Share News

కాలం కంటే వేగంగా బాబు ఆలోచనలు

ABN , Publish Date - Nov 13 , 2026 | 05:11 AM

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోలా నీరు, నిప్పు వలే ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూశ్‌ గోయెల్‌ అన్నారు.

కాలం కంటే వేగంగా బాబు ఆలోచనలు

  • ఏఐ, క్వాంటమ్‌పై ముందే ప్రణాళికలు

  • ఈజ్‌ ఆఫ్‌ బిజినెస్‌ దశలో ప్రస్తుతం దేశం

  • కానీ, స్పీడ్‌ ఆఫ్‌ బిజినెస్‌పై సీఎం కృషి

  • కేంద్ర మంత్రి పీయూశ్‌ గోయల్‌

విశాఖపట్నం, నవంబరు 12(ఆంధ్రజ్యోతి) : ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోలా నీరు, నిప్పు వలే ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూశ్‌ గోయెల్‌ అన్నారు. కాలం కంటే ముందు ఆలోచన చేసి ఏఐ, క్వాంటం లాంటి టెక్నాలజీల గురించి మాట్లాడిన వ్యక్తి సీఎం చంద్రబాబు అంటూ ప్రశంసించారు. విశాఖలో గురువారం ప్రారంభమైన సీఐఐ సదస్సుకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. పవిత్రమైన కార్తీక మాసంలో సదస్సు నిర్వహించటం సంతోషదాయకమన్నారు. ‘‘ఒక దీపం మరో దీపాన్ని వెలిగిస్తుంది.

పెట్టుబడుల సదస్సు కూడా దేశ వాణిజ్యాన్ని వృద్ధి చేస్తుంది.’’ అని తెలిపారు. ఇటీవలే 2 తుఫాన్లు ఏపీ తీరాన్ని తాకాయని, అయినా వెంటనే కోలుకుని విశాఖ నగరం పెట్టుబడుల సదస్సుకు వేదిక కావడం ఆశ్చర్యపరిచిందన్నారు. ‘‘పెట్టుబడుల కోసం చంద్రబాబు గట్టిగా పనిచేస్తారు. దేశం ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ గురించి మాట్లాడుకుంటే, ఆయన స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అమలు చేస్తున్నారు. పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచేలా పారిశ్రామిక ప్రోత్సాహకాలను అందించేందుకు ఎస్ర్కో ఖాతాను ప్రారంభించారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు స్వర్గధామంగా తయారుచేశారు.’’ అని కొనియాడారు.


కాకతీయ రాజు గణపతి దేవుడు అప్పట్లోనే విదేశీ పెట్టుబడిదారులకు విశ్వాసం కల్పించేలా కొన్ని శాసనాలు చేశారని గుర్తు చేశారు. అప్పుడూ, ఇప్పుడూ భారత్‌ విదేశీ పెట్టుబడిదారులకు విశ్వసనీయమైన భాగస్వామిగా ఉందన్నారు. విశాఖ స్టీల్‌ నుంచి సిలికాన్‌ సిటీగా ఎదుగుతోందన్నారు. ఓర్వకల్లు, పూడిమడక లాంటి ప్రాంతాలు గ్రీన్‌ఎనర్జీ కేంద్రాలుగా మారుతున్నాయని తెలిపారు.

భారత్‌ సాంకేతిక బదిలీని కోరదు. మేధోసంపత్తిని చౌర్యం చేయదు. భారత్‌, ఏపీలో పెట్టుబడులు పెట్టండి. తయారీ రంగంలో, పర్యాటక రంగంలో వేర్వేరు రంగాల్లో అవకాశాలు ఉన్నాయి. దేశ భాషలందు తెలుగు భాష తీయనైనదని శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడో చెప్పారని, అలాంటి ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టాలన్నారు. పియూశ్‌ తన ప్రసంగం తెలుగు మాటలతో ముగించారు.

ఈ వార్తలనూ చదవండి:

విశాఖలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2026 ప్రారంభం

ఏపీకి పెట్టుబడుల వరద.. తొలిరోజే రూ.1.57 లక్షల కోట్ల ఒప్పందాలు

Updated Date - Nov 13 , 2026 | 05:14 AM