అమ్మతోనూ.. అమరావతితోనూ పెట్టుకోవద్దు
ABN , Publish Date - Oct 12 , 2026 | 04:57 AM
రాష్ట్ర రాజధాని గతంలో ప్రశ్నార్థకంగా ఉండేదని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు దార్శనికతతో ప్రపంచస్థాయి రాజధానిగా రూపుదిద్దుకుంటోందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు.
బాబు దార్శనికతతో రాజధాని నిర్మాణం
విజయవాడ ఉత్సవ్ ప్రారంభ సభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
విజయవాడ, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని గతంలో ప్రశ్నార్థకంగా ఉండేదని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు దార్శనికతతో ప్రపంచస్థాయి రాజధానిగా రూపుదిద్దుకుంటోందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. విజయవాడ పున్నమి ఘాట్‌లో విజయవాడ ఉత్సవ్ సీజన్-2 సాంస్కృతిక కళావేదికను ఆదివారం రాత్రి ప్రారంభించి మాట్లాడారు. కృష్ణానదికి ఓ వైపు దసరా ఉత్సవాలు జరుగుతున్నాయని, మరోవైపు ప్రపంచ రాజధాని రూపుదిద్దుకుంటోందని అన్నారు. అమ్మతోనూ, అమరావతితోనూ పెట్టుకోవద్దంటూ ప్రతిపక్ష పార్టీకి సెటైర్ వేశారు. దసరా ఉత్సవాలంటే గతంలో మైసూరు, కోల్‌కతా గుర్తుకు వచ్చేవన్నారు. అయితే విజయవాడలో జరిగే దసరా ఉత్సవాలకు బ్రాండింగ్ కల్పించేందుకు గతేడాది సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ప్రణాళిక చేశారని గుర్తు చేశారు. దుర్గమ్మ ఆశీస్సులతో గతేడాది ఉత్సవాలు గిన్నిస్ రికార్డును సాధించాయని గుర్తుచేశారు.
ఈ ఏడాది జరిగే ఉత్సవాలకు పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులను, కేంద్రమంత్రులను ఆహ్వానించామని తెలిపారు. స్థానిక కళాకారుల నుంచి దేశవ్యాప్తంగా పేరుగాంచిన కళాకారుల కళాప్రదర్శనలు విజయవాడ ఉత్సవ్‌లో వీక్షించే అవకాశం దక్కిందన్నారు. దాదాపు 4500 మందితో కళాప్రదర్శనకు విజయవాడ ఉత్సవ్ వేదిక అవుతోందన్నారు. హోంమంత్రి అనిత, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి పాల్గొన్నారు. తొలిరోజు పున్నమి ఘాట్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఈ వార్తలనూ చదవండి...
నెల్లూరులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్