Share News

క్యాథ్‌ యాంజియోగ్రామ్‌ లేకుండానే ఫాస్ట్‌ట్రాక్‌ సీఏబీజీ

ABN , Publish Date - Sep 29 , 2026 | 05:40 AM

అధునాతన సీటీసీఏ, సీటీ-ఎఫ్ఎఫ్ఆర్‌ సాంకేతికతలతో గుండె రక్తనాళాల్లోని బ్లాకేజీలను సమగ్రంగా అంచనా వేయవచ్చని ఆస్టర్‌ రమేష్‌ హాస్పిటల్స్‌ ఎండీ, చీఫ్‌ కార్డియాలజీ డాక్టర్‌ రమేష్‌ బాబు తెలిపారు.

క్యాథ్‌ యాంజియోగ్రామ్‌ లేకుండానే ఫాస్ట్‌ట్రాక్‌ సీఏబీజీ

  • సీటీసీఏ-సీటీ-ఎఫ్ఎఫ్ఆర్‌తో శస్త్రచికిత్సకు ముందస్తు ప్రణాళిక

  • ఆస్టర్‌ రమేష్‌ ఆసుపత్రిలో నూతన వైద్య విధానం

విజయవాడ, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): అధునాతన సీటీసీఏ, సీటీ-ఎఫ్ఎఫ్ఆర్‌ సాంకేతికతలతో గుండె రక్తనాళాల్లోని బ్లాకేజీలను సమగ్రంగా అంచనా వేయవచ్చని ఆస్టర్‌ రమేష్‌ హాస్పిటల్స్‌ ఎండీ, చీఫ్‌ కార్డియాలజీ డాక్టర్‌ రమేష్‌ బాబు తెలిపారు. క్యాథ్‌ యాంజియోగ్రామ్‌ చేయకుండానే సీఏబీజీ శస్త్రచికిత్సకు అవసరమైన సమాచారాన్ని తెలుసుకునే అవకాశముందని వెల్లడించారు. విజయవాడలోని రమేష్‌ హాస్పిటల్‌లో సోమవారం మీడియాతో మాట్లాడుతూ, విదేశాల్లో నివసిస్తున్న 56 ఏళ్ల ఎన్‌ఆర్‌ఐ రోటీన్‌ హెల్త్‌ చెకప్‌ కోసం ఆసుపత్రికి వచ్చారని, ఆయనకు సీటీసీఏ నిర్వహించగా గుండెలోని మూడు ప్రధాన రక్తనాళాల్లో బ్లాకేజీలు ఉన్నట్టు గుర్తించామన్నారు. అనంతరం సీటీ-ఎఫ్ఎఫ్ఆర్‌ ద్వారా బ్లాకేజీలు గుండె రక్తప్రసరణపై చూపుతున్న ప్రభావాన్ని అంచనా వేశామని తెలిపారు. ఈ సమాచారంతో సీఏబీజీకు ముందు చేసే ఇన్వెసివ్‌ క్యాథ్‌ యాంజియోగ్రామ్‌ లేకుండానే ఫాస్ట్‌ట్రాక్‌ సీఏబీజీ విజయవంతంగా నిర్వహించామని వెల్లడించారు. సాధారణ క్యాథ్‌ యాంజియోగ్రామ్‌ 2డీ ల్యూమెన్‌ సమాచారాన్ని అందిస్తుందని, అధునాతన సీటీసీఏ ద్వారా 3డీ రక్తనాళాల నిర్మాణం, కాల్షియం పరిమాణం, ప్లాక్‌ మార్పులు, బ్లాకేజీ స్వభావం వంటి మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చని డాక్టర్‌ రమేష్‌ బాబు వివరించారు.


ఏఐతో రోగికి అనుగుణంగా చికిత్స

ఏఐ సమన్వయంతో సీటీ సాంకేతికత మరింత అభివృద్ధి చెందుతోందని డాక్టర్‌ రమే్‌షబాబు తెలిపారు. గుండె రక్తనాళాల సమగ్ర సమాచారాన్ని విశ్లేషించి, రోగికి అనుగుణంగా చికిత్స, శస్త్రచికిత్స ప్రణాళికను ముందుగానే రూపొందించే దిశగా సీటీసీఏ అభివృద్ధి చెందుతోందన్నారు. ఆస్టర్‌ రమేష్‌ హాస్పిటల్స్‌లో 30 మంది కార్డియాలజిస్టులు, 10 మంది డీఎన్‌బీ వైద్య విద్యార్థుల బృందం సీటీసీఏపై నిరంతరం అధ్యయనం చేస్తోందని రమేష్‌ బాబు తెలిపారు. ఇటీవల అమెరికాలోని శాండియాగోలో జరిగిన కార్యక్రమంలో తమ వైద్యబృందం సీటీసీఏపై పోస్టర్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చిందని చెప్పారు. ఈ నెల 26, 27 తేదీల్లో తిరుపతిలో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ కార్డియాక్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా వార్షిక సదస్సులో గుండె జబ్బులను ముందుగానే గుర్తించడం, గుండెపోటు ముప్పును తగ్గించడం, సీటీ-ఎఫ్ఎఫ్ఆర్‌, సీటీ ప్లాక్‌ బయాలజీ, సీటీ గైడెడ్‌ పీసీఐ, సీటీ గైడెడ్‌ బైపాస్‌ సర్జరీ వంటి అంశాలపై ప్రజెంటేషన్‌ ఇచ్చినట్టు రమేష్‌ బాబు తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి...

పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. అక్టోబర్‌ 1న ఉదయం 6:30 నుంచే పింఛన్ల పంపిణీ

పీఎం కిసాన్ 24వ విడత.. రైతులు ఈ 3 పనులు పూర్తి చేయాల్సిందే..

Updated Date - Sep 29 , 2026 | 05:40 AM