సర్వభ్రష్టం!
ABN , Publish Date - May 02 , 2026 | 04:31 AM
రాష్ట్రంలో విధ్వంసం సృష్టించిన గత వైసీపీ ప్రభుత్వం...టీటీడీ పాలననూ సర్వభ్రష్టం పట్టించిందని రిటైర్డు సీఎస్ దినేశ్‌కుమార్ ఏకసభ్య కమిషన్ నివేదిక తేల్చింది. పవిత్ర లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి సరఫరా నిబంధనల సడలింపు విషయంలో తెలిసీ..
సకల వ్యవస్థల వైఫల్యంతోనే కల్తీ నెయ్యికి దారి
జగన్ హయాంలో నాణ్యతకు టీటీడీ పాతర
కల్తీని పట్టే వ్యవస్థలు కరువు.. చెలరేగిన ‘కల్తీ’ దారులు
వారు కోరినట్టు టెండరు రూల్స్‌ను మార్చిన వైనం
తెలిసీ.. సడలింపునకు సింఘాల్ ఆమోదం
‘సడలింపు’తో రాచమార్గంలో కల్తీ నెయ్యి దందా
సింఘాల్ సహా నాటి అధికారులంతా దోషులే
ఘోరంగా కొనుగోలు విభాగం.. ప్రక్షాళన చేయాలి
తక్కిన వ్యవస్థలనూ భారీగా సంస్కరించాలి
లోయెస్ట్ ప్రైస్ బిడ్.. విధానానికి స్వస్తి పలకాలి
రిటైర్డు సీఎస్ దినేశ్‌కుమార్ కమిషన్ సిఫారసులు
(అమరావతి, ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో విధ్వంసం సృష్టించిన గత వైసీపీ ప్రభుత్వం...టీటీడీ పాలననూ సర్వభ్రష్టం పట్టించిందని రిటైర్డు సీఎస్ దినేశ్‌కుమార్ ఏకసభ్య కమిషన్ నివేదిక తేల్చింది. పవిత్ర లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి సరఫరా నిబంధనల సడలింపు విషయంలో తెలిసీ.. అప్పటి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ నిర్లక్ష్యం వహించారని ఆ నివేదికలో కమిషన్ ఆక్షేపించినట్టు సమాచారం. ‘అప్పటికి ఐదు నెలల క్రితం నెయ్యి సరఫరాలను పటిష్ఠం చేసేందుకు నాటి ప్రభుత్వం (టీడీపీ సర్కారు) చర్యలు తీసుకున్నప్పుడు ఈవోగా సింఘాలే ఉన్నారు. అలాంటిది ‘సడలింపు’ను తానే ఆ తర్వాత సాగనీయడం బాధ్యతారహితమే’ అని కమిషన్ తప్పుబట్టినట్లు తెలిసింది. నెయ్యి సడలింపు నిబంధనలతోపాటు కీలక వ్యవస్థల్లోని లోపాలు కూడా జతకలిసి కల్తీ నెయ్యి దందాకు దోహదం చేశాయని నిర్ధారించింది. కొనుగోలు విధానం ఏమీ బాగాలేదని, మొత్తంగానే ఆ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని సూచించింది. మిగతా వ్యవస్థల్లోనూ భారీ సంస్కరణలు చేపట్టాలని కోరింది. టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో విచారణ జరిపిన సుప్రీంకోర్టు పర్యవేక్షణలోని సీబీఐ సిట్ అప్పటి టీటీడీ అధికారులపై చర్యలకు సిఫారసు చేసింది. దీనిపై పరిశీలనకు కూటమి ప్రభుత్వం రిటైర్డు సీఎస్ దినేశ్‌కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. కమిషన్ గురువారం 54పేజీల తన నివేదికను ప్రభుత్వానికి అందించింది.
ఇలా ముంచేశారు..
