిలో రూ.1,250 కోట్లతో నెక్సాన్ జియోకమ్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ, ఉప్పాడకు సమీపంలో రూ. 698 కోట్లతో బ్యాటరీ రీసైక్లింగ్ యూనిట్ల స్థాపనకు జైపూరి స్ట్రాటజిక్ రిసోర్సెస్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, కాకినాడ సెజ్‌లో రూ. 300 కోట్లతో కామినేని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ, ప్రకాశం జిల్లాలో రూ. 690 కోట్లతో ఇండియన్ ఫాస్పేట్ లిమిటెడ్ పరిశ్రమలు ఉన్నాయి. ఇక కాకినాడలో రూ. 100 కోట్లతో భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం యూనిట్ స్థాపించి సునామీ హెచ్చరికలతో పాటు ఫిషింగ్ జోన్ అన్వేషించి ఏడు లక్షల మంది మత్స్యకారులకు సేవలు అందించడానికి సిద్ధమవుతున్నట్టు ప్రకటించింది.
ఈ వార్తలనూ చదవండి:
ఉక్కులో వివక్ష
ప్రజల ఫిర్యాదులపై నిర్లక్ష్యం వద్దు.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు