తిరుపతిలో పట్టపగలే కిలోకు పైగా బంగారం చోరీ..
ABN , Publish Date - Jun 24 , 2026 | 09:49 PM
ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో పట్టపగలే భారీ చోరీ జరగడం తీవ్ర కలకలం రేపింది. షాపింగ్ వెళ్లి వచ్చేలోగా.. కిలో బంగారం దోచుకెళ్లారు దొంగలు.
తిరుపతి, జూన్ 24: ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో పట్టపగలే భారీ చోరీ జరగడం తీవ్ర కలకలం రేపింది. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటపతి నగర్‌లో నివాసముంటున్న ఒక టీటీడీ (TTD) ఉద్యోగి ఇంట్లో చొరబడిన దొంగలు ఏకంగా కిలోకు పైగా బంగారు నగలను అపహరించుకెళ్లారు. యశోదమ్మ అనే మహిళ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూ.. తన కూతుళ్లు గిరిజారాణి, విజయలక్ష్మి, మనవరాళ్లతో కలిసి ఒకే ఇంట్లో నివసిస్తోంది. బుధవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు షాపింగ్ కోసం బయటకు వెళ్లిన సమయంలో ఈ దోపిడీ జరిగింది. ఇంటి బయట ఆవరణలో ఉన్న వాషింగ్ మిషన్‌లో దాచి ఉంచిన తాళాలను దొంగలు గుర్తించారు. వాటితో ఇంటి తలుపులు, లోపలి బీరువాను సులభంగా తెరిచారు. అనంతరం బీరువాలో ఉన్న నగలతో కూడిన లాకర్‌ను మొత్తంగా ఎత్తుకెళ్లారు. షాపింగ్ ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన మనవరాళ్లు తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించి, వెంటనే యశోదమ్మకు, పోలీసులకు సమాచారం అందించారు.
పట్టపగలే ఇంత పెద్ద మొత్తంలో చోరీ జరగడంతో తిరుపతి రూరల్ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. రూరల్ సీఐ మద్దయ్య చారి ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించి వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు సీఐ మద్దయ్య చారి వెల్లడించారు. తాళాలు ఎక్కడ పెట్టింది తెలిసిన పాత నేరస్థులా లేదా తెలిసిన వారే ఈ పని చేశారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.