దీపావళికి పోలవరం వస్తా..!
ABN , Publish Date - Oct 10 , 2026 | 04:19 AM
ఈ ఏడాది దీపావళి పర్వదినం వేళలో పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తానని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ చెప్పారు. ఢిల్లీలో సీఆర్ పాటిల్‌తో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం భేటీ అయ్యింది.
సీఎంతో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్
12న పోలవరంపై జలశక్తి కార్యదర్శి అర్చన శర్మ సమీక్ష
అమరావతి, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది దీపావళి పర్వదినం వేళలో పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తానని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ చెప్పారు. ఢిల్లీలో సీఆర్ పాటిల్‌తో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల సమయంలో పోలవరం ప్రాజెక్టులను ప్రారంభించాలని భావిస్తున్నామని పాటిల్‌కు చంద్రబాబు వివరించారు. పోలవరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానిస్తామని చంద్రబాబు చెప్పారు. ఆలోగా పోలవరం ప్రాజెక్టు ప్రగతిని పరిశీలించేందుకు రావాలని పాటిల్‌ను చంద్రబాబు ఆహ్వానించారు. ఈ ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన పాటిల్ దీపావళి సమయంలో పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తానని చంద్రబాబుతో అన్నారు. ఆ సమయంలో వాతావరణ బాగుంటుందని రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ వివరించారు.
శ్రీశైలం నుంచి తెలంగాణ నీటితోడకంపై ఏపీ ఫిర్యాదు
పోలవరం ప్రాజెక్టుపై 12న కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి అర్చనశర్మ సమీక్షను నిర్వహిస్తారు. ఈ సమీక్షలో పోలవరం ప్రాజెక్టు అథారిటీతో పాటు, కేంద్ర జల సంఘం, రాష్ట్ర జల వనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి తదితరులు పాల్గొంటారు. శుక్రవారం అర్చన శర్మను ఢిల్లీలో ఆమె కార్యాలయంలో శశిభూషణ్‌కుమార్, ప్రభుత్వ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు కలిశారు. ఈ సందర్భంగా శ్రీశైలం జలాశయం నుంచి విద్యుదుత్పత్తి కోసం తెలంగాణ రోజుకు 1.50 టీఎంసీలను వాడేస్తుందని శశిభూషణ్‌కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై కృష్ణా నదీ యాజమాన్య సంస్థ(కేఆర్‌ఎంబీ)తో మాట్లాడతానని, త్వరలో రెండు రాష్ట్రాలతో సమావేశం ఏర్పాటు చేయమని కేఆర్‌ఎంబీకి సూచిస్తానని అర్చనశర్మ వెల్లడించారు.
ఈ వార్తలనూ చదవండి:
సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు..
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు