కల్తీ కోసమే ‘కుట్ర’!
ABN , Publish Date - Jan 30 , 2026 | 05:15 AM
ఇది కాసుల కోసం కక్కుర్తి! పక్కాగా, ముందస్తు ప్రణాళిక రచించి, అమలు చేసిన కుట్ర! ఒకటీ రెండూ కాదు... ఏకంగా 60 లక్షల కిలోల కల్తీ నెయ్యిని టీటీడీకి అంటగట్టారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారు. సుప్రీంకోర్టు నియమించిన ‘సిట్’ స్వయంగా ఈ విషయం తేల్చింది. ‘మంచిది మాకు అక్కర్లేదు. రంగూ, వాసన ఉంటే చాలు...
‘సిట్’ చెప్పిందిలా...
‘‘నిబంధనలను ప్రైవేటు డెయిరీలకు అనుకూలంగా మార్చారు. సహకార డెయిరీలు టెండర్లలో పాల్గొనలేకపోయాయి. కనీసం చుక్కపాలు కూడా కొనుగోలు చేయని కంపెనీలు, ఈ రంగంలో అనుభవం లేని కంపెనీలకు టెండర్లలో పాల్గొనే వెసులుబాటు కల్పించారు. లడ్డూ ప్రసాదంకోసం ఉపయోగించే నెయ్యి నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీపడ్డారు!’’
‘కేజ్రీవాల్’ సూత్రం వర్తించదా?
‘పాలసీ’ని మార్చడం వల్లే లిక్కర్ కుంభకోణం జరిగిందంటూ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉండగానే అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు. నాటి ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియానూ సీబీఐ అరెస్టు చేసింది. కల్తీ నెయ్యికీ మూలం ‘పాలసీ’లో చేసిన మార్పులే. టెండరు నిబంధనలు, అర్హతలను సడలించడమే ఈ స్కామ్‌కు మూలం! ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఏకంగా సీఎం, డిప్యూటీ సీఎం పదవుల్లో ఉన్నవారినే సీబీఐ అరెస్టు చేసింది. కల్తీ నెయ్యి కుట్ర మొత్తం ఛేదించిన సీబీఐ... అసలు సూత్రధారులను, అంటే ‘పాలసీ’ మార్చిన నాటి పెద్దల జోలికి ఎందుకు వెళ్లడంలేదు?
నిబంధనల సడలింపే అసలు కారణం.. కల్తీ నెయ్యిపై ‘సిట్’ తేల్చిన నిజమిది
నేతి బీరలో... నెయ్యి ఉంటుందా? ఉండనే ఉండదు! పేరులో మాత్రమే ‘నెయ్యి’ ఉంటుంది. అలాగే... వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి ప్రసాదాల లడ్డూల కోసం సరఫరా చేసిన ‘నెయ్యి’లోనూ నెయ్యి లేదు. అది నెయ్యి కానే కాదు. వందశాతం రసాయనాల మిశ్రమం! ఈ విషయం తేల్చింది ఎవరో కాదు! సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ, రాష్ట్ర పోలీసులతో ఏర్పడిన ప్రత్యేక దర్యాప్తు బృందం! తిరుమలకు వెళ్లి అత్యంత పవిత్రంగా తెచ్చుకుని... ఇంట్లో పూజ చేసిన తర్వాత కళ్లకద్దుకుని తీసుకునే ప్రసాదాన్ని ఇంత ఘోరంగా కల్తీ చేసిన పాపం మూటగట్టుకున్నారు. కాసుల కోసం కక్కుర్తి పడి కల్తీ సరుకులు వాడే హోటళ్లు, డాబాల తరహాలో... నీచంగా, దారుణంగా శ్రీవారి లడ్డూకు కల్తీ నెయ్యిని సరఫరా చేశారు. నాటి టీటీడీ పెద్దలు నెయ్యి సరఫరా టెండరు నిబంధనలు సడలించి ‘కల్తీ’కి తలుపులు బార్లా తెరిచారు. ఈ విషయం ‘ఆంధ్రజ్యోతి’ ఎప్పుడో చెప్పింది. ఇప్పుడు... ‘సిట్’ కూడా నిర్ధారించింది.
ఏడాదిన్నర కిందటే ‘ఆంధ్రజ్యోతి’ చెప్పింది
టీడీపీ హయాంలో కఠినమైన నిబంధనలు
వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సడలింపులు
చుక్క పాలు కొనని కంపెనీలకూ ‘ఆహ్వానం’
అనుభవం, అర్హతలకు పాలకమండలి పాతర
పాత్రధారులు సరే... సూత్రధారులు ఎవరు?
