Share News

విజయవాడ టు భోగాపురం విమానంలో 12 గంటలు

ABN , Publish Date - Sep 25 , 2026 | 05:45 AM

తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు భోగాపురం విమానాశ్రయంలో హైటెన్షన్‌ నెలకొంది. ఆందోళనకర వాతావరణం ఏర్పడింది. విజయవాడలో బుధవారం రాత్రి బయలుదేరిన ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం 9.40 గంటలకు భోగాపురం చేరుకోవాల్సి ఉంది.

విజయవాడ టు భోగాపురం విమానంలో 12 గంటలు

  • వయా నాగపూర్‌, బెంగళూరు!

  • వర్షాలతో ఎయిరిండియా విమానం దారిమళ్లింపు

  • సిగ్నలింగ్‌ వ్యవస్థలో సాంకేతిక లోపంతో చిక్కులు

  • ఫ్లైట్‌లో మంత్రులు అచ్చెన్న, కొండపల్లి, వైసీపీ నేత బొత్స

విశాఖపట్నం, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు భోగాపురం విమానాశ్రయంలో హైటెన్షన్‌ నెలకొంది. ఆందోళనకర వాతావరణం ఏర్పడింది. విజయవాడలో బుధవారం రాత్రి బయలుదేరిన ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం 9.40 గంటలకు భోగాపురం చేరుకోవాల్సి ఉంది. అయితే భారీవర్షం కారణంగా సిగ్నలింగ్‌ వ్యవస్థలో సాంకేతిక లోపం ఏర్పడటంతో ల్యాండింగ్‌కు వీలుకాలేదు. దీంతో ఏ విమానాశ్రయానికి మళ్లించాలనే అంశంపై చర్చలు కొనసాగడంతో తుది నిర్ణయం వచ్చేంత వరకు విమానం భోగాపురంలోనే గాలిలో చక్కర్లు కొట్టింది. విజయవాడ, తిరుపతి, హైదరాబాద్‌ విమానాశ్రయాలను సంప్రదించి ల్యాండింగ్‌కు అనుమతి కోరినా ఉపయోగం లేకపోయింది. చివరకు రాత్రి 11 గంటల తరువాత నాగపూర్‌ విమానాశ్రయం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో అటు మళ్లించారు. రాత్రి 12.30 గంటలకు విమానం అక్కడకు చేరుకుంది. ఆ విమానంలో మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్‌, శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సహా మొత్తం 70 మంది ప్రయాణికులు ఉన్నారు. గురువారం తెల్లవారుజామున ఆ విమానం నాగపూర్‌లో బయలుదేరి బెంగుళూరుకు వెళ్లింది. అక్కడ వారిని మరో విమానంలో ఎక్కించి ఉదయం 7.15 గంటలకు విజయవాడకు చేర్చారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తనకు సమావేశాలు ఉన్నాయని అక్కడ దిగిపోగా, మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర ప్రయాణికులు ఉదయం 8.30 గంటలకు భోగాపురం చేరుకున్నారు. దాంతో వారి బంధువులు, మిత్రులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ వార్తలనూ చదవండి...

మహిళల భద్రతకు ప్రాధాన్యం

బజార్‌లో పోస్టుల అమ్మకం

Updated Date - Sep 25 , 2026 | 05:45 AM