Share News

పేదింటి యువతికి ఎన్ని కష్టాలో..

ABN , Publish Date - Oct 14 , 2026 | 04:58 AM

రెక్కాడితే కానీ డొక్కాడని కడు పేదరికం.. ఉండటానికి ఇల్లూ లేదు!.. ఇంతటి దయనీయ స్థితిలో ఉన్న ఆ కుటుంబంలో 20 ఏళ్ల యువతిపై క్యాన్సర్‌ పడగ విప్పింది.

 పేదింటి యువతికి ఎన్ని కష్టాలో..

  • 20 ఏళ్లకే పడగ విప్పిన క్యాన్సర్‌!

  • ఇద్దరు బిడ్డలతో పూట గడవక విలవిల

  • దాతల సాయం కోసం ఎదురుచూపు

గుంటూరు కార్పొరేషన్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): రెక్కాడితే కానీ డొక్కాడని కడు పేదరికం.. ఉండటానికి ఇల్లూ లేదు!.. ఇంతటి దయనీయ స్థితిలో ఉన్న ఆ కుటుంబంలో 20 ఏళ్ల యువతిపై క్యాన్సర్‌ పడగ విప్పింది. ఆస్పత్రిలో చూపించుకోవడానికి, మందులు కొనుగోలు చేయడానికి డబ్బులు లేక బాధితురాలు అల్లాడుతోంది. మరోవైపు తన ఇద్దరు బిడ్డల పోషణభారం కష్టమవడంతో కుమిలిపోతోంది. వివరాలివి.. గుంటూరు నగరంలోని పాత గుంటూరు శుద్థపల్లి డొంకలో గల ప్రగతినగర్‌లో నివాసం ఉంటోంది గొట్టిపాటి కృష్ణ సాయిలక్ష్మి. ఆమెకు చిన్న వయసులోనే పెద్దలు వివాహం జరిపించారు. భర్తతోపాటు కూలి పనులు చేసుకొని జీవిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు ఉంటున్నది పేరుకే ఇల్లు. రెండు రేకులు, చుట్టూ గుడ్డలు కట్టుకొని జీవితాన్ని సాగదీస్తున్నారు.

ఇటీవల సాయిలక్ష్మి తీవ్ర అనారోగ్యానికి గురయింది. ప్రకాశం జిల్లాలో ఉన్న ఆమె తల్లి సాయిలక్ష్మిని గుంటూరులోని ఒమేగా క్యాన్సర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించి సాయిలక్ష్మికి ‘కార్సినోమా అక్యూట్‌ లుకేమియా’ అనే సోకిందని నిర్థారించారు. వైద్యానికి లక్షల్లో ఖర్చవుతుందని తెలిపారు. ప్రస్తుత అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా కూలి పనులు చేయకూడదని చెప్పారు. కానీ.. సాయిలక్ష్మి కూలికి వెళ్లకపోతే ఇల్లు గడవదు. బిడ్డల పోషణ భారంతోపాటు.. మందులు కొనుక్కోవడానికీ కష్టంగా ఉంది. తన పేదరికం, తనకు సోకిన క్యాన్సర్‌ వ్యాధిని దృష్టిలో పెట్టుకొని.. దాతలు ఆదుకోవాలని ఆమె కన్నీటితో వేడుకుంటోంది. సాయం చేసే దాతలు.. జి. కృష్ణ సాయిలక్ష్మి, ఫోన్‌ పే నంబర్‌ 79819 30029, లేదా ఎస్‌బీఐ అకౌంట్‌ నంబరు 45653969148, లక్ష్మీపురం బ్రాంచ్‌, గుంటూరు. ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌: ఎస్‌బిఐఇన్‌ 0011094కు నగదు వేయాలని వేడుకొంటున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

కొత్త డీఎస్సీలో 290 పోస్టులు

గిన్నిస్‌ బుక్‌లోకి 75 గంటల డప్పుమోత

Updated Date - Oct 14 , 2026 | 04:59 AM