అంతిమ లబ్ధిదారుల గుట్టు రట్టు చేస్తారా?
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ఇది కాసుల కోసం కక్కుర్తి! పక్కాగా, ముందస్తు ప్రణాళిక రచించి, అమలు చేసిన కుట్ర! ఒకటీ రెండూ కాదు... ఏకంగా 60 లక్షల కిలోల కల్తీ నెయ్యిని టీటీడీకి అంటగట్టారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారు. సుప్రీంకోర్టు నియమించిన ‘సిట్’ స్వయంగా ఈ విషయం తేల్చింది. ‘మంచిది మాకు అక్కర్లేదు. రంగూ, వాసన ఉంటే చాలు... కల్తీ నెయ్యే కావాలి’ అనేలా జగన్ సర్కారు హయాంలో వ్యవహరించారు. 2020లోనే దీనికి స్కెచ్ వేశారని ‘సిట్’ తేల్చింది. అంతకుముందుదాకా ఉన్న కఠినమైన నిబంధనలను వ్యూహాత్మకంగా సడలించేశారు. అప్పుడు టీటీడీ చైర్మన్‌గా ఉన్నది వైవీ సుబ్బారెడ్డి. టీటీడీ కార్యనిర్వహణాధికారి(ఈఓ)గా పనిచేసింది, ఇప్పుడూ అదే పదవిలో ఉన్న అనిల్ కుమార్ సింఘాల్! నిబంధనల సడలింపు ఫలితంగా... నాణ్యతా ప్రమాణాలకు రక్షణ కవచంలా ఉన్న అర్హతలు చెరిగిపోయాయి. దిక్కుమాలిన, ఊరూపేరులేని, ఒక్క ఆవు లేని, చుక్క పాలూ సేకరించని ఉత్తుత్తి కంపెనీలు నెయ్యి సరఫరా కాంట్రాక్టు దక్కించుకున్నాయి. తిరుమలకు యథేచ్ఛగా కల్తీ నెయ్యిని సరఫరా చేశాయి. ఈ విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ గతంలోనే వెలుగులోకి తెచ్చింది. ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు సీబీఐ నేతృత్వంలోని సిట్ కూడా అదే విషయం చెప్పింది.
కల్తీకి రాచమార్గం...
టీడీపీ పాలనలో 2019 ఏప్రిల్‌లోనే నెయ్యి కొనుగోలు టెండర్ల నిబంధనలను టీటీడీ కఠినతరం చేసే ప్రక్రియ మొదలుపెట్టింది. ఇందుకోసం కమిటీని ఏర్పాటు చేసిందని సిట్ తెలిపింది. ‘‘నెయ్యి కొనుగోలుకు జాతీయస్థాయి కేటగిరీ టెండర్లు పిలవాలి. టెండర్లలో పాల్గొనే కంపెనీల వార్షికాదాయం 250 కోట్లు ఉండాలి. రోజువారీగా కనీసం 4 లక్షల లీటర్ల పాలు కొనుగోలు చేస్తుండాలి. ఈ మేరకు భారత ఆహార ప్రమాణాల అథారిటీ (ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ) నుంచి ధ్రువీకరణ పొంది ఉండాలి’’ అని కమిటీ సిఫారసు చేసింది. కమిటీ నివేదిక ఇచ్చేనాటికి రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. జగన్ 2019 మే నెలలో ముఖ్యమంత్రి అయ్యారు. వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ అయ్యారు. కానీ, పూర్తిస్థాయి పాలకమండలి ఏర్పాటుకాలేదు. దీంతో ఆ కమిటీ సిఫారసులను నాటి టీటీడీ ఈవో ఆమోదించారు. 2019 ఆగస్టు నుంచి కొత్త సిఫారసులు అమలులోకి వచ్చాయి.
