Share News

కర్ణాటక సత్రాల వివాదంపై పూర్తి వివరాలివ్వండి

ABN , Publish Date - Oct 14 , 2026 | 05:21 AM

తిరుమలలోని కర్ణాటక సత్రాల నిర్వహణ బాధ్యతలను పర్యాటక శాఖకు అప్పగించడంపై వివాదం చెలరేగిన నేపథ్యంలో

కర్ణాటక సత్రాల వివాదంపై పూర్తి వివరాలివ్వండి

  • ఆ రాష్ట్ర అదనపు సీఎస్‌కు టీటీడీ ఈవో లేఖ

తిరుపతి(టీటీడీ), అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): తిరుమలలోని కర్ణాటక సత్రాల నిర్వహణ బాధ్యతలను పర్యాటక శాఖకు అప్పగించడంపై వివాదం చెలరేగిన నేపథ్యంలో ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించాల్సిందిగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ అదనపు చీఫ్‌ సెక్రటరీకి టీటీడీ ఈవో రవిచంద్ర లేఖ రాశారు. ఈ వివాదం మరింత పెరగకుండా ఉండేందుకు వాస్తవ వివరాలను, సమాచారాన్ని త్వరితగతిన అందించాల్సిందిగా లేఖలో కోరారు. కర్ణాటక ప్రభుత్వం, కేఎస్‌టీడీసీ మధ్య కుదిరిన ఒప్పంద కాపీని పంపించాలని సూచించారు.

కాగా.. భక్తులకు మెరుగైన సేవలందించేందుకే టూరిజం కార్పొరేషన్‌కు బాధ్యతలు అప్పగించామని తిరుమల కర్ణాటక చారిటీ స్పెషల్‌ ఆఫీసర్‌ కోదండరామ్‌ తెలిపారు. తిరుమలలోని కర్ణాటక సత్రాల్లో మంగళవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కర్ణాటక చౌల్ట్రీల నిర్వహణ సరిగా లేదనే విషయమై ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. మెరుగైన నిర్వహణ కోసమే కేఎస్‌టీడీసీకి నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మేం టీటీడీకి వ్యతిరేకంగా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. టీటీడీ అడిగిన విధంగా అవగాహన ఒప్పందం, ప్రభుత్వ ఉత్తర్వులను అందిస్తాం’ అని కోదండరామ్‌ తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

కొత్త డీఎస్సీలో 290 పోస్టులు

గిన్నిస్‌ బుక్‌లోకి 75 గంటల డప్పుమోత

Updated Date - Oct 14 , 2026 | 05:21 AM