ప్రభుత్వంలోని అత్యంత సన్నిహిత వర్గాలు అందించిన సమాచారం ప్రకారం.. దినేశ్‌కుమార్ కమిషన్.. నాటి టీటీడీ పాలన అంతా లోపాలపుట్ట అని తేల్చింది. కల్తీ నెయ్యికి దారితీసిన పరిస్థితులకు కమిషన్ ప్రధానంగా మూడు అంశాలను గుర్తించింది. గత వైసీపీ పాలనలో ఒక పద్ధతి ప్రకారం టీటీడీలోని కీలక వ్యవస్థలను దెబ్బతీశారు. ఇక.. నెయ్యి సరఫరాల నిబంధనలను సడలించడం ద్వారా కల్తీలకు భారీఎత్తున తెర తీశారు. అప్పటి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం, బాధ్యత మరిచి వ్యవహరించడంతో నాటి టీటీడీ బోర్డు ఇష్టారాజ్యం వ్యవహరించడానికి అవకాశం ఇచ్చింది. అప్పటికే నిర్వీర్యంగా మారిన వ్యవస్థలు ఈ కల్తీ నెయ్యి దందాను ఏ దశలోనూ అడ్డుకోలేకపోయాయి. ఈ వ్యవహారంలో అప్పటి ఈవో సింఘాల్ దగ్గర నుంచి డెయిరీల తనిఖీ బృందాలు, ప్రొక్యూర్‌మెంట్ అధికారులు, ఇతర సిబ్బంది అంతా దోషులే. ఇంకా.. నెయ్యి కొనుగోలు ప్రక్రియలో తలెత్తిన వ్యవస్థాగత వైఫల్యాలే లడ్డూ ప్రసాద పవిత్రతను దెబ్బతీశాయి. ఆహార భద్రతా నియమాలను కూడా పూర్తిగా నాడు ఉల్లంఘించారు. అసలు టీటీడీ ప్రొక్యూర్‌మెంట్ విధానమే బాగోలేదు. అందులోని పలు వ్యవస్థాగత లోపాలు కల్తీ విధానం బలపడటానికి దోహదం చేశాయి. టీటీడీ పాలక మండలి 2019లో (టీడీపీ ప్రభుత్వం) నెయ్యి కొనుగోలుకు సంబంధించి గట్టి నిబంధనలు రూపొందించింది. డెయిరీల అర్హత, నాణ్యమైన నెయ్యి సరఫరాకు మంచి సరఫరాల వరకు సకల వ్యవస్థలను పటిష్ఠపరిచింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం (వైసీపీ) ఐదు నెలల్లోనే వాటిని సడలించింది. దీంతో గుర్తింపు లేని డెయిరీలు, సరఫరా కంపెనీలు సైతం నెయ్యి టెండర్లలో పాల్గొనడానికి వెసులుబాటు కలిగింది. టీటీడీలో నెయ్యి కొనుగోలు టెండర్ ప్రక్రియలో అవకతవకల కారణంగా కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని కమిషన్ తేల్చింది. ఇంకా.. నెయ్యి ధరల తగ్గింపులో నిలకడలేని తనంతో అధికారులు వ్యవహరించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో డెయిరీలతో జరిపిన చర్చలు టెండర్ నిబంధనలను ఉల్లంఘించడానికి ఆస్కారం కల్పించాయి. దీంతో అర్హత లేని కంపెనీలకు టెండర్లు దక్కాయి. లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి విషయంలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వలేదు. కేవలం తక్కువ ధరకు సరఫరా చేసే కంపెనీలకు పెద్దపీట వేశారు. దీనివల్ల కల్తీని నేరుగా ప్రోత్సహించినట్టయింది. నెయ్యిలో కల్తీ జరిగిన విషయాన్ని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ తన నివేదికలో ధ్రువీకరించింది. ఈ నివేదిక ఆధారంగా ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని కమిషన్ తన నివేదికలో తెలిపింది.
సింఘాల్ అశ్రద్ధతోనే కల్తీకి ఊతం..
కీలకమైన సిటోస్టోరో పరీక్షలకు సంబంధించిన ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిబంధనలను అమలు చేయడంలో టీటీడీ అధికారులు విఫలమయ్యారు. నెయ్యి సరఫరాదారులు అడిగినవిధంగా నిబంధనలు మార్చుతూ పోయారు. 2022 జూలై 1నుంచి టీటీడీలో ఇదే పంథా కొనసాగింది. నాణ్యత పరీక్షలు చేయకుండానే 70లక్షల కిలోలకు పైగా నెయ్యిని సేకరించారు. టీటీడీలో నెయ్యి నిబంధనలను మెరుగుపరిచినప్పుడూ, వాటిని సడలించినప్పుడూ.. రెండు సందర్భాల్లోనూ టీటీడీ ఈవోగా అనిల్‌కుమార్ సింఘాల్ ఉన్నట్టు కమిషన్ తెలిపింది. ఆయన ఆమోదించిన తర్వాతే ఆ ప్రతిపాదనలు టీటీడీ బోర్డు ముందుకెళ్లి ఆమోదం పొందాయి. ఆయన అశ్రద్ధ వల్లే కల్తీ నెయ్యి వ్యవహారం చోటుచేసుకుంది. సింఘాల్‌తో పాటు టీటీడీ బోర్డు, కొనుగోలు కమిటీ, అదనపు ఈవో, ప్రొక్యూర్‌మెంట్ జీఎం సహా పలువురు సీనియర్ అధికారులదీ తప్పేనని కమిషన్ తేల్చింది.
కీలక సిఫారసులు..
టీటీడీ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితులను నామినేట్ చేసే నిబంధనను తొలగిస్తూ చట్ట సవరణ చేయాలి.
టీటీడీబోర్డులో వృత్తి నిపుణులు, వివిధ రంగాల్లో నిపుణులైన వారిని నియమించాలి.
టీటీడీ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఒక నిర్వహణ కమిటీని ఏర్పాటు చేయాలి.
నెయ్యి, ఇతర పదార్థాల సేకరణ విభాగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలి. అక్కడ అర్హత కలిగిన నిపుణుడిని అధికారిగా నియమించాలి.
టీటీడీలో ఫిర్యాదుల నిజ నిర్ధారణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
టీటీడీ వెబ్‌సైట్‌లో నాణ్యతా పరీక్షల నివేదికలు, సరఫరాదారుల వివరాలను ఉంచాలి.