వైవీ నాయకత్వంలో రూల్స్ రివర్స్
వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన పూర్తిస్థాయి పాలకమండలి ఏర్పడగానే... ‘కథ’ మారిపోయింది. ‘ఇంత కఠినమైన నిబంధనలుంటే ఎలా? కల్తీకి ఆస్కారం కల్పించాలి కదా!?’ అన్నట్లుగా ఆ నిబంధనలు మార్చాలని భావించారు. 2020 జనవరిలో ప్రొఫెషనల్ కమిటీని ఏర్పాటు చేశారు. ‘టెండర్లలో పోటీ పెంచి అత్యధికులు పాల్గొనేలా చూడాలి’ అనే పేరుతో, నిబంధనల సడలింపునకు తెరలేపారు. టెండర్లలో పాల్గొనే కంపెనీలు రోజుకు 4 లక్షల లీటర్ల పాలు కొనుగోలు చేస్తుండాలనే నిబంధన ఎత్తేశారు. డెయిరీ నిర్వహణ కాలపరిమితి మూడేళ్ల నుంచి ఏడాదికి కుదించారు. కంపెనీ వార్షికాదాయం 150 కోట్లు ఉంటే చాలని తేల్చేశారు. ‘టీటీడీకి నెయ్యి సరఫరా చేసే డెయిరీ అసలు పాలు సమీకరించకున్నా ఫర్వాలేదు’ అని తేల్చడం మొత్తం వ్యవహారానికి పరాకాష్ఠ. ప్రొఫెషనల్ కమిటీ సిఫారసులను బోర్డు ఫిబ్రవరి 2న ఆమోదించింది. తద్వారా ‘కల్తీకి రాచమార్గం వేశారు’ అని ‘సిట్’ స్పష్టం చేసింది.
నెయ్యి సరఫరా ఎలా?
సిట్ విచారణ ఓ మౌలికమైన, కీలకమైన అంశాన్ని లేవనెత్తింది. రోజుకు సగటున 4 లక్షల లీటర్ల పాలు సేకరించే డెయిరీలే టీటీడీకి నెయ్యి సరఫరా చేయాలన్న నిబంధన ఉంటే, దాన్ని వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని బోర్డు ఎందుకు తీసేసింది? పాల సేకరణ చేయని డెయిరీలకు ఎందుకు అవకాశం కల్పించింది? అంటే, పాల సేకరణ చేయని డెయిరీ నెయ్యి ఎలా తయారు చేస్తుంది? టెండర్‌లో ఈ వెసులుబాటు అనేదే కల్తీ నెయ్యి కోసం జరిగిన తొలిప్రయత్నంలా ఉంది. పాలు సేకరించని డెయిరీ నెయ్యి ఎలా తయారు చేస్తుంది? సహజంగానే కల్తీనెయ్యిని తయారుచేస్తుంది. నె య్యి సరఫరాలో ఇదే జరిగింది కదా. అంటే, ఫక్తు కల్తీనెయ్యిని కొనాలన్న ముందస్తు కుట్రతోనే నిబంధనలను సడలించి, ఆ తర్వాత దిక్కుమాలిన కంపెనీలకే సరఫరా టెండర్ ఇచ్చారనేది ఇప్పుడు స్పష్టమైంది. నిబంధనల సడలింపు వల్ల ఏపీలోనే ప్రముఖమైన విజయా డెయిరీ, ఇతర కంపెనీలు పాల్గొనకుండా చేశారు. నిబంధనలకు గేట్లు ఎత్తివేయడంతో తాము కోరుకున్న కంపెనీలే టెండర్ దక్కించుకోవడం జరిగిందని ఈ నివేదికలోని అంశాలు తేటతెల్లం చేస్తున్నాయి.
నిబంధనల సడలింపే అసలు కారణం
సహకార డెయిరీలు రోజూ 4లక్షల లీటర్ల పాలను సేకరిస్తుంటాయి. సేకరించిన పాలతోనే నెయ్యిని తయారు చేస్తాయి. టీటీడీకి స్వచ్ఛమైన, నాణ్యతగల నెయ్యిని సరఫరా చేసిన చరిత్ర వాటిది. అలాంటి వాటిని టెండర్‌నుంచి దూరం పెట్టాలనే కుట్రతోనే... నిబంధనలను సడలించినట్లు ‘సిట్’ స్పష్టం చేసింది. దీని వెనుక కుట్రను నిగ్గుతేల్చింది. పాత్రధారులనూ గుర్తించారు. మరి... సూత్రధారుల సంగతేమిటి? అంతిమ లబ్ధి పొందింది ఎవరు? కల్తీనెయ్యి టెండర్లలో నాటి టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి సహాయకుడిగా ఉన్న చిన్న అప్పన్న (ఏ24) పాత్ర కీలకమని సిట్ తేల్చింది. ఆయనకు భారీగా డబ్బులు ముట్టాయని నిర్ధారించింది. పీఏను పట్టుకోగలిగిన సిట్, వారి వెనక ఉన్న పెద్దలను ఎందుకు పట్టించుకోవడం లేదు? పీఏ ఖాతాలోనే భారీగా ముడుపులు పడితే, ఆయనను నడిపించిన వారికి ఎంత అంది ఉంటుందో!