Share News

కేఎస్‌టీడీసీ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలి

ABN , Publish Date - Oct 12 , 2026 | 04:30 AM

పవిత్ర తిరుమల క్షేత్రంలోని కర్ణాటక రాష్ట్ర సత్ర సముదాయాన్ని వాణిజ్య కార్పొరేట్‌ సంస్థ అయిన కర్ణాటక రాష్ట్ర పర్యాటకాభివృద్ధి..

కేఎస్‌టీడీసీ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలి

  • కర్ణాటక ముఖ్యమంత్రికి భానుప్రకాష్‌రెడ్డి లేఖ

తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): పవిత్ర తిరుమల క్షేత్రంలోని కర్ణాటక రాష్ట్ర సత్ర సముదాయాన్ని వాణిజ్య కార్పొరేట్‌ సంస్థ అయిన కర్ణాటక రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ(కేఎస్‌టీడీసీ)కి 30 సంవత్సరాల పాటు బదిలీ చేస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు జి.భానుప్రకాష్‌ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. తక్షణం ఈ ఒప్పందాన్ని ఉపసంహరించాలని డిమాండ్‌ చేస్తూ ఆయన కర్ణాటక ముఖ్యమంత్రికి లేఖ పంపారు. తిరుమలలో 6.47 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కర్ణాటక సత్ర స్థలం టీటీడీకి చెందిన సంపూర్ణ ఆస్తి అని భానుప్రకాష్‌ రెడ్డి స్పష్టం చేశారు. కర్ణాటక నుంచి శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు వసతి కల్పించే పవిత్రమైన ధార్మిక ఉద్దేశంతో మాత్రమే టీటీడీ ఈ స్థలాన్ని నామమాత్రపు లీజుకు కేటాయించిందని తెలిపారు.

ఆ స్థలాన్ని కానీ, అందులోని హంపి, ఐహోళె, శ్రీకృష్ణదేవరాయ, హళేబీడు బ్లాకులు, కల్యాణ మండపం, రెస్టారెంట్లను మూడో పక్షానికి సబ్‌-లీజుకు ఇవ్వడానికి, బదిలీ చేయడానికి కానీ కర్ణాటక ప్రభుత్వానికి ఎలాంటి చట్టపరమైన హక్కులు లేవని పేర్కొన్నారు. ఈ వ్యాపార ఒప్పందం ఆంధ్రప్రదేశ్‌ హిందూ ధార్మిక, దేవదాయ ధర్మదాయ చట్టం-1987లోని సెక్షన్‌ 80, అలాగే టీటీడీ లీజు నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని స్పష్టంచేశారు. టీటీడీ ముందస్తు అనుమతి లేకుండా 50:50 నిష్పత్తిలో లాభాలు పంచుకునేలా ఉమ్మడి వ్యాపార భాగస్వామ్యం ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని వెల్లడించారు. కర్ణాటక ప్రభుత్వం ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకుని కేఎస్‌టీడీసీకి భవనాలను అప్పగించే ప్రక్రియను నిలిపివేయాలని భానుప్రకాష్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

ఈ వార్తలనూ చదవండి...

నెల్లూరులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్

Updated Date - Oct 12 , 2026 | 04:30 AM