Share News

ఉత్సవ‘వాడ

ABN , Publish Date - Oct 10 , 2026 | 04:02 AM

దసరా ఉత్సవాలు అంటే తెలుగు రాష్ట్రాల్లో బెజవాడే గుర్తొస్తుంది. ఈసారి దసరా ఉత్సవాలతో పాటు మరో మూడు పండుగలకు నగరం సిద్ధమైంది. దీనితో విజయవాడ నగరం జనాలతో పోటెత్తుతుందని అంచనా వేస్తున్నారు.

ఉత్సవ‘వాడ

  • రేపటి నుంచి బెజవాడలో దసరా జోష్‌

  • నాలుగు కార్యక్రమాలకు సిద్ధమైన నగరం

  • విజయదశమి వేడుకలు, విజయవాడ ఉత్సవ్‌,

  • సరస్‌ మేళా, రంజీట్రోఫీ క్రికెట్‌కు ఏర్పాట్లు

  • రాష్ట్రపతి ముర్ముతో పాటు పలు రాష్టాల సీఎంలు, ప్రముఖులు రాక

  • రానున్న పది రోజులు 50 లక్షల మందితో కిక్కిరిసిపోనున్న విజయవాడ

దసరా ఉత్సవాలు అంటే తెలుగు రాష్ట్రాల్లో బెజవాడే గుర్తొస్తుంది. ఈసారి దసరా ఉత్సవాలతో పాటు మరో మూడు పండుగలకు నగరం సిద్ధమైంది. దీనితో విజయవాడ నగరం జనాలతో పోటెత్తుతుందని అంచనా వేస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు, విజయవాడ ఉత్సవ్‌, జాతీయ సర్‌సమేళా, రంజీట్రోఫీ క్రికెట్‌ మ్యాచ్‌లు భక్తులను, ప్రజలను అలరించనున్నాయి. దేశం దృష్టిని ఆకర్షించేలా ఈ ఏడాది కనీవినీ ఎరుగని రీతిలో దసరా ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక ఆనందంతో పాటు వినోదాన్ని ఆస్వాదించే అవకాశం కలగనుంది. ఈ ఏడాది విజయవాడ ఉత్సవ్‌కు నగరంలోని నాలుగు వేదికలు ముస్తాబయ్యాయి. పున్నమి ఘాట్‌లో జాతీయ సరస్‌ మేళాకు ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. ఇక రంజీ ట్రోఫీ క్రికెట్‌ మ్యాచ్‌లకు మూలపాడులోని మైదానం వేదిక కానుంది. మొత్తంగా శ్రీ పరాభవ నామ సంవత్సర విజయదశమి వేడుకలు ప్రజలకు గుర్తుండి పోయేలా జరగనున్నాయి.


రేపటి నుంచి దసరా వేడుకలు

సాధారణంగా దసరా ఉత్సవాల సమయంలో ఏటా లక్షలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తుంటారు. ఈ ఆధ్యాత్మిక శోభకు ఇతర కార్యక్రమాలను జతచేసి దేశం మొత్తం విజయవాడవైపు చూసేలా దసరా ఉత్సవాల రూపకల్పన జరిగింది. ఆదివారం ప్రారంభమయ్యే దసరా వేడుకలు పది రోజుల పాటు ధూంధాంగా జరగనున్నాయి. దీనికి ఏర్పాట్లు చకాచకా జరుగుతున్నాయి. ఇక గతేడాది జరిగిన విజయవాడ ఉత్సవ్‌ సీజన్‌-1 నగరానికి మరింత వన్నె తెచ్చింది. పలు ఆధ్యాత్మిక, వినోద కార్యక్రమాలతో ప్రజలను ఆకట్టుకున్నాయి. విజయవాడ ఉత్సవ్‌ సీజన్‌-1 సూప ర్‌ హిట్‌ కావడంతో ఈ ఏడాది మరింత వైభవంగా నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. సింగ్‌నగర్‌లోని ఎంబీపీ స్టేడియం, సిద్ధార్ధ ఫార్మసీ కాలేజీ, ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం వద్ద కార్యక్రమాలు ఆదివారం ప్రారంభం కానున్నాయి. సంప్రదాయ కళల ప్రదర్శనకు విజయవాడ ఉత్సవ్‌ వేదిక కానుంది. ఈ కార్యక్రమాలను ప్రజలు ఉచితంగా చూడ వచ్చు. డ్రోన్‌ షో, క్రాకర్‌ షో ఈ ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ ఉత్సవాలకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు ప్రముఖ వ్యాపారస్తులు వస్తారని స్థానిక అధికారపక్ష నేతలు చెబుతున్నారు. దేశంలోని ప్రముఖులకు, వ్యాపార దిగ్గజాలకు ప్రత్యేక ఆహ్వానాలు అందాయి.


మూలపాడులో క్రికెట్‌ మ్యాచ్‌లు

దసరా సెలవుల్లో క్రికెట్‌ అభిమానులను రంజీమ్యాచ్‌లు అలరించనున్నాయి. దీనికి మూలపాడులోని ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌(ఏసీఏ) స్టేడియాలు ముస్తాబయ్యాయి. ఈ నెల 11 నుంచి 21వ తేదీ వరకు రంజీ ట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌-బి మ్యాచ్‌లు జరగనున్నాయి. 11 నుంచి 14వ తేదీ వరకు ఆంధ్ర- కర్ణాటక, 18 నుంచి 21వ తేదీ వరకు ఆంధ్ర-హైదరాబాద్‌ జట్ల మధ్య మ్యాచ్‌లు జరుగుతాయి.

అన్ని రాష్ట్రాల ఉత్పత్తులతో సరస్‌ మేళా

జాతీయ సరస్‌ మేళా తొలిసారి విజయవాడకు పరిచయం అవుతోంది. పున్నమి ఘాట్‌లో జరిగే ఈ మేళాలో అన్ని రాష్ట్రాల నుంచి వారి స్థానిక ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలు జరుగుతాయి. గతంలో ఎప్పుడూ రుచి చూడని వివిధ రాష్ట్రాల వంటకాలను అక్కడ ఆస్వాదించవచ్చు. దసరాకు వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని ఈ మేళా తేదీలను నిర్ణయం చేశారు. ఈ నెల 14వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ మేళా ప్రారంభం కానుంది. 30వ తేదీ వరకు జరగనుంది.

50 లక్షలకుపైగా వస్తారని అంచనా..

ఈ ఏడాది వైవిధ్య భరితమైన కార్యక్రమాలకు విజయవాడ నగరం ఆతిథ్యం ఇవ్వడంతో దసరా ఉత్సవాలకు 50 లక్షల మందికి పైగా వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ కార్యక్రమాలతో దేశ వ్యాప్తంగా ప్రజల దృష్టిని విజయవాడ ఆకర్షిస్తుందని భావిస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకునే ఏపీఎ్‌సఆర్టీసీ ఇప్పటికే 350 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ ఉత్సవాలపై ఇప్పటికే విస్తృత ప్రచారం జరిగింది. భారీగా జనం వస్తారనే అంచనా నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా సిద్ధమైంది. రానున్న 10 రోజులు ట్రాఫిక్‌ పెరిగే అవకాశం ఉండటం, బందోబస్తు కోసం పోలీస్‌ శాఖ ఇతర జిల్లాల నుంచి అదనపు బలగాలను రంగంలోకి దించుతోంది.

ఈ వార్తలనూ చదవండి:

సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు..

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు

Updated Date - Oct 10 , 2026 | 04:02 AM