Share News

వైద్య రంగంలో..పరిశోధనలు విస్తరించాలి

ABN , Publish Date - Oct 27 , 2026 | 04:47 AM

వైద్య రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు పరిశోధనలను మరింత విస్తరించాలని, వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించాలని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ పిలుపునిచ్చారు.

వైద్య రంగంలో..పరిశోధనలు విస్తరించాలి

  • వినూత్న ఆవిష్కరణలే కీలకం

  • వైద్యులకు రోగి భద్రత, గోప్యత ముఖ్యం

  • ప్రధాని నాయకత్వంలో వైద్య విద్య విస్తరణ

  • సాంకేతికత పెరిగినా ఆత్మీయ స్పర్శ ప్రధానం

  • ‘ఎన్టీఆర్‌’ నిబద్ధతకు హెల్త్‌ వర్సిటీ నిదర్శనం

  • వర్సిటీ రూబీ జూబ్లీ వేడుకల్లో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌

  • వైద్య రంగంలో మార్పులు రావాలి: గవర్నర్‌

అమరావతి, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): వైద్య రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు పరిశోధనలను మరింత విస్తరించాలని, వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించాలని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ పిలుపునిచ్చారు. భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా పరిశోధనలు, సరికొత్త ఆవిష్కరణలు కీలకమని పేర్కొన్నారు. డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ ప్రారంభించి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విజయవాడలో నిర్వహించిన హెల్త్‌ వర్సిటీ రూబీ జూబ్లీ వేడుకల్లో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాజీ సీఎం ఎన్టీఆర్‌ దార్శనికతకు హెల్త్‌ వర్సిటీ నిదర్శమని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో వైద్య విద్య గణనీయంగా విస్తరించిందని తెలిపారు. 2014కు ముందు దేశంలో 387 మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య 846కు పెరిగాయన్నారు. 51 వేల ఎంబీబీఎస్‌ సీట్లను 1.4 లక్షలకు, 31 వేల పీజీ సీట్లను 86 వేలకు పెంచినట్లు వివరించారు.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డిజిటల్‌ హెల్త్‌, టెలిమెడిసిన్‌ వంటి అధునాతన సాంకేతికతలను అందిపుచ్చుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత సంస్థలతో హెల్త్‌ వర్సిటీ ఒప్పందాలు చేసుకోవాలని సూచించారు. వైద్య రంగంలో సాంకేతిక పురోగతి ఎంత పెరిగినా రోగి భద్రత, డేటా గోప్యత, నైతికత ముఖ్యమన్నారు. వైద్యుడికి రోగుల మధ్య ఆత్మీయ స్పర్శ, కరుణను సాంకేతిక భర్తీ చేయలేదని స్పష్టం చేశారు. హెల్త్‌ వర్సిటీ పరిశోధకులు వైద్య శాస్త్రానికి చేసిన కృషి ద్వారా నోబెల్‌ బహుమతి సహా ప్రపంచవ్యాప్త గుర్తింపును సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా సాగే పోరాటం.. అందరి సామూహిక బాధ్యత అని, మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించేందుకు వైద్య వర్గాలు నాయకత్వం వహించాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. అనంతరం మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు.


సాంకేతిక నైపుణ్యాలు ముఖ్యం

ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ చాన్సెలర్‌.. గవర్నర్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా వైద్య రంగంలో నూతన మార్పులు రావాలన్నారు. వర్చువల్‌ సిమ్యూలేషన్స్‌ నుంచి ఏఐ-అసిస్టెంటెడ్‌ లెర్నింగ్‌ వరకు విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవడం తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు. రోగి సంరక్షణలో మానవీయ విలువలను కొనసాగించాలన్నారు. ‘పద్మ’ అవార్డు గ్రహీతలు డాక్టర్‌ ఎం. రాజేంద్రప్రసాద్‌, పీజే దేవసేన, ప్రఖ్యాత న్యూరో సర్జన్‌ డాక్టర్‌ రాజశేఖర్‌ వంటి ప్రసిద్ధ వైద్యులు హెల్త్‌ వర్సిటీలో చదువుకుని దేశ విదేశాల్లో సేవలందిస్తున్నారని కొనియాడారు.

వర్సిటీ ఐదో దశాబ్దంలోకి అడుగుపెడుతున్న తరుణంలో బలమైన అకడమిక్‌ పాలన, ఉన్నత పరిశోధనలు, మెరుగైన క్లినికల్‌ శిక్షణతో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. హెల్త్‌ వర్సిటీ వీసీ డాక్టర్‌ పి. చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. వైద్య విద్య, పరిశోధనల్లో సరికొత్త అవకాశాలకు మార్గం సుగమం చేసేలా త్వరలోనే క్వాంటం బయాలజీ కోర్సులను ప్రవేశ పెడుతున్నామన్నారు. రాష్ట్రంలో మెడికల్‌ అకాడమీని ఏర్పాటు చేయాలని కోరారు. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.కె.రమేశ్‌ మాట్లాడుతూ.. వైద్య రంగంలో సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో, ఆధునిక టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకోవాలన్నారు.

అమెరికా, యూరప్‌ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో వైద్య చికిత్సల ఖర్చు భారీగా పెరిగిపోవడంతో అక్కడి ప్రజలు చికిత్సల కోసం దీర్ఘకాలంగా వేచి చూడాల్సిన పరిస్థితులున్నాయన్నారు. ఇదే సమయంలో మనదేశంలో నాణ్యమైన వైద్య సేవలు తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండడం దేశానికి ప్రధాన బలమని తెలిపారు. భవిష్యత్‌లో భారతదేశం ‘మెడికల్‌ టూరిజం హాబ్‌’గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పార్థసారథి, ఎంపీ కేశినేని తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడిన ‘అర్నబ్’

అతి తీవ్ర తుఫాను..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

Updated Date - Oct 27 , 2026 | 04:47